టాలీవుడ్ లో కళ తప్పిన దసరా?
ఒక దశలో దసరా పండుగ రోజు టాలీవుడ్లో ఏకకాలంలో దాదాపు వంద సినిమాలకు పైగా లాంచ్‌లు, పూజా కార్యక్రమాలు జరిగేవని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విజయదశమి అనగానే! ఒకప్పుడు థియేటర్ల వద్ద పండగ వాతావరణం, కొత్త సినిమాల పోస్టర్లు, భారీ ఓపెనింగ్స్‌తో పాటు సినీ కార్యాలయాలలో పూజా కార్యక్రమాల కోలాహలం ఉండేది. ముఖ్యంగా దసరా పర్వదినాన్ని అత్యంత శుభప్రదంగా భావించి టాలీవుడ్లో ఒకే రోజు డజన్ల కొద్దీ సినిమాలు లాంచ్ అయ్యేవి. ముహూర్తపు షాట్లు, పూజా కార్యక్రమాలతో టెలివిజన్ ఛానెళ్లు, పేపర్లు నిండిపోయేవి. కానీ కాలం మారుతున్న కొద్దీ టాలీవుడ్లో ఆనాటి దసరా కళ పూర్తిగా కనుమరుగైపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఒక దశలో దసరా పండుగ రోజు టాలీవుడ్లో ఏకకాలంలో దాదాపు వంద సినిమాలకు పైగా లాంచ్‌లు, పూజా కార్యక్రమాలు జరిగేవని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిన్న నిర్మాతల నుంచి పెద్ద బ్యానర్ల వరకు అందరూ సెంటిమెంట్‌గా భావించి విజయదశమినే కొత్త ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టే వేదికగా ఎంచుకునేవారు. ఆ రోజు ఉదయం నుండి స్టూడియోలన్నీ కొత్త దర్శకులు, హీరోలు, టెక్నీషియన్లతో కళకళలాడేవి. పరిశ్రమలో ప్రతి ఒక్కరూ పండుగ ఉత్సాహంతో పాటు కొత్త సినిమాల అనౌన్స్మెంట్లతో బిజీగా గడిపేవారు.
అయితే ప్రస్తుత టాలీవుడ్ పరిస్థితులను పరిశీలిస్తే ఆ పాత వైభవం ఎక్కడా కనిపించడం లేదు. ఈ ఏడాది దసరా సీజన్‌ను గమనిస్తే సినిమాల లాంచింగ్ సందడి దాదాపు శూన్యమనే చెప్పాలి. పండుగ రోజు కొత్త సినిమాలను ప్రారంభించే సంస్కృతి క్రమంగా కనుమరుగవుతోంది. పరిశ్రమలో పెరుగుతున్న నిర్మాణ వ్యయం.. బడ్జెట్ అంచనాలు.. హీరోల రెమ్యూనరేషన్లు వంటి కారణాల వల్ల నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తున్నారు. పూజా కార్యక్రమాలతో హడావుడి చేయడం కంటే.. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాతే అధికారికంగా సెట్స్ పైకి వెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు.
దీనికి తోడు డిజిటల్ యుగంలో సినిమా అనౌన్స్మెంట్ పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ముహూర్తపు పూజ ఫోటోలు ప్రెస్మీట్ల ద్వారా బయటికి వచ్చేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్స్ వచ్చాక ప్రత్యేకంగా టీజర్లు, మోషన్ పోస్టర్లు, అనౌన్స్మెంట్ వీడియోలతో హంగామా చేస్తున్నారు. దీంతో పండగ రోజు జరిగే సాంప్రదాయ లాంచింగ్‌ల ప్రాధాన్యత తగ్గిపోయింది. అలాగే పెద్ద సినిమాల షూటింగ్‌లు ఇప్పటికే ఆలస్యం కావడం.. బడ్జెట్ నియంత్రణ కారణంగా నిర్మాతలు ఆచితూచి వ్యవహరించడం కూడా ఇందుకు మరో ప్రధాన కారణం.
మరోవైపు బాక్సాఫీస్ వద్ద సినిమాల ఫలితాలు మారుతుండటంతో నిర్మాతలు తొందరపడి కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించడానికి సాహసించడం లేదు. కంటెంట్ మీద పూర్తి స్పతత వచ్చిన తర్వాతే బరిలోకి దిగాలనే పద్ధతిని పాటిస్తున్నారు. ఫలితంగా ఒకప్పుడు టాలీవుడ్‌కు ప్రత్యేకమైన కళను తెచ్చిన దసరా లాంచింగ్‌ల పండుగ వాతావరణం నేడు కనుమరుగై కార్పొరేట్ పద్ధతిలో జరిగే అధికారిక ప్రకటనలకే పరిమితమైంది.
అంతిమంగా టాలీవుడ్ దసరా అంటే అక్కడక్కడా? బాక్సాఫీస్ క్లాష్‌లకు మాత్రమే పరిమితమయింది తప్ప కొత్త సినిమాల హడావుడి ముహూర్తపు పూజల సందడి కనుమరుగైంది. కాలం మారినా? ట్రెండ్ మారినా? పాత కాలపు ఆ పండుగ జ్ఞాపకాలను.. ఆనాటి లాంచింగ్‌ల కోలాహలాన్ని సీనియర్ సినీ ప్రియులు ఎంతగానో మిస్ అవుతున్నారు. టాలీవుడ్ భవిష్యత్తు ఎలా ఉన్నా? దసరా రోజు కొత్త చిత్రాలతో కళకళలాడిన ఆ స్వర్ణయుగం మాత్రం తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.