కల్ట్ డైరెక్టర్ పూరీపై సొంత ఫ్యాన్స్ అసంతృప్తి!

విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న స్లమ్ డాగ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పూరీ, ప్రస్తుత Gen Z తరం గురించి చేసిన ప్రశంసలు ఇప్పుడు మిల్లీనియ‌ల్స్ మధ్య మిశ్రమ స్పందనను రేకెత్తిస్తున్నాయి.

Update: 2026-06-27 19:30 GMT

జెన్ జీ పై డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న స్లమ్ డాగ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పూరీ, ప్రస్తుత Gen Z తరం గురించి చేసిన ప్రశంసలు ఇప్పుడు మిల్లీనియ‌ల్స్ మధ్య మిశ్రమ స్పందనను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రెండు జెన‌రేష‌న్స్ మధ్య సరదా చర్చలకు కారణమయ్యాయి. టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ నేటి యువత గత తరంతో పోలిస్తే మరింత డిసిప్లిన్‌తో ఉంటారని, మ‌రింత ఎమోష‌నల్ అని పేర్కొన్నారు. అలాగే కొత్త తరం ఆలోచనా విధానం తనను ఆకట్టుకుందని చెప్పడంతో, అక్క‌డున్న వారి నుంచి చప్పట్లు కూడా వినిపించాయి.

అయితే ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో కొందరు మిల్లీనియల్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ను డైరెక్ట‌ర్ గా కల్ట్ స్థాయికి చేర్చిన సినిమాలు చూసి ఆదరించింది త‌మ జెన‌రేష‌నే అని, ఇడియట్, పోకిరి, బిజినెస్‌మ్యాన్, దేశముదురు వంటి సినిమాలు భారీ సక్సెస్‌లుగా నిలబెట్టింది కూడా మిల్లీనియల్స్ జనరేషన్‌నే అని గుర్తు చేస్తున్నారు. అలాంటి సమయంలో తమ తరం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా కేవలం Gen Zని మాత్రమే పొగడటం కొంత నిరాశ కలిగించిందని పలువురు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు పూరీ కామెంట్స్ ను సమర్థించే వారు కూడా ఉన్నారు. ప్రతి తరానికి ఓ స్పెషాలిటీ ఉంటుందని, ప్రస్తుత యూత్ లో కనిపిస్తున్న కొన్ని మంచి లక్షణాలను మాత్రమే పూరీ ప్రస్తావించారని, దాన్ని తరాల మధ్య పోలికగా చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై డిబేట్స్ కూడా కొనసాగుతున్నాయి.

పూరీ జగన్నాథ్ గతంలో కూడా యూత్ మనస్తత్వం, జీవనశైలి, సమాజంలో వస్తున్న మార్పులపై తనదైన శైలిలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అందువల్ల ఆయన తాజా కామెంట్స్ కూడా అదే కోణంలో చూడాలని కొందరు సినీ అభిమానులు చెబుతున్నారు. అయినప్పటికీ మిల్లీనియల్స్ నుంచి వస్తున్న రియాక్ష‌న్ నేపథ్యంలో, ఫ్యూచ‌ర్ లో జరిగే సినిమా ప్రమోషన్లలో పూరీ ఈ అంశంపై మరింత వివరణ ఇస్తారా లేదా రెండు తరాలను సమానంగా ప్రస్తావిస్తూ స్పందిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

కాగా పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న స్లమ్ డాగ్ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా, సంయుక్త మీనన్, టబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో సినిమాపై కూడా అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. సినిమా ప్రచారంలో భాగంగా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినిమాకు ఎక్స్‌ట్రా బ‌జ్ ను తీసుకొచ్చాయనే చెప్పాలి.

Tags:    

Similar News