ఒడియా సినిమా ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజుకు.. ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధితో!

ఈ సంద‌ర్భంగా ఒడియా చిత్ర పరిశ్రమ అభివృద్ధి , కళాకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని సీఎం మోహన్ చరణ్ మాఝీ స్పష్టం చేశారు.

Update: 2026-06-27 19:09 GMT

ప్ర‌భుత్వాల‌కు చిత్తశుద్ధి ఉన్న‌ప్పుడు ఏదైనా పాజిబులే. ముఖ్యంగా వినోద‌రంగాన్ని ప‌రుగులు పెట్టించాలంటే ప్ర‌భుత్వాల నుంచి క్రియేటివ్ ప‌రిశ్ర‌మ‌కు చాలా స‌హకారం అవ‌స‌రం. ఇప్పుడు అలాంటి ఒక విప్ల‌వాత్మ‌క‌ నిర్ణ‌యం తీసుకునేందుకు, త‌మ సినిమా ప‌రిశ్ర‌మ‌ను అంత‌ర్జాతీయ స్థాయికి చేర్చేందుకు ఒడిస్సా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంది. తాజాగా రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర పుర‌స్కారాల‌లో దీనిని ప్ర‌క‌టించింది.

ఒడియా చలనచిత్ర రంగం ఒడిశా రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి, అస్తిత్వానికి నిలువెత్తు అద్దం పడుతుందని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పేర్కొన్నారు. భువనేశ్వర్‌లోని లోక్ సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగిన `2023, 2024 రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం`లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో ఒడియా చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన 62 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులను ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించి, అవార్డులను అందజేశారు.

ఈ సంద‌ర్భంగా ఒడియా చిత్ర పరిశ్రమ అభివృద్ధి , కళాకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని సీఎం మోహన్ చరణ్ మాఝీ స్పష్టం చేశారు. ఇందుకోసం త్వరలోనే రాష్ట్రంలో సరికొత్త చలనచిత్ర విధానాన్ని తీసుకురాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. డిజిటల్ విప్లవం- ఒటిటి వేదిక‌ల‌ విస్తరణ కారణంగా ప్రాంతీయ కంటెంట్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటోందని... ఒడియా సినిమాల డిజిటల్ ప్రమోషన్‌కు ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

కళింగ స్టూడియో ఆధునీకరణ- పర్యాటక రంగ ప్రోత్సాహం

ఒడిశాలోని యువ ప్రతిభావంతులు అవకాశాల కోసం రాష్ట్రం దాటి వెళ్లకుండా... భువనేశ్వర్‌లోని ప్రముఖ `కళింగ స్టూడియో`ను అంతర్జాతీయ స్థాయి డిజిటల్ - పోస్ట్-ప్రొడక్షన్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణను కూడా అందించనున్నామ‌ని తెలిపారు. అంతేకాకుండా, ఒడిశాలోని అందమైన అడవులు, తీరప్రాంతాలు, జలపాతాలు, వారసత్వ ప్రదేశాలు సినిమా షూటింగులకు ఎంతో అనువైనవని పేర్కొంటూ.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ నిర్మాతలను ఒడిశాలో సినిమాలు తీయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

ఒడియా సినిమా చ‌రిత్ర ఇదీ

ఒడిశా రాష్ట్రం ప్రత్యేక ప్రావిన్స్‌గా ఏర్పడిన 1936వ సంవత్సరంలోనే ఒడియా చిత్ర పరిశ్రమ కూడా జన్మించడం ఒక చారిత్రాత్మక విశేషం. మోహన్ సుందర్ దేబ్ గోస్వామి రూపొందించిన మొట్టమొదటి ఒడియా చిత్రం `సీతా బిబాహా`తో ప్రారంభమైన ఈ ప్రయాణం, పౌరాణిక - ఆధ్యాత్మిక కథల నుండి నేడు సామాజిక అంశాల వైపు విజయవంతంగా అడుగులు వేసింది. గతంలో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన `మాయా మిరిగ`, `భూఖా` వంటి క్లాసిక్స్ నుండి... నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న `దామన్`, `ప్రతీక్ష`, `పుష్కర` వరకు ఒడియా సినిమా తన వైవిధ్యాన్ని చాటుకుంటూనే ఉంది.

తాజా రాష్ట్ర‌ అవార్డుల వేడుకలో 35 , 36వ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలను విజేతలకు అందజేశారు. జాతీయ అవార్డు గెలుచుకున్న పాపుల‌ర్ చిత్రం పుష్కర, మై స్వీట్ హౌస్‌వైఫ్ చిత్రాలకు సంయుక్తంగా 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. అలాగే 2024 సంవత్సరానికి గానూ సామాజిక నేపథ్యంతో తెరకెక్కిన `ఆశ్రమ్` సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రాలు ఒడియా సినిమాకు జాతీయ స్థాయిలో సరికొత్త గుర్తింపును తీసుకువచ్చాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు.

ఒరిస్సా సినీప‌రిశ్ర‌మ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌తో పోలిస్తే చాలా చిన్న ప‌రిశ్ర‌మ‌. అక్కడ బ‌డ్జెట్లు చాలా చిన్న‌వి. అందువ‌ల్ల స‌హ‌జంగానే టాలీవుడ్, బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లు అంటే ఒడియా ప్ర‌జ‌ల‌లో కుతూహాలం ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు ఒరిస్సాలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో అద్భుతంగా ఆద‌ర‌ణ పొందుతున్నాయి.

Tags:    

Similar News