మోదీపై మనవరాలి ప్రేమ.. సునీల్ శెట్టి ఏమన్నారంటే?
ఈ అలవాటును ఈవారాకు తమ ఫ్యామిలీలోని ఎవరూ నేర్పలేదని, తాను గానీ, తన కూతురు అతియా శెట్టి గానీ, ఆయా గానీ ప్రత్యేకంగా చెప్పలేదని సునీల్ శెట్టి స్పష్టం చేశారు.
సునీల్ శెట్టి తన మనవరాలు ఈవారా గురించి చెప్పిన ఓ చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని మరోసారి వ్యక్తం చేసిన ఆయన, 15 నెలల వయసున్న తన మనవరాలు కూడా మోదీ ఫొటోను గుర్తించి ప్రతిరోజూ ప్రత్యేకంగా స్పందిస్తోందని వెల్లడించారు. తన తాజా సినిమా వెల్‌కమ్ టు ది జంగిల్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తాను ఏ రాజకీయ పార్టీ గురించి మాట్లాడటం లేదని, ఒక లీడర్ గా మోదీ తనను ఆకట్టుకుంటారని, తనకు తన దేశం ఎంత ఇష్టమో, మోదీజీ కూడా అంతే ఇష్టమని, ఆయనలో ఏదో స్పెషాలిటీ ఉందని, తన మనవరాలు ఈవారా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో ఈవారాకు ఆమెను చూసుకునే ఆయా మోదీ ఫొటోను చూపించి మోదీజీ అని చెప్పిందని, అప్పటి నుంచి ప్రతి ఉదయం ఈవారా తన వద్ద ఉన్న సాయిబాబా పుస్తకాన్ని తీసుకుని అందులో ఉన్న మోదీ ఫొటోను తెరిచి మోదీజీ... మోదీజీ అంటూ పలకరిస్తోందని చెప్పారు. అంతేకాకుండా ఇంట్లోని గణపతి విగ్రహం వద్ద ఉన్న లడ్డూలను తీసుకుంటున్నట్లు నటించి, ఆ ఫొటోకు సమర్పిస్తున్నట్లు చేయడం కూడా తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.
ఈ అలవాటును ఈవారాకు తమ ఫ్యామిలీలోని ఎవరూ నేర్పలేదని, తాను గానీ, తన కూతురు అతియా శెట్టి గానీ, ఆయా గానీ ప్రత్యేకంగా చెప్పలేదని సునీల్ శెట్టి స్పష్టం చేశారు. ఈవారో ఇలా ఎందుకు చేస్తుందో తెలియదు. కానీ ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది. మోదీజీలో పిల్లలను కూడా ఆకర్షించే ప్రత్యేకత ఉందేమో అనిపిస్తుందంటూ వ్యాఖ్యానించారు.
ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు సునీల్ శెట్టి నిజాయితీగా తన అభిప్రాయాన్ని వెల్లడించారని ప్రశంసించగా, మరికొందరు చిన్నారి ప్రవర్తనకు రాజకీయ రంగు అద్దడం సరికాదంటూ విమర్శించారు. మరోవైపు ఈ ఇంటర్వ్యూ క్లిప్‌ను భారతీయ జనతా పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కూడా పంచుకోవడంతో ఈ అంశంపై చర్చ మరింత విస్తరించింది.