మ‌హేష్ ని రౌండ‌ప్ చేస్తోన్న‌డైరెక్ట‌ర్లు!

మరో నాలుగు నెలల్లో వారణాసి టాకీ పార్ట్ - మేజర్ షెడ్యూల్స్ పూర్త‌వుతుంది. దీంతో ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తదుపరి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేందుకు మహేష్ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించిన‌ట్లు స‌మాచారం.

Update: 2026-06-27 12:30 GMT

సూపర్‌స్టార్ మహేష్ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం `వారణాసి` షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ భారీ చిత్రం ముగింపు దశకు చేరుకోవ‌డంతో మహేష్ తదుపరి సినిమాల గురించిన ఆసక్తికర చర్చ మొదలైంది. మరో నాలుగు నెలల్లో వారణాసి టాకీ పార్ట్ - మేజర్ షెడ్యూల్స్ పూర్త‌వుతుంది. దీంతో ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తదుపరి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేందుకు మహేష్ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించిన‌ట్లు స‌మాచారం.

సాధారణంగా ఒక పెద్ద సినిమా పూర్తయిన తర్వాత హీరోలు కొంతకాలం విరామం తీసుకుంటారు. కానీ మహేష్ ఈసారి భిన్నమైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. `వారణాసి` లాంటి సుదీర్ఘమైన, శారీరకంగా ఎంతో శ్రమతో కూడిన ప్రాజెక్ట్ తర్వాత కూడా ఆయన బ్రేక్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారుట‌. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోని పలువురు క్రేజీ దర్శకులు మహేష్ ను రౌండప్ చేసి ఆయన కోసం సరికొత్త కథలను సిద్ధం చేసుకుని సంప్రదింపులు జరుపుతున్నారుట‌. ఇప్పటికే కొందరు టాప్ అండ్ మిడ్-రేంజ్ దర్శకులు మహేష్ కు లైన్స్ వినిపించినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. కమర్షియల్ ఎంటర్‌టైనర్ల నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ కథల వరకు మహేష్ టేస్ట్‌కు తగ్గట్టుగా వైవిధ్యమైన స్క్రిప్టులు ఆయ‌న టేబుల్ పైకి వచ్చాయి.

ఇప్పుడు మహేష్ చేయాల్సిన పని నెక్స్ట్ సినిమా కోసం వీరిలో ఒక దర్శకుడిని ఫైనల్ చేయడమే. తదుపరి సినిమాను మాత్రమే కాకుండా భవిష్యత్తు ప్రాజెక్టులను కూడా క్రమ పద్ధతిలో సెట్ చేసుకోవాలని సూపర్‌స్టార్ భావిస్తున్నారుట‌. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఆకాశంలో ఉంటాయి. కాబట్టి కథల ఎంపికలో మహేష్ ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. ఇమేజ్‌కు సరిపోయేలా.. గ్లోబల్ రీచ్ వచ్చేలా ఉండే కథలకే ఆయన మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోయే ఆ లక్కీ డైరెక్టర్ ఎవరు? ఆయన లైనప్‌లో ఏ ఏ దర్శకులు నిలవబోతున్నారు? అనే విషయాలపై నాలుగు నెల‌ల త‌ర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

`వారణాసి` పూర్తి కాకముందే టాలీవుడ్ టాప్ డైరెక్టర్లందరూ మహేష్ డేట్స్ కోసం గట్టిగానే పోటీ పడుతున్నారు. మరి కొన్ని రోజుల్లోనే ఈ క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే `వార‌ణాసి`తో మ‌హేష్ గ్లోబ‌ల్ స్టార్ అవుతారు. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి చిత్రాల‌న్నీ గ్లోబ‌ల్ రేంజ్ లోనే ఉంటాయా? రీజ‌న‌ల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌ల ఎంపిక ఉంటుందా? అన్న సందేహాలు కూడా లేక‌పోలేదు. మ‌హేష్ మాత్రం్ తాను ఏం చేసినా? టాలీవుడ్ లో ఉండే చేస్తాన‌న్నారు. ఆ మాట‌తో బాలీవుడ్ స‌హా ఇత‌ర మ‌రే ప‌రిశ్ర‌మ‌కు మ‌హేష్ వెళ్లే అవ‌కాశం లేద‌ని మ‌రోసారి గుర్తు చేసారు.

Tags:    

Similar News