ఇటీవల హిట్ సినిమాల వెనుక అసలు రహస్యం ఇదే!
స్టార్ హీరోల లేదా భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్ల పెంపు తాత్కాలికంగా మొదటి మూడు రోజులు వసూళ్లను పెంచవచ్చేమో కానీ కంటెంట్‌లో చిన్న లోపం ఉన్నా ద్వితీయార్థంలో వసూళ్లు దారుణంగా పడిపోతున్నాయి.
ఇటీవలి కాలంలో థియేటర్లకు ప్రేక్షకుల రాక గణనీయంగా పెరిగింది. ఓటీటీల వైపు మొగ్గుచూపిన జనం మళ్లీ వెండితెర అనుభూతిని ఆస్వాదించడానికి థియేటర్ల బాట పడుతున్నారు. సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడానికి బలమైన కంటెంట్ ఎంత ముఖ్యమో? సామాన్యుడికి అందుబాటులో ఉండే టికెట్ ధరలు కూడా అంతే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. కంటెంట్ బాగుండి, టికెట్ రేట్లు బడ్జెట్‌లో ఉంటే థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతాయని ఇటీవల వచ్చిన బాక్సాఫీస్ ఫలితాలు నిరూపిస్తున్నాయి.
గతంలో పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలను విపరీతంగా పెంచే సంస్కృతి ఎక్కువగా కనిపించింది. మొదటి వారం లేదా రెండు వారాల పాటు ధరలు పెంచడం వల్ల సాధారణ కుటుంబాలు థియేటర్లకు రావడానికి వెనుకాడాయి. నలుగురు ఉన్న కుటుంబం సినిమాకు వెళ్లాలంటే వేలల్లో ఖర్చయ్యే పరిస్థితి రావడంతో, కొన్ని రోజులు ఆగితే ఓటీటీలోనే వస్తుంది కదా అనే ఆలోచన ప్రేక్షకుల్లో బలపడింది. ఇది చిన్న, పెద్ద తేడా లేకుండా అనేక సినిమాల థియేట్రికల్ రన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
అయితే ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన అనేక చిత్రాలు టికెట్ ధరల ప్రాముఖ్యతను రీ-ఎస్టాబ్లిష్ చేశాయి. పెద్ది మినహాయిస్తే `మా ఇంటి బంగారం`,` లెనిన`, `చెన్నై లవ్ స్టోరీ`, `ఇరుముడి` వంటి సినిమాలు థియేటర్లలో బాగా ఆడటానికి కంటెంట్‌తో పాటు అందుబాటులో ఉన్న టికెట్ రేట్లే ప్రధాన కారణం.
ఇటీవల రిలీజ్ అయిన భక్తిరస చిత్రం `హనుమాన్ అంశ` తొలి వారాల్లో సాదాసీదాగా ప్రారంభమైనా? అందుబాటులో ఉన్న టికెట్ ధరల వల్ల సాధారణ ప్రేక్షకులు, కుటుంబాలు థియేటర్లకు తరలివచ్చారు. ఫలితంగా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగి ఆరో వారంలోనూ ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అ
స్టార్ హీరోల లేదా భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్ల పెంపు తాత్కాలికంగా మొదటి మూడు రోజులు వసూళ్లను పెంచవచ్చేమో కానీ కంటెంట్‌లో చిన్న లోపం ఉన్నా ద్వితీయార్థంలో వసూళ్లు దారుణంగా పడిపోతున్నాయి. 300 నుంచి 500 వరకు టికెట్ రేటు పెంచినప్పుడు ప్రేక్షకులు సినిమాపై అసాధారణ అంచనాలు పెట్టుకుంటారు. ఆ అంచనాలు అందుకోకపోతే నెగెటివ్ టాక్ వేగంగా వ్యాపించి, వారాంతం పూర్తయ్యేసరికే థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా రీజనబుల్ ధరలే శ్రీరామరక్ష అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
టికెట్ ధరలు అందుబాటులో ఉండటం వల్ల నిర్మాతలు, పంపిణీదారులకే కాకుండా థియేటర్ యజమానులకు కూడా విశేష ప్రయోజనం చేకూరుతోంది. టికెట్ ధర తక్కువగా ఉన్నప్పుడు ప్రేక్షకులు థియేటర్లలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ వంటి ఫుడ్ అండ్ బెవరేజెస్ కోసం ఖర్చు చేయడానికి వెనుకాడరు. దీనివల్ల ఆడిటోరియమ్స్ నిండటంతో పాటు ఫుడ్ సేల్స్ ద్వారా థియేటర్లకు స్థిరమైన రాబడి లభిస్తుంది. ప్రేక్షకుడికి కూడా సినిమా వీక్షణ బడ్జెట్ పరిధిలోనే అనిపించి తరచూ థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపుతారు.
పరిశ్రమ మనుగడకు, థియేటర్ల రక్షణకు సమతుల్యమైన టికెట్ ధరల విధానమే ఏకైక మార్గం. కంటెంట్ నాణ్యతతో పాటు టికెట్ రేట్లను సామాన్యుడి పాకెట్‌కు తగినట్లుగా నిర్ణయించినప్పుడే థియేట్రికల్ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుంది. భవిష్యత్ లో కూడా ఈ ధోరణిని కొనసాగస్తే టికెట్ ధరల పెంపు కంటే ప్రేక్షకుల ఫుట్‌ఫాల్స్ (రాక) పెంచడంపై పరిశ్రమ దృష్టి సారిస్తే చలనచిత్ర రంగానికి అంతకంటే శుభవార్త మరొకటి ఉండదు. ఈ నేపథ్యంలో టికెట్ పెంపు విషయంలో టాలీవుడ్ కూడా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం మరోసారి ఏర్పడుతుంది. ఈ విషయంలో ఇప్పటికే `ది ప్యారడైజ్` నిర్మాతలు కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.