పెద్ద పెద్ద‌ కలలు కనేవారికి ఇక్కడ ఆదరణ లేదు!

ఈ క్రమంలోనే తాను కేవలం 16 ఏళ్ల పిన్న వయసులోనే ఇల్లు వదిలి ముంబైకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ?వివరిస్తూ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు.

Update: 2026-09-17 17:20 GMT

తెలుగు రాష్ట్రాల్లో కొత్త బాటలు తొక్కే వారికి తమ సొంత సమాజం నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదనే వివాదంపై నటి శోభితా ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అహల్య పోస్ట్ చేసిన ఓ వీడియోకు ప్రతిస్పందిస్తూ.. తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను కేవలం 16 ఏళ్ల పిన్న వయసులోనే ఇల్లు వదిలి ముంబైకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ?వివరిస్తూ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు.

తెలుగు ప్రజలు తమ సినిమా, సంస్కృతి, భాష పట్ల ఎంతో గర్వపడతారని, కానీ తమ సమాజంలోని వ్యక్తులు ఏదైనా కొత్త వ్యాపారాన్ని లేదా వినూత్న రంగాన్ని ప్రారంభించినప్పుడు ఆ స్థాయి ప్రోత్సాహాన్ని అందించరని సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోలో ప్రశ్నించారు. మద్దతు ఇవ్వడానికి బదులుగా విమర్శించడం, చులకనగా చూడటమే ఎక్కువగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అభిప్రాయంతో శోభితా ధూళిపాళ్ల ఏకీభ‌వించారు. 100 ఏమోజీతో తన స్పందనను జోడించారు.

తాను పెరిగిన వాతావరణం గురించి శోభితా ఇలా అన్నారు. `ఎలాంటి గ్యారెంటీ లేకపోయినా 16 ఏళ్ల వయసులోనే మూటముల్లె సర్దుకుని ముంబైకి పయనమయ్యాను. ఎందుకంటే ఇక్కడి వాతావరణం పెద్ద కలలు కనేవారి పట్ల తీవ్రమైన వ్యతిరేకతను, జడ్జిమెంటల్ మనస్తత్వాన్ని కలిగి ఉందనే విషయం నాకు స్పష్టంగా అర్థమైంది. ముఖ్యంగా ఏ రంగంలోనైనా కొత్తగా లేదా అవుట్‌సైడర్ అడుగుపెట్టాలనుకునే వారికి ఇక్కడ ఆదరణ లభించడం కష్టం` అని ఆవేదన వ్యక్తం చేశారు.

సమాజంలో మహిళలు ఎదుర్కొనే అదనపు సవాళ్ల గురించి శోభిత ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే పురుషులకే ప్రతిఘటన ఎదురైతే? అదే పని ఒక మహిళ చేయడానికి పూనుకుంటే ? ఆ వ్యతిరేకత, నెగెటివిటీ రెట్టింపు డోస్ రూపంలో ఉంటుందని పదునైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు స్వతంత్ర ఆలోచనలతో ముందడుగు వేసేటప్పుడు సామాజిక అడ్డంకులు మరింత ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.

అయితే ఇది తాను కొన్నేళ్ల క్రితం సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్లినప్పటి పరిస్థితి అని.. ప్రస్తుతం పరిస్థితుల్లో సానుకూల మార్పు వచ్చి ఉంటుందని ఆశిస్తున్నట్లు శోభితా తెలిపారు. మన సమాజం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని చెప్పారు. `మన సమాజంలోని ప్రతి ఒక్కరూ ఎదగడానికి రెక్కలతో పాటు, ఇతరులకు మద్దతుగా నిలిచే ధైర్యాన్ని కూడా పెంచుకుంటారని ఆశిస్తున్నాను` అంటూ కాస్త ఘాటుగానే సందేశాన్ని ముగించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో జన్మించి విశాఖపట్నంలో పెరిగిన శోభితా ధూళిపాళ్ల.. 16 ఏళ్లకే ముంబైకి మారి కార్పొరేట్ లా విద్యను అభ్యసించారు. అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మిస్ ఎర్త్ 2013 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. `రామన్ రాఘవ్ 2.0` చిత్రంతో నటిగా ప్రయాణం ప్రారంభించిన శోభిత‌ తెలుగులో `గూఢచారి`, తమిళంలో `పొన్నియిన్ సెల్వన్`, హిందీతో పాటు ఓటీటీలో `మేడ్ ఇన్ హెవెన్`, `ది నైట్ మేనేజర్` వంటి సిరీస్‌లతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

Tags:    

Similar News