దుబాయ్‌లో ప్ర‌మోష‌న్స్ అంటే భ‌య‌ప‌డ్డ‌ 4000 కోట్ల నిర్మాత‌!

తాజా స‌మాచారం మేర‌కు.. గ్లోబ‌ల్ ప్ర‌మోష‌న్స్ కోసం నిర్మాత న‌మిత్ మల్హోత్రా త‌న స‌హ‌నిర్మాత య‌ష్ స‌హా చిత్ర‌బృందంతో చ‌ర్చించార‌ని తెలిసింది.

Update: 2026-06-27 16:30 GMT

పురాణేతిహాసం- రామాయ‌ణం ఆధారంగా దాదాపు 4000 కోట్ల బడ్జెట్‌తో పౌరాణిక దృశ్యకావ్యం `రామాయణం` సినిమాను రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తుండ‌గా, దీపావ‌ళి కానుక‌గా ఈ ఏడాది న‌వంబ‌ర్ లో మొద‌టి భాగం విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమాకి ఇప్ప‌టివ‌ర‌కూ ఆశించిన ప్ర‌మోష‌న్స్ చేయ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

తాజా స‌మాచారం మేర‌కు.. గ్లోబ‌ల్ ప్ర‌మోష‌న్స్ కోసం నిర్మాత న‌మిత్ మల్హోత్రా త‌న స‌హ‌నిర్మాత య‌ష్ స‌హా చిత్ర‌బృందంతో చ‌ర్చించార‌ని తెలిసింది. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం కారణంగా దుబాయ్‌లో ప్రమోషన్స్ చేయడానికి గతంలో వెనకడుగు వేసిన నిర్మాత నమిత్ మల్హోత్రా..ఇప్పుడు అక్కడ పరిస్థితులు చక్కబడటంతో తన పాత ప్రణాళికలను పునరుద్ధరించారు. సినిమాపై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా అంతర్జాతీయ స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించేందుకు దుబాయ్‌ను మళ్లీ ప్రధాన వేదికగా ఎంచుకున్నారు.

నిజానికి అక్టోబరు 28న దుబాయ్‌లో ఈ సినిమాకు సంబంధించి ఒక అద్భుతమైన `డెజర్ట్ ప్రీమియర్` నిర్వ‌హించాలని చిత్ర యూనిట్ ముందుగా భావించింది. అయితే ఇరాన్ హర్మూజ్ జలసంధి సంక్షోభం ముదరడం, ఆ ప్రాంతంలో భద్రతపై క్లారిటీ లేకపోవడంతో ఈ ఈవెంట్‌ను పూర్తిగా రద్దు చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి, సన్నీ డియోల్, దర్శకుడు నితీష్ తివారీ వంటి అగ్ర తారాగణాన్ని, సాంకేతిక నిపుణులను అంతటి యుద్ధ వాతావరణం ఉన్న చోటికి తీసుకువెళ్లడం తీవ్రమైన రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కావడంతో అప్పట్లో ఈ ఆలోచనను పక్కన పెట్టారు.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వార్‌తో దెబ్బతిన్న దుబాయ్ పర్యాటకం

ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్‌లు సాగించిన దాడులు - మిడిల్ ఈస్ట్‌లో కొనసాగిన విధ్వంసం కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న దుబాయ్ పర్యాటక రంగం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ఉద్రిక్తతల వల్ల అక్కడ ఎన్నో వ్యాపారాలు దెబ్బతినడమే కాకుండా, వినోద పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ పర్యటనలను సైతం రద్దు చేసుకున్నారు. యుద్ధ భయాల నేపథ్యంలో దుబాయ్‌కు వెళ్లడమే ప్రమాదకరంగా మారడంతో..అక్క‌డ‌ సినిమాల షూటింగులు ఆపేయ‌డ‌మే కాకుండా, ఫంక్షన్లు - ఈవెంట్‌లు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇంకా చెప్పాలంటే సినిమా వాళ్ల యాక్టివిటీస్ అన్నీ బంద్ అయిపోయాయి.

రియల్ ఎస్టేట్ పెట్టుబడులు నిలిచిపోయాయి:

సాధారణంగా భారతీయ సినిమా స్టార్లు తాము సంపాదించిన భారీ సొమ్మును దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో యథేచ్ఛగా పెట్టుబడి పెడుతూ అక్కడి ఆస్తి విలువను పెంచుతుంటారు. అంతేకాకుండా పెద్ద సినిమాల కథా చర్చల కోసం కూడా మన అగ్ర హీరోలు, దర్శకులు దుబాయ్‌ను ఒక విలాసవంతమైన డెస్టినేషన్‌గా ఎంచుకుంటారు. కానీ ఈ యుద్ధ భయాలు కమ్మేయడంతో సెలబ్రిటీల పెట్టుబడులు ఆగిపోవడమే కాకుండా.. వారు దుబాయ్ వైపు చూడటమే మానేశారు. క‌నీసం విహార‌యాత్ర‌ల‌కు కూడా దుబాయ్ కి వెళ్ల‌లేదు.

స‌ద్ధుమ‌ణిగాక ఊపిరొచ్చింది:

ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తుండటంతో ఇప్పుడు ఆ భయాలు తొలిగిపోయాయి. పాన్-ఇండియన్ సినిమాల అంతర్జాతీయ ప్రచారానికి దుబాయ్ అత్యంత సరైన వేదిక అని నమ్మే నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ ప్రతిష్టాత్మక `డెజర్ట్ ప్రీమియర్`ను ఎక్కడ, ఎలా ప్లాన్ చేయాలనే అంశంపై తన సహచరులతో చర్చలు ముమ్మరం చేశారు. రామాయణ చిత్ర బృందం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో, వినోద రంగానికి చెందిన మిగతా ప్రముఖులు - స్టార్లు కూడా త్వరలోనే దుబాయ్‌కి తమ ప్రయాణాలు స‌హా రియ‌ల్ పెట్టుబడులను పునరుద్ధరించుకుంటారని స్పష్టమవుతోంది.

Tags:    

Similar News