నిర్మాతల్లేరు.. హీరోనే రంగంలోకి?
హీరోల పారితోషకాలు విపరీతంగా పెంచేయడం ఇండస్ట్రీకి అతి పెద్ద సమస్యగా మారిందని ప్రతి నిర్మాతా చెబుతుంటాడు.
హీరోల పారితోషకాలు విపరీతంగా పెంచేయడం ఇండస్ట్రీకి అతి పెద్ద సమస్యగా మారిందని ప్రతి నిర్మాతా చెబుతుంటాడు. కానీ మళ్లీ వాళ్లే ఒక సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తర్వాతి చిత్రానికి రెమ్యూనరేషన్లు పెంచేస్తుంటారు. హీరోల డేట్లు సంపాదించడం కోసం పోటాపోటీగా రెమ్యూనరేషన్లు ఆఫర్ చేస్తుంటారు. తెలుగులో ఈ ప్రాక్టీస్ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. దీని వల్ల టాలీవుడ్ ఇప్పటికే బాగా దెబ్బ తింది.
మన ప్రొడ్యూసర్లు ఇక్కడితో ఆగకుండా వేరే ఇండస్ట్రీలకు కూడా వెళ్లి అగ్ర కథానాయకులకు భారీ పారితోషకాలు ఆఫర్ చేసి సినిమాలు చేస్తున్నారు. దీంతో వాళ్లు కూడా కొండెక్కి కూర్చుంటున్నారు. తమిళంలో విజయ్‌తో దిల్ రాజు ‘వారిసు’, అజిత్‌తో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చేశారంటే వాళ్లు ఇచ్చిన భారీ రెమ్యూనరేషన్ ఆఫర్లే కారణం అనే వాదన ఉంది. ఐతే విజయ్ ఇప్పుడు సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లి సీఎం అయిపోయాడు. కానీ అజిత్ పరిస్థితే ఇబ్బందికరంగా మారింది.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కి రూ.100 కోట్ల దాకా అజిత్ పారితోషకం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అదే రేంజిలో ఇప్పుడు తర్వాతి సినిమాకు రెమ్యూనరేషన్ అడుగుతుంటే నిర్మాతలు ఎవ్వరూ ముందుకు రావట్లేదని తెలుస్తోంది. ఒక ప్రొడక్షన్ హౌస్ ముందుకు వచ్చినట్లే వచ్చి.. రెమ్యూనరేషన్ విషయంలో ఏకాభిప్రాయం కుదరక వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రిలీజై ఏడాది దాటగా.. ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్‌తో అజిత్ సినిమా ఇంకా సెట్స్ మీదికి తీసుకెళ్లకపోవడానికి పారితోషకమే సమస్యగా మారింది. ఐతే వేరే నిర్మాతలూ ముందుకు రాకపోవడంతో అజితే స్వయంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. తనకు తెలిసిన పెట్టుబడిదారులతో ఇన్వెస్ట్ చేయించి.. తన పారితోషకాన్ని లాభాల్లో వాటా కింద తీసుకోబోతున్నాడట అజిత్. ఈ మోడల్ సక్సెస్ అయితే మున్ముందూ ఇదే బాటలో సాగాలని అజిత్ భావిస్తున్నట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.