భాగ్యశ్రీ బోర్‌సే క్యూట్ సెల్ఫీ వీడియో.. “బంగారం” మాటతో వైరల్!

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన ఈ బంగారం, రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద ప్రాజెక్టులతో టాలీవుడ్‌ను ఏలాలని ఆశిద్దాం.

Update: 2026-08-19 16:05 GMT

టాలీవుడ్‌కి 'మిస్టర్ బచ్చన్' సినిమాతో పరిచయమైన నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్‌సే తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక సెల్ఫీ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సంప్రదాయబద్ధమైన గోల్డెన్ చీర, ఎత్నిక్ జ్యువెలరీతో మెరిసిపోతూ ఉన్న ఈ వీడియోలో ఆమె చూపించిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫ్యాన్స్ ముగ్ధులవుతున్నారు. "నన్ను మీరందరూ బంగారం అని పిలిచిన ప్రతిసారి నేను ఇలాగే ఫీల్ అవుతాను" అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

'బంగారం' క్యాప్షన్‌తో నెటిజన్ల మనసులు దోచిన భామ:

తెలుగులో 'బంగారం' అంటే పసిడి అని అర్థమే కాకుండా, ఎంతో ఇష్టమైన వారిని 'ప్రేమగా, ముద్దుగా' పిలుచుకునే పదం. ఆ విషయాన్ని గుర్తుచేస్తూ భాగ్యశ్రీ చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు, అభిమానులు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక నిజంగానే నువ్వు బంగారంలా మెరిసిపోతున్నావంటూ ఆమె అందాన్ని, చిరునవ్వును తెగ పొగిడేస్తున్నారు.

ప్రారంభంలో ప్లాపులు ఇచ్చినా క్రేజ్ తగ్గలే:

భాగ్యశ్రీ బోర్‌సే టాలీవుడ్ ఎంట్రీ అంత ఆశాజనకంగా సాగలేదు. మొదటి సినిమా 'మిస్టర్ బచ్చన్' బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరిచింది. ఆ తర్వాత వచ్చిన 'కాంత', 'ఆంధ్రకింగ్ తాలూకా' సినిమాలు డీసెంట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. ఇక అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ సరైన హిట్ పడకపోవడంతో ఆమె కెరీర్‌పై కొంత నిరాశ అలముకుంది.

'లెనిన్'తో గ్రాండ్ సక్సెస్.. 100 కోట్ల క్లబ్‌లో అడుగు:

అయితే అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన 'లెనిన్' సినిమా భాగ్యశ్రీ జాతకాన్ని పూర్తిగా మార్చేసింది. చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్‌కు, భాగ్యశ్రీకి ఈ చిత్రం మైండ్ బ్లావింగ్ సక్సెస్ అందించింది. ఇక బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ విజయంలో భాగ్యశ్రీ పాత్ర ఎంతో కీలకంగా నిలిచింది.

భారతిగా నటనకు విమర్శకుల ప్రశంసలు :

'లెనిన్' సినిమాలో భారతి అనే పాత్రలో భాగ్యశ్రీ జీవించేసింది. ఫస్ట్ హాఫ్‌లో లవ్ సీన్స్, ఇంటర్వెల్ ముందు బరువైన ఎమోషన్స్, సెకండాఫ్‌లో హోమ్లీ లుక్, క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్.. ఇలా కథను ఆమె పాత్ర చుట్టూనే దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు తిప్పారు. ఇక ఆమెను కథానాయికగా ఎంచుకోవడం ద్వారా చిత్రబృందం సరైన నిర్ణయం తీసుకుందని మూవీ లవర్స్ కొనియాడారు.

వరుస ప్లాపులతో ఇబ్బంది పడినా, సరైన హిట్ పడితే తన సత్తా ఏంటో చూపిస్తానని భాగ్యశ్రీ బోర్‌సే నిరూపించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన ఈ బంగారం, రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద ప్రాజెక్టులతో టాలీవుడ్‌ను ఏలాలని ఆశిద్దాం.

Tags:    

Similar News