2026లో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తుందా?
ఈ ఏడాది డిసెంబర్ వరకు విడుదలైన భారీ సినిమాల్లో అత్యధిక శాతం ఫ్లాప్‌లు, డిజాస్టర్లే అధికం. 2025లో విడుదలైన టాప్ స్టార్ల సినిమాలు దాదాపు పదికి మించి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అనిపించుకుని షాక్ ఇచ్చాయి.;
2025 మరిన కొన్ని రోజుల్లో ఎండ్ అయి కొత్త ఏడాది 2026లోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త ఏడాది కొత్త ఆశలతో స్వాగతం పలుకుతుందని అంతా ఆశగా ఎదురు చూస్తున్నట్టే టాలీవుడ్ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నారు. కారణం 2025 టాలీవుడ్‌కు తిరుగులేని షాక్ ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ వరకు విడుదలైన భారీ సినిమాల్లో అత్యధిక శాతం ఫ్లాప్‌లు, డిజాస్టర్లే అధికం. 2025లో విడుదలైన టాప్ స్టార్ల సినిమాలు దాదాపు పదికి మించి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అనిపించుకుని షాక్ ఇచ్చాయి.
వీటి వల్ల టాలవుడ్‌కు దాదాపు రూ.1000 కోట్లు వృథా అయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన భారీ పాన్ ఇండియా మూవీ `గేమ్ ఛేంజర్`. రూ.450 కోట్ల బడ్జెట్‌తో శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. ఊహించి స్థాయిలో మేకర్స్‌కి నష్టాలని తెచ్చి పెట్టింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సాధించింది కేవలం రూ.195 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.
దీని తరువాత వచ్చిన `డాకు మహారాజ్` భారీగా ఖర్చు పెట్టారు. బాలీవుడ్ నుంచి విలన్‌గా బాబిడియోల్‌ని రంగంలోకి దించారు. అయినా ఆశించిన స్థాయిలో మాత్రం డాకు వసూళ్లని రాబట్టలేకపోయింది. అయితే నష్టాలని మాత్రం అందించలేదు. ఇక ఇదే తరహాలో మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చి నితిన్ భారీ బడ్జెట్ మూవీ `రాబిన్ హుడ్`. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ మూవీని దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. మేకింగ్ ఏళ్ల తరబడి జరగడంతో ఈ మూవీ బడ్జెట్ అంతకంతకూ పెరిగిపోయి భరించలేని స్థాయికి వెళ్లిపోయింది.
మార్చిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.14 కోట్లు మాత్రమే రాబట్టి నిర్మాతలకు భారీ నష్టాలని తెచ్చి పెట్టింది. ఇక సిద్ధూ జొన్నగడ్డతో బివీఎస్ ఎన్ ప్రసాద్ రూ.40 కోట్ల బడ్జెట్‌తో `జాక్`ని నిర్మిస్తే దీనికి కేవలం రూ.10 కోట్లు మాత్రమే రిటర్న్ రావడంతో అంతా అవాక్కయ్యారు. ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమాల పరిస్థితి ఇంతే. ఇక ధనుష్, నాగార్జున నటించి `కుబేర` పరిస్థితి మరోలా ఉంది. మార్కెట్‌కు మించి ఖర్చు చేస్తే అంతకు మించి నష్టాలని తెచ్చి పెట్టిందీ చిత్రం.
మంచు విష్ణు అత్యంత భారీ స్థాయిలో చేసిన `కన్నప్ప` పరిస్థితి అయితే మరీ దారుణం. టాలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్ ప్రముఖులంతా కలిసి నటించిన ఈ సినిమా కోసం దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేస్తే కేవలం రూ.45 కోట్లు మాత్రమే రకవర్ చేసి మేకర్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఇక నితిన్ చేసిన `తమ్ముడు` కోసం దిల్ రాజు ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశాడు. అందులో రూ.10 కోట్లు కూడా తిరిగి రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పవన్‌కల్యాణ్ నటించి ఫస్ట్ పీరియాడిక్ డ్రామా `హరి హర వీరమల్లు`. దీని పరిస్థి కూడా ఇలాగే ఉంది. రూ. 200 కోట్ల పై చిలుకు బడ్జెట్‌తో నిర్మిస్తే అందులో సగం మాత్రమే రాబట్టి నిర్మాత ఏ.ఎం.రత్నంకు భారీ షాక్ ఇచ్చింది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన `కింగ్‌డమ్` భారీ అంచనాల మధ్య విడుదలై డివైడ్ టాక్‌ని సొంతం చేసుకుంది. రూ.130 కోట్లతో నిర్మిస్తే రూ.80 కోట్లు మాత్రమే రాబట్టి భారీ నష్టాలని మిగిల్చింది. `ఘాటీ`, మాస్ జాతర బడ్జెట్‌ని కూడా తిరిగి రాబట్టలేకపోయాయి. ఇక చివర్లో విడుదలై ఆంధ్రాకింగ్ తాలూకా`, `అఖండ 2` బాక్సాఫీస్ వద్ద విఫలమై కోట్లల్లో నష్టాలని తెచ్చి పెట్టాయి. ఈ ఏడాది విడుదలై భారీ సినిమాలు కోట్లల్లో నష్టాలని తెచ్చి పెట్టడానికి కారణం స్టార్ పవర్ ఉన్నా బలమైన కథ, ఎగ్జిక్యూషన్, సరైన ప్రమోషన్స్ లేకపోవడమే అన స్పష్టమవుతోంది. బలమైన కథ లేకుండా ఎంత బడ్జెట్ పెట్టినా వృథా ప్రయాసే అని 2025 టాలీవుడ్‌కు ఒక గుణపాం నేర్పింది. ఈ తప్పుల్ని సవరించుని 2026లో బిగ్ కమ్ బ్యాక్ ఇస్తారని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.