హైదరాబాద్ లో ఐమ్యాక్స్ లేదెందుకు? ఫోకస్ పెట్టరెందుకు?
హైదరాబాద్ అంటే తెలుగు సినిమాకు అడ్డా అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మన దేశంలో అత్యధిక థియేటర్లు ఉన్న సిటీ బహుశా అదేనేమో.;
హైదరాబాద్ అంటే తెలుగు సినిమాకు అడ్డా అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మన దేశంలో అత్యధిక థియేటర్లు ఉన్న సిటీ బహుశా అదేనేమో. ఏ సినిమా రిలీజ్ అయినా.. అదిరిపోయే రీతిలో ఓపెనింగ్స్ అక్కడ నమోదవుతాయి. వందల కోట్లు వసూళ్లు సాధిస్తుంటాయి. కానీ హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఒక సరైన ఐమ్యాక్స్ థియేటర్ లేకపోవడం మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు దీనిపై చర్చ సాగుతోంది.
నిజానికి.. ఒకప్పుడు హైదరాబాద్ లో ఐమ్యాక్స్ అనుభవం ఉండేది. పెద్ద స్క్రీన్, భారీ సౌండ్ సిస్టమ్ తో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు అక్కడికి ఎంతో ఆసక్తిగా వెళ్లేవారు. కానీ ప్రస్తుతం ఆ సదుపాయం అందుబాటులో లేదని చెప్పాలి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లు పెరిగినా.. ఐమ్యాక్స్ వంటి ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొజెక్షన్ కు మాత్రం సిటీ దూరంగా ఉంది. కొన్నిసార్లు మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ కూడా ఏర్పడుతుంది.
ఎందుకంటే ఇప్పుడు అనేక మంది డైరెక్టర్లు.. భారీ రేంజ్ లో సినిమాలు తీస్తున్నారు. అదిరిపోయే రీతిలో విజువల్స్ ను అందిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు రూపొందిస్తున్నారు. కానీ ఆ రేంజ్ మూవీలు ఐమ్యాక్స్ లో పడితే.. వాటిని చూస్తే ఆ కిక్కే వేరు. ఆ విషయంలో మాత్రం సినీ ప్రియులకు నిరాశే ఎదురవుతోంది. అందుకే హైదరాబాద్ లో ఐమ్యాక్స్ ఎప్పుడు వస్తుందోనని వేయికళ్లతో అంతా ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా ప్రేక్షకులు ఇప్పుడు కేవలం సినిమానే కాదు.. సూపర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ను కూడా కోరుకుంటున్నారు. పెద్ద స్క్రీన్ పై గ్రాండ్ విజువల్స్ చూస్తేనే సినిమా అసలు రుచి తెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు ఐమ్యాక్స్ స్క్రీన్ ఉంటే కలెక్షన్లు కూడా పెరుగుతాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కేవలం ప్రేక్షకుల కోరిక మాత్రమే కాదు, వ్యాపార పరంగా లాభదాయకమేనని అంటున్నారు.
అదే సమయంలో టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు అనేక మంది.. ఇప్పటికే థియేటర్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి పలువురు స్టార్ హీరోలు మోడ్రన్ మల్టీప్లెక్స్ లను నిర్మిస్తున్నారు. వాటితో మంచి సౌకర్యాలు అందిస్తున్నారు. లగ్జరీ సీటింగ్, ప్రీమియం స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఐమ్యాక్స్ స్క్రీన్ ఆలోచన కూడా ఎవరూ పరిశీలించడం లేదు!
ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఐమ్యాక్స్ సౌకర్యం ఉండగా.. టాలీవుడ్ అడ్డా అయిన హైదరాబాద్ లో మాత్రం లేదు. ఏదేమైనా పాన్ వరల్డ్ సినిమాలు తెలుగులో తెరకెక్కుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐమ్యాక్స్ థియేటర్ లేకపోవడం ఆలోచించాల్సిన విషయమే. ఇకనైనా హైదరాబాద్ లో ఐమ్యాక్స్ థియేటర్ ఏర్పాటుకు ఎవరు ముందుకొస్తారు? సినీ ప్రియుల ఆశలు ఎప్పుడు నెరవేరుతాయి? అన్నది వేచి చూడాలి.