టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ!
| టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. ఆఫియా సయాద్ ‘అలియాస్ రుక్మిణి’, మేధా మేక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రంతో, సాత్విక వీరవల్లి ‘ఆకాశంలో ఒక తార’తో పరిచయం కానున్నారు. ప్రభాస్ సినిమాలైన ‘ఫౌజీ’తో ఇమాన్వి ఇస్మాయిల్, ‘స్పిరిట్’తో తృప్తి డిమ్రి తెలుగు తెరకు రానున్నారు. స్టార్ హీరోలు, క్రేజీ దర్శకుల సినిమాలతో అడుగుపెడుతున్న ఈ భామలు సక్సెస్ సాధిస్తే సీనియర్ హీరోయిన్లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
ఏ పరిశ్రమలోనైనా పాత నీరు పోవడం..కొత్త నీరు రావడం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే సినిమా ఇండస్ట్రీలో పాత నీరుతో పాటు కొత్త నీరుకుండే ప్రాముఖ్యత వేరు. చిన్న సినిమాలతో ప్రారంభమై స్టార్ హీరోయిన్లగా ఎదగడానికి ఎంతో సమయం పట్టదు. ప్రతిగా స్టార్ హీరోయిన్లకే నవతరం భామలు ఎసరు పెడుతుంటారు. తాజాగా టాలీవుడ్లో మరికొన్ని కొత్త అందాల సందడి ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది ఆఫియా సయాద్ గురించి. నేచురల్ స్టార్ నాని సమర్పణలో నితిన్ హీరోగా మురళికాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `అలియాస్ రుక్మిణి` చిత్రంతో అమ్మడు తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. డిసెంబర్ 4న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలో అఫియా రుక్మిణి పాత్రలో కనువిందు చేయనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు.. పాటలతో ఆఫియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
మరోవైపు టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ -ఊహ దంపతుల కుమార్తె మేధా మేక కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న న్యూ-ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం తో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అవుతుంది. అలాగే విలక్షణ నటుడు దుల్కర్ సల్మాన్ సరసన పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఆకాశంలో ఒక తార` చిత్రంతో తెలుగు అమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా లాంచ్ అవుతుంది .
ఇక పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రెండు భారీ చిత్రాల ద్వారా ఇద్దరు క్రేజీ భామలు టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడిక్ డ్రామా`‘ఫౌజీ`లో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి ఇస్మాయిల్ డార్లింగ్ కు జోడీగా నటిస్తున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `స్పిరిట్` తో బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి తొలిసారి తెలుగు తెరపై సందడి చేస్తుంది.
ఇలా తెలుగమ్మాయిలతో పాటు ఇతర భాషల నుంచి వస్తున్న ప్రతిభావంతులైన కొత్త హీరోయిన్లతో టాలీవుడ్ కళకళలాడుతోంది. స్టార్ హీరోలు.. క్రేజీ దర్శకుల సినిమాలతో ఎంట్రీ ఇస్తున్న ఈ భామల్లో ఎంతమంది బాక్సాఫీస్ వద్ద విజయాలు అందుకుని టాలీవుడ్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారో చూడాలి. ఈ భామలు గనుక సక్సెస్ అయితే సీనియర్లకు పోటీ తప్పదు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు పెళ్లిళ్లు చేసుకుని తల్లులుగా మారారు. ఫ్యామిలీ లైఫ్ తో పాటు అవకాశాలు వచ్చినప్పుడల్లా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లందరికీ నవతంర భామలు సక్సెస్ అయితే చెక్ పడే అవకాశ ఉంది.