హీరోయిన్ల స్టార్ ఇమేజ్ కష్టాలు!

హీరోయిన్ల‌కు అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే? స్టార్ హీరోయిన్ అనే ముద్ర వేయించుకోవడం మరో ఎత్తు.;

Update: 2026-04-01 17:30 GMT

హీరోయిన్ల‌కు అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే? స్టార్ హీరోయిన్ అనే ముద్ర వేయించుకోవడం మరో ఎత్తు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అనుపమ పరమేశ్వరన్, నిధి అగర్వాల్, భాగ్యశ్రీ బోర్సే, సంయుక్త మీనన్ వంటి భామలు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ అగ్ర తారల జాబితాలో చేరడానికి అవసరమైన మెగా హిట్ కోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ సరైన సమయంలో సరైన విజయం దక్కకపోవడం భామ‌ల‌ కెరీర్‌కు కొంత అడ్డంకిగా మారింది. అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ పాత్ర‌ల్లో మెప్పిస్తూనే టిల్లు స్క్వేర్ వంటి చిత్రాలతో తన నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అయితే ఈ ప్రయత్నాలు ఆమెకు నటిగా గుర్తింపు తెస్తున్నాయే తప్ప రష్మిక మందన్న తరహాలో టాప్ లీగ్లోకి తీసుకెళ్లలేకపోతున్నాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చినా అవి కెరీర్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నాయి.నిధి అగర్వాల్, భాగ్యశ్రీ బోర్సే వంటి కథానాయికల పరిస్థితి వింతగానే ఉంది. భామ‌లిద్ద‌రు స్టార్ హీరోలతో జోడీ కడుతున్నా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించ‌క‌పోవ‌డం శాపంగా మారుతోంది.

ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రాలు నిరాశపరచడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర పడకుండా జాగ్రత్త పడాల్సి వస్తోంది. సక్సెస్ రేటు తక్కువగా ఉండటంతో భామ‌ల స్టార్ ఇమేజ్ ప్రశ్నార్థకంగా మారుతోంది.

మరోవైపు సంయుక్త మీనన్, మీనాక్షి చౌదరి వంటి వారు ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకుపోయినప్పటికీ ఆ జోష్‌ను కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్ర‌స్తుతం సంయుక్త మీనన్ కమర్షియల్ సినిమాల కంటే ప్రయోగాత్మక చిత్రాల వైపు మొగ్గు చూపుతుండగా మీనాక్షి చౌదరి వరుసగా పెద్ద ప్రాజెక్టులు దక్కించుకున్నా అవి ఆమెకు ఆశించిన మైలేజీని ఇవ్వలేకపోతున్నాయి.

సక్సెస్ ట్రాక్‌ను మెయింటైన్ చేయలేకపోవడమే వీరి ప్రధాన బలహీనతగా కనిపిస్తోంది. హీరోయిన్లకు కేవలం అందం, అభినయం ఉంటే సరిపోదు. బాక్సాఫీస్ వద్ద వారి సినిమా చేసే సౌండింగ్ వారి రేంజ్‌ను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఈ యంగ్ బ్యూటీస్ అందరూ తమ తదుపరి చిత్రాలతో స‌రైన‌ హిట్ కొట్టి స్టార్ హోదాను దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. ఒక్క బ్లాక్‌బస్టర్ పడితే చాలు భామ‌ల‌ జాతకాలు మారిపోతాయని ఇండస్ట్రీ జనాలు అంచనా వేస్తున్నారు. మ‌రి 2026 లోనైనా వారు అనుకున్న‌ది జ‌రుగుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. ఈ విష‌యంలో భామ‌ల‌కు అదృష్టం కూడా తోడ‌వ్వాలి. ఎంత ఎఫెర్ట్ పెట్టి సినిమా చేసినా? త‌మ పాత్ర‌లు పండినా? తుదిగా సినిమా ప్లాప్ అయితే ఆ క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరుగానే మారిపోతుంది.

Tags:    

Similar News