“నా కెరీర్ మారడానికి కారణం ఆయనే” – బన్నీ వాసు ఆసక్తికర వ్యాఖ్యలు

అలా మొదలైన వీరి పరిచయం కాలక్రమేణా గట్టి స్నేహంగా మారింది. యానిమేషన్ రంగంలో ఉన్న వాసు గారిలోని బిజినెస్ స్కిల్స్, సినిమాపై ఉన్న పట్టును బన్నీనే మొదట గుర్తించారు.

Update: 2026-09-17 07:34 GMT

టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా రాణిస్తున్న గీతా ఆర్ట్స్ 2 అధినేత బన్నీ వాసు గారు తన కెరీర్ ఎదుగుదలపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సాధారణ యానిమేటర్‌గా ఉన్న తనకు లైఫ్ ఇచ్చి, ఈరోజు స్టార్ ప్రొడ్యూసర్‌గా నిలబెట్టింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారేనంటూ ఆయన కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. దిగ్గజ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభోత్సవంలో బన్నీ వాసు చెప్పిన ఆ విశేషాలు ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు చూద్దాం

పరిచయం ఇలా :

అల్లు అర్జున్‌కి బన్నీ వాసు ఎలా క్లోజ్ అయ్యాడనేది కొందరికి తెలియకపోవచ్చు , ‘జానీ’ సినిమా మర్చండైజ్ పని మీద అల్లు అరవింద్ గారు పిలిపించినప్పుడు, అల్లు అర్జున్ అన్న బాబీ ద్వారా బన్నీ వాసుకు పరిచయం ఏర్పడింది. ఇక అప్పటికి 'గంగోత్రి' సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. బన్నీ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఒక మంచి మనిషి కావాలని బాబీ చెప్పడంతో, యానిమేటర్‌గా మంచి పొజిషన్‌లో ఉన్న బన్నీ వాసు ఎలాంటి ఆలోచన లేకుండా రంగంలోకి దిగారు.

మిత్రత్వం నుంచి నిర్మాత స్థాయి వరకు:

అలా మొదలైన వీరి పరిచయం కాలక్రమేణా గట్టి స్నేహంగా మారింది. యానిమేషన్ రంగంలో ఉన్న వాసు గారిలోని బిజినెస్ స్కిల్స్, సినిమాపై ఉన్న పట్టును బన్నీనే మొదట గుర్తించారు. ఇక అల్లు అర్జున్ సపోర్ట్‌తో మొదట గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన బన్నీ వాసు, ఆ తర్వాత ‘100% లవ్’ సినిమాతో పూర్తిస్థాయి నిర్మాతగా మారారు.

భారీ బయోపిక్ ‘ఎం.ఎస్: ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ :

ఇక భారతరత్న, కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా చెన్నైలో ఆమె బయోపిక్ ‘ఎం.ఎస్: ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ ప్రారంభమైంది. రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీవాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మరోసారి బన్నీకి ప్రత్యేక కృతజ్ఞతలు:

ఈ బయోపిక్ పూజా కార్యక్రమంలో మాట్లాడిన బన్నీ వాసు, అల్లు అర్జున్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. "ఆ రోజు బన్నీ నన్ను గుర్తించకపోతే నేను ఇప్పటికీ యానిమేటర్‌గానే ఉండేవాడిని. ఆయన వల్లే నా కెరీర్ మలుపు తిరిగి ఈరోజు ఇంత పెద్ద సినిమాకి నిర్మాతగా మారాను" అని ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

కేవలం ఒక స్నేహితుడిగానే కాకుండా ఒక మంచి గైడ్‌గా అల్లు అర్జున్ ప్రోత్సహించడం వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని బన్నీ వాసు నిరూపించారు. ఇక సినీ పరిశ్రమలో నిజమైన స్నేహానికి, పరస్పర నమ్మకానికి వీరి ప్రయాణం ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది.

Tags:    

Similar News