అనంత్ నాగ్ దాదా... ఘనత ఇది కదా !

అనంతనాగ్ మంచి నటుడు. బహు భాషా నటుడు అని కొత్తగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు.

Update: 2026-09-17 06:30 GMT

అనంతనాగ్ మంచి నటుడు. బహు భాషా నటుడు అని కొత్తగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆయన ఏనాడో రుజువు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల సినీ జీవితం ఆయనది తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించారు. ఇక ఆయన కళా రంగానికి చేసిన సేవకు గాను 2025 సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారం అవార్డును ప్రకటించింది. ఇపుడు తాజాగా భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన ఐదు దశాబ్దాల అమూల్యమైన సేవలు, అద్భుతమైన నటన మరియు విశేష కృషికి గుర్తింపుగా ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది.

కేరాఫ్ కేజీఎఫ్ గా :

ఇక ఆయన సినీ జీవితంలో 300కి పైగా సినిమాలు నటించారు. లేటెస్ట్ గా చూస్తే కేజీఎఫ్ అనంతనాగ్ నటనకు అద్దం పట్టింది. కేజీఎఫ్ చిత్రంలో అనంతనాగ్ పోషించిన ఆనంద్ ఇంగలగి అనే జర్నలిస్ట్ పాత్ర సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. అందులో ఆయన తన గంభీరమైన గొంతుతో హావభావాలతో కథను ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులను సినిమాలోకి నేరుగా తీసుకువెళ్తుంది. రాకీ భాయ్ పాత్రను ఎలివేట్ చేయడానికి ఆయన చెప్పే డైలాగులు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ కూడా తెప్పించాయి. ఒక రకంగా చెప్పాలంటే కేజీఎఫ్ మొదటి భాగానికి ఆయనే కథా నాయకుడుగా ప్రాణం పోశారు.

తెలుగులోనూ హీరోగా :

ఇక అనంతనాగ్ తెలుగులో 1977లో ప్రేమ లేఖలు మూవీలో నటించారు. ఆ సినిమాలో ఆయన మదన్ అన్న పాత్రలో హీరో కం విలన్ గా కనిపిస్తారు. సినిమాలో ఒక విధంగా హీరో ఆయనే అన్నట్లుగా సాగుతుంది. హీరోయిన్ జయసుధ తో ఆయనకు మంచి డ్యూయెట్లు ఉన్నాయి. ఇది తీయని వెన్నెల రేయి అన్న పాట ఈ రోజుకీ ఎవర్ గ్రీన్ హిట్. ఇక ఈ మూవీని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు. అప్పట్లో డీసెంట్ క్లాస్ మూవీగా ప్రేక్షకులను అలరించింది. ఇక అనుగ్రహం అనే మరో మూవీలో సీరియస్ పాత్రలో అనంతనాగ్ కనిపిస్తారు.

ఛాలెంజింగ్ రోల్ లో :

తెలుగులో 1978లో ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రంగా అనుగ్రహం ఉంటుంది. ఈ సినిమాలో అనంతనాగ్ పరశురాముడు పాత్రలో సీరియస్ గానే కాదు సంక్లిష్టమైన పాత్రలో కనిపించి అలరిస్తారు. ఈ మూవీలో హీరోయిన్ గా వాణిశ్రీ నటించారు. తనకు మాత్రమే దైవిక శక్తులు, అనుగ్రహం లభించాయని నమ్మి కట్టుకున్న ఇల్లాలుని పక్కన పెట్టి పూర్తి బ్రహ్మచర్యం పాటిస్తూ మానసిక సంఘర్షణకు గురయ్యే ఒక యువకుడి పాత్రలో అనంతనాగ్ ఒదిగిపోయారు. తెలుగులో మంచి విలన్ కం హీరోగా రాణించే టైం లో అనంత్ నాగ్ తన పూర్తి సినీ ప్రస్థానాన్ని కన్నడ సినీ సీమకే కేటాయించారు. మొత్తానికి అనంత్ నాగ్ అత్యంత ప్రతిభావంతుడిగా యంగర్ డేస్ లోనే రుజువు చేసుకున్నారు. ఇక ఆయన కన్నడ సీమకు తెస్తున్న రెండవ దాదా ఫాల్కే అవార్డుగా దీనిని చూస్తున్నారు. 1995లో రాజ్ కుమార్ దాదా ఫాల్కే అవార్డుని అందుకున్నారు. అంటే మూడు దశాబ్దాల తరువాత ఈ గౌరవం కన్నడ సీమకు దక్కింది అన్న మాట.

Tags:    

Similar News