సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!
| ఒకే సినిమాలో ప్రేమికులుగా కనిపించిన ఇద్దరు నటులు మరో సినిమాలో శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? కేజీఎఫ్ జంట యష్, శ్రీనిధి శెట్టికి అలాంటి అవకాశం దాదాపు వచ్చినంత పనైంది.
ఒకే సినిమాలో ప్రేమికులుగా కనిపించిన ఇద్దరు నటులు మరో సినిమాలో శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? కేజీఎఫ్ జంట యష్, శ్రీనిధి శెట్టికి అలాంటి అవకాశం దాదాపు వచ్చినంత పనైంది. అది కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణం' సినిమాలో కావడం విశేషం. అయితే సీత పాత్ర కోసం శ్రీనిధి శెట్టి ఆడిషన్ ఇచ్చినా చివరికి సాయి పల్లవి ఫైనల్ అయ్యింది. ఈ వ్యవహారంలో యష్ కోసం శ్రీనిధి అంత పెద్ద అవకాశాన్ని వదులుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ పాత వీడియో మళ్లీ వైరల్ అవుతోంది.
నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో సీత పాత్ర కోసం శ్రీనిధి శెట్టిని కూడా పరిశీలించారు. కేజీఎఫ్ 2 విడుదలైన నెలా రెండు నెలల సమయంలోనే ఆమెకు ఆడిషన్ అవకాశం వచ్చింది. మూడు సన్నివేశాలకు సిద్ధమై స్క్రీన్ టెస్ట్ ఇచ్చారు. తన పర్ఫార్మెన్స్ చూసి చిత్రబృందం కూడా మంచి స్పందన ఇచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీనిధి చెప్పారు. అయితే అప్పటికే యష్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమని ఆమెకు తెలిసింది.
కేజీఎఫ్ సినిమాల్లో యష్ పోషించిన రాకీ పాత్రకు జోడీగా శ్రీనిధి కనిపించారు. ముఖ్యంగా రెండో భాగంలో వీరి ప్రేమకథకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి సమయంలో రామాయణంలో యష్ రావణుడిగా, తాను సీతగా కనిపిస్తే ప్రేక్షకులు ఎలా తీసుకుంటారనే సందేహం శ్రీనిధికి కలిగిందట. అప్పటివరకు ప్రేమికులుగా చూసిన జంటను ఒక్కసారిగా ప్రత్యర్థి పాత్రల్లో చూడటం ఆడియన్స్‌కు వింతగా అనిపించవచ్చని భావించారు.
ఆమె చెప్పిన ఈ మాటలతోనే యష్ కోసం సీత పాత్రను వదులుకున్నారనే ప్రచారం మొదలైంది. కానీ తర్వాత మరో ఇంటర్వ్యూలో శ్రీనిధి ఇచ్చిన క్లారిటీ మాత్రం వేరు. అసలు సీత పాత్రను తాను తిరస్కరించలేదని స్పష్టంగా చెప్పారు. ఆడిషన్ ఇచ్చానని, కానీ చిత్రబృందం తనను ఎంపిక చేయలేదని వివరించారు. అంత పెద్ద పాత్రను తిరస్కరించే స్థాయిలో తాను లేనని కూడా చెప్పుకొచ్చారు. సాయి పల్లవి సెలెక్ట్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీంతో యష్ కోసం భారీ అవకాశాన్ని త్యాగం చేశారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆమె మాటలతోనే సమాధానం దొరికింది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే శ్రీనిధి చెప్పిన రెండు సందర్భాల్లోనూ యష్ ప్రస్తావన ఉంది. మొదటిసారి కేజీఎఫ్ జోడిని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారనే సందేహాన్ని బయటపెట్టారు. రెండోసారి మాత్రం ఆ పాత్ర తనకు రాలేదని తేల్చేశారు. కానీ సోషల్ మీడియాలో మొదటి ఇంటర్వ్యూలోని మాటలే ఎక్కువగా వైరల్ కావడంతో శ్రీనిధి కావాలనే సినిమా నుంచి తప్పుకున్నారనే అభిప్రాయం ఏర్పడింది. కొందరు అభిమానులు యష్‌పై ఆమెకున్న అభిమానానికి ఇదే నిదర్శనమంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. మరోవైపు రామాయణంలో సీత పాత్ర సాయి పల్లవికి దక్కగా, శ్రీనిధి తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు. కేజీఎఫ్ తర్వాత నానితో 'హిట్ 3'లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.