‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది
| ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘రామాయణం’ సినిమా. భారత దేశ చరిత్రలోనే అత్యంత గొప్ప పురాణ గాథల్లో ఒకటైన ‘రామాయణం’ మీద వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘రామాయణం’ సినిమా. భారత దేశ చరిత్రలోనే అత్యంత గొప్ప పురాణ గాథల్లో ఒకటైన ‘రామాయణం’ మీద వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఐతే ఇప్పుడున్న సాంకేతికతను వాడుకుని.. వివిధ భాషలకు చెందిన మేటి ఆర్టిస్టులను ప్రధాన పాత్రలకు ఎంచుకుని ఏకంగా రూ.4 వేల బడ్జెట్లో ఈ మెగా ప్రాజెక్టును తలబెట్టింది చిత్ర బృందం. అందులో మొదటి భాగం గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితీశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించి తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేసినట్లున్నారు.
రామాయణం లాంటి గొప్ప పౌరాణానికానికి మాటలు రాయడం అంత తేలికైన విషయం కాదు. తెలుగులో ఆ బాధ్యత తీసుకుంది ఆకెళ్ళ శివప్రసాద్. అనేక నాటకాలు రాయడంతో పాటు.. కృష్ణవంశీ మూవీ ‘రంగమార్తాండ’కు, మంచు విష్ణు భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’కు శివప్రసాద్ మాటలు రాశారు. ఈ రెండు చిత్రాల్లో మాటలకు మంచి పేరు రావడం.. ముఖ్యంగా పౌరాణికం, జానపదం కలిసిన ‘కన్నప్ప’లో డైలాగ్స్ బాగా పేలవడంతో ‘రామాయణం’ సినిమాకు పని చేసే అవకాశ వచ్చింది శివప్రసాద్‌కు.
ఇలాంటి మెగా మూవీకి పని చేయడం తనకు మరపురాని అనుభవం అన్నారు ఆకెళ్ళ శివప్రసాద్. ‘‘ముందు రంగమార్తాండకు మాటలు రాశాను. అది మనిషి కథ. తర్వాత కన్నప్పకు రాశాను. అది భక్తుడి కథ. ఇప్పుడు దేవుడి కథ అయిన ‘రామాయణం’కి రాశాను. ఇలా మూడు భిన్నమైన అవకాశాలు రావడం నా అదృష్టం. నితీశ్ తివారి అద్భుతమైన డైరెక్టర్. పాత్రల స్వభావాన్ని బట్టి డైలాగులు ఉండాలనుకుంటారు. రాముడు, దేవతలు, రుషులకు సంబంధించిన సంభాషణలు మరీ గ్రాంథికంగా కాకుండా కొంత వరకు క్లాస్‌గా ఉండాలన్నారు. మిగిలిన పాత్రలన్నింటికీ అందరికీ అర్థమయ్యే భాషనే వాడమన్నారు. పాండిత్య ప్రదర్శన ఉండకూడదని మరీ మరీ చెప్పారు. హిందీ డైలాగుల అర్థం మారకుండానే స్వేచ్ఛ తీసుకుని తెలుగులో పదాలను కూర్చే ప్రయత్నం చేశాను.
లిప్ సింక్ ఎక్కడా తేడా రాకుండా పాత్రలు తెలుగులో మాట్లాడుతున్నట్లే ఉండేలా సంభాషణలు రాశాను. తెలుగు డైలాగులు చెప్పినపుడు ‘రామాయణం’ టీంలో అందరూ మెచ్చుకున్నారు. డబ్బింగ్ చెప్పేటపుడు సాయిపల్లవి మిగతా భాషలకు కష్టపడింది, ఎక్కువ సమయం తీసుకుంది కానీ.. తెలుగు డైలాగులు మాత్రం సులువుగా ఉన్నాయంటూ చాలా వేగంగా డబ్బింగ్ పూర్తి చేసింది. సినిమాలో ఎన్నో అద్భుత ఘట్టాలున్నాయి. ప్రతిసీన్ గొప్పగా అనిపిస్తుంది. ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అని శివప్రసాద్ తెలిపారు.