‘ప్యారడైజ్’తో నాని మార్కెట్.. ఒక్కసారిగా ఇంత పెరిగిందా?
నాని ది ప్యారడైజ్ విడుదలకు ఇంకా వారం ఉండగానే బిజినెస్ లెక్కలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
నాని ది ప్యారడైజ్ విడుదలకు ఇంకా వారం ఉండగానే బిజినెస్ లెక్కలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగిందనే టాక్ వస్తోంది. అయితే ఏరియా వారీగా బయటకు వచ్చిన మరో ట్రేడ్ లెక్కలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి రూ.75.7 కోట్లుగా ఉంది. తెలుగు వెర్షన్ వరల్డ్‌వైడ్ హక్కులు మాత్రం రూ.103.7 కోట్ల వరకు వెళ్లినట్లు చెబుతున్నారు.
ఏ లెక్క తీసుకున్నా నాని కెరీర్‌లో ఇది పెద్ద జంప్. సరిపోదా శనివారం.. తెలుగు రాష్ట్రాల బిజినెస్ దాదాపు రూ.30 కోట్ల దగ్గరే ఉంది. అక్కడి నుంచి ప్యారడైజ్ రూ.75 కోట్లకు పైగా వెళ్లడం అంటే రెండేళ్లలోనే మార్కెట్ రెండింతలకు మించి పెరిగింది. దసరా, హాయ్ నాన్న, హిట్ 3 సినిమాలు మంచి బూస్ట్ ఇచ్చాయి.
‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న రెండో సినిమా కావడం కూడా ‘ప్యారడైజ్’ బిజినెస్‌కు కలిసొచ్చింది. ‘దసరా’ నాని కెరీర్‌లోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు అదే కాంబినేషన్ మరింత పెద్ద బడ్జెట్‌తో ‘ప్యారడైజ్’ చేసింది. దానికి అనిరుధ్ సంగీతం, పాన్ ఇండియా రిలీజ్ కూడా తోడయ్యాయి. నైజాం హక్కులే రూ.35 కోట్ల వరకు వెళ్లినట్లు ట్రేడ్ వర్గాల్లో లెక్కలు వినిపిస్తున్నాయి.
అయితే ఒక్క ‘ప్యారడైజ్’తోనే నాని టైర్ 1లోకి వచ్చేశాడని చెప్పేయడం కాస్త తొందరే. పెద్ద హీరోల సినిమాలకు ఈ స్థాయి బిజినెస్ ఒక్క సినిమాతో ఆగదు. తర్వాతి సినిమాలకు కూడా అదే రేంజ్‌లో రేట్లు రావాలి. ఓపెనింగ్స్ కూడా ఆ స్థాయిలో ఉండాలి. నాని తర్వాతి సినిమాకు కూడా బయ్యర్లు ఇదే రేంజ్‌లో వెళ్లితేనే ఈ మార్కెట్ నిలబడినట్లు అవుతుంది.
తెలుగు వెర్షన్ వరల్డ్‌వైడ్ బిజినెస్ రూ.100 కోట్లకు పైగా ఉంటే ‘ప్యారడైజ్’కు కూడా పెద్ద టార్గెట్ ఉన్నట్టే. నాని గత సినిమాలతో పోలిస్తే ఈసారి ఎక్కువ షేర్ రావాల్సి ఉంటుంది. ఓవర్సీస్ హక్కులు కూడా రూ.18 కోట్ల వరకు వెళ్లినట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మొదటి రోజు నుంచే ఈ బిజినెస్‌కు తగ్గ ఓపెనింగ్స్ వస్తే నాని మార్కెట్ గురించి తర్వాతి లెక్కలు ఇంకా పెరగొచ్చు.
సెప్టెంబర్ 24న సినిమా విడుదల కానుంది. ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వెళ్లాలని టీమ్ నిర్ణయించడం మరో హైలెట్ ట్విస్ట్.మీ. సెప్టెంబర్ 23 రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ షోల నుంచే టాక్ బలంగా వస్తే నాని కొత్త బిజినెస్ రేంజ్‌కు బాక్సాఫీస్ దగ్గర మొదటి ఛాలెంజ్ అక్కడే మొదలవుతుంది. మరి ది ప్యారడైజ్ ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.