రీమేక్‌లకు దూరంగా ఉన్న టాలీవుడ్ స్టార్లు
టాలీవుడ్‌లో రీమేక్ సినిమాలకు ఎప్పటినుంచో ప్రత్యేక స్థానం ఉంది. ఒక భాషలో సూపర్ హిట్ అయిన కథలను మరో భాష ప్రేక్షకులకు అందించేందుకు పలువురు స్టార్ హీరోలు రీమేక్‌లను ఎంచుకున్నారు.
టాలీవుడ్‌లో రీమేక్ సినిమాలకు ఎప్పటినుంచో ప్రత్యేక స్థానం ఉంది. ఒక భాషలో సూపర్ హిట్ అయిన కథలను మరో భాష ప్రేక్షకులకు అందించేందుకు పలువురు స్టార్ హీరోలు రీమేక్‌లను ఎంచుకున్నారు. అయితే అదే సమయంలో కొందరు అగ్ర హీరోలు మాత్రం తమ కెరీర్ మొత్తం ఒరిజినల్ కథలపైనే నమ్మకం ఉంచుతూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించకుండా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న హీరోలు కూడా కొందరున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు 25 ఏళ్లకు పైగా సినీ కెరీర్ లో ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు. ఒక్కడు నుంచి పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, సర్కారు వారి పాట, గుంటూరు కారం వరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒరిజినల్ కథలే. కథల ఎంపికలో కొత్తదనం, డైరెక్టర్ల విజన్‌పై నమ్మకం ఉంచడం మహేష్ స్పెషాలిటీగా భావిస్తారు.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో రీమేక్‌లకు దూరంగానే ఉన్నారు. ఆర్య, దేశముదురు, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, పుష్ప వంటి సినిమాలన్నీ ఒరిజినల్ కాన్సెప్ట్‌లతోనే తెరకెక్కాయి. కథలో వైవిధ్యం, పాత్రల్లో కొత్తదనం ఉండేలా చూసుకోవడం బన్నీ కెరీర్‌లో ప్రధాన బలంగా నిలిచింది.
ఇక టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా తన 15 ఏళ్ల సినీ కెరీర్ లో ఇప్పటివరకు రీమేక్‌లకు అవకాశం ఇవ్వలేదు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ట్యాక్సీవాలా, ఖుషి వంటి సినిమాలన్నీ ఒరిజినల్ కథలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. యూత్ ను ఆకట్టుకునే కొత్త కాన్సెప్ట్‌లను ఎంచుకోవడంలో విజయ్ ప్రత్యేక శైలిని కొనసాగిస్తున్నారు. అయితే ఎవరైనా సరే రీమేక్‌లు చేయడం తప్పు కాదు. చాలా మంది హీరోలు ఆ రీమేక్స్ తో సక్సెస్‌లు కూడా అందుకున్నారు. కానీ మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మాత్రం ఒరిజినల్ కథలతోనే తమ బ్రాండ్‌ను నిర్మించుకోవడం విశేషం. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొత్త కథలకు ప్రాధాన్యం ఇస్తూ తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న ఈ హీరోలు, కథ ఎంపికలో తమదైన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారు.