ట్రెండీ స్టోరి: ఫ‌స్టాఫ్‌ ఓకే కానీ సెకండాఫ్‌పైనే పెద్ద‌ ఆశ‌లు!

బాక్సాఫీస్ కలెక్షన్లలో ఆశించిన‌ వృద్ధి కనిపించినా విడుదలైన చిత్రాలలో కేవలం కొన్ని మాత్రమే బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.

Update: 2026-07-07 01:30 GMT

2026 ప్రథమార్ధం (మొదటి ఆరు నెలలు) భారతీయ సినీ పరిశ్రమకు మిశ్రమ ఫలితాలను అందించింది. దేశవ్యాప్తంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య.. బాక్సాఫీస్ కలెక్షన్లలో ఆశించిన‌ వృద్ధి కనిపించినా విడుదలైన చిత్రాలలో కేవలం కొన్ని మాత్రమే బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఐపీఎల్ సీజన్, సాధారణ ఎన్నికలు , పశ్చిమ ఆసియాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అలాగే టాక్సిక్, మాతృభూమి వంటి భారీ చిత్రాల విడుదలలో జాప్యం జరిగి క్యాలెండర్ షెడ్యూల్ మారినా.. థియేటర్లలో సినిమాలను ఆస్వాధించాలనే ప్రేక్షకుల ఆసక్తి మాత్రం తగ్గలేదని స్పష్టమైంది.

హిందీ చిత్రసీమలో దేశభక్తి, యాక్షన్ స‌హా విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్'దురందర్: ది రివెంజ్' ఏకంగా 1,800 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేసింది. దీనితో పాటు క్లాసిక్ సీక్వెల్'బోర్డర్ 2' 450 కోట్లతో, హారర్ కామెడీ'భూత్ బంగ్లా' 270 కోట్లతో భారీ విజయాలను నమోదు చేశాయి. ఇంతియాజ్ అలీ విభజన నాటి గాథగా తెరకెక్కించిన'మై వాపస్ ఆవుంగా' వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నెమ్మదిగా వ‌సూళ్లు మొదలైనా ప్రేక్షకుల ఆదరణతో మంచి వసూళ్లను సాధించాయి.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో కూడా 70 శాతానికి పైగా సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. టాప్ స్టార్ల చిత్రాలు మాత్రం ఊహించని రీతిలో 300 కోట్ల క్లబ్‌లో చేరాయి. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన'మన శంకర వరప్రసాద్ గారు', రామ్ చరణ్'పెద్ది' బాక్సాఫీస్ వద్ద విజయభేరి మోగించి చెరో 300 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను సాధించాయి. తమిళంలో సూర్య హీరోగా వచ్చిన'కరుప్పు' సైతం 300 కోట్ల మార్కును దాటగా, మలయాళంలో మోహన్‌లాల్'దృశ్యం 3'.. యూత్ ఫుల్ కామెడీ'వాళ 2' బాక్సాఫీస్ వద్ద 240 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీకి ఊపునిచ్చాయి.

పరిశ్రమ విశ్లేషకుల ప్రకారం.. కేవలం భారీ తారాగణం లేదా భారీ స్కేల్ మాత్రమే కాకుండా బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రేక్షకులు పట్టం గడుడుతున్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో గత ఏడాదితో పోలిస్తే థియేటర్ అడ్మిషన్లు 10 నుండి 12 శాతం.. ఓవరాల్ బాక్సాఫీస్ కలెక్షన్లు 16 నుండి 17 శాతం పెరగడం సినిమా రంగానికి సానుకూల సంకేతంగా మారింది. అదే సమయంలో భారీ అంచనాలతో వచ్చిన కొన్ని క్రేజీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయాయి.

ఇక 2026 ద్వితీయార్థం (సెకండ్ హాఫ్) పై ట్రేడ్ వర్గాలు మరింత భారీ అంచనాలతో ఉన్నాయి. అయితే వైఆర్ఎఫ్ ఆల్ఫా ఆరంభ‌మే నిరాశ‌ప‌రిచింది. ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు రావ‌డంతో క‌లెక్ష‌న్స్ డ్రాప్ అయ్యాయి. ఇక‌ సెకండాఫ్‌లో ఖాన్ లు, క‌పూర్ ల‌ సినిమాలు మంచి ఊపు తెస్తాయ‌ని అంచనా వేస్తున్నారు. సల్మాన్ ఖాన్'మాతృభూమి', నితేష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం'రామాయణం', షారుఖ్ ఖాన్'కింగ్' వంటి ప్రతిష్టాత్మక భారతీయ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. య‌ష్'టాక్సిక్' ఈ ఏడాదిలోనే విడుద‌లైతే అది బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ నుంచి ద్వితీయార్థంలో వెంకీ- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీ ఆద‌ర్శ కుటుంబం మంచి హుషారు తెస్తుంద‌ని అంచ‌నా ఉంది. అలాగే నాని- ది ప్యార‌డైజ్, దేవ‌ర‌కొండ‌ ర‌ణ‌బ‌లి- రౌడీ జ‌నార్థ‌న వంటి చిత్రాల‌పైనా భారీ అంచ‌నాలున్నాయి. వీటితో పాటు హాలీవుడ్ నుండి క్రిస్టోఫర్ నోలన్'ది ఒడిస్సీ', మార్వెల్'అవెంజర్స్: డూమ్స్‌డే' వంటి క్రేజీ చిత్రాలు కూడా లైన‌ప్‌లో ఉండటంతో ఈ ఏడాది ద్వితీయార్థం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News