రుద్ర ప్రయాగలో తారక్-త్రివిక్రమ్!
బహుశా సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలకు ఈ ప్రదేశం ప్రధాన నేపథ్యంగా మారొచ్చు.రుద్రప్రయాగలో మొదలయ్యే ఈ ప్రయాణం కేవలం షూటింగ్ మాత్రమే కాదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన నాటి నుంచి అంచనాలు ఆకాశన్నంటుతోన్న సంగతి తెలిసిందే. సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా? ఎప్పుడు సెట్స్ కు వెళ్తుందా? అన్న ఆసక్తి అభిమానుల్లో అంతకంతకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ ఉత్తరాఖండ్‌లోని సుందరమైన రుద్రప్రయాగలో ప్రారంభం కానుందని తెలిసింది. ప్రకృతి ఒడిలో, హిమాలయాల పాదాల చెంత సినిమా చిత్రీకరణకు గురూజీ ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తుంది.
ఇప్పుడీ ప్రచారం మరింత క్రేజీగా మారింది. రుద్రప్రయాగ అంటేనే ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడే ప్రసిద్ధ కార్తికేయ స్వామి దేవాలయం ఉండటం ఈ షూటింగ్‌కు ఒక ప్రత్యేకతను చేకూరుస్తోంది. ఆధ్యాత్మికత , ప్రశాంతత ఉట్టిపడే ఇలాంటి ప్రదేశాలను తన సినిమాల్లో లొకేషన్లుగా ఎంచుకోవడం త్రివిక్రమ్ శైలికి నిదర్శనం. ఆ అద్భుతమైన వాతావరణం, విజువల్స్ వెండితెరపై ప్రేక్షకులను మైమరిపించేలా ఉంటాయని చిత్రబృందం భావిస్తోంది. త్రివిక్రమ్ చాలా వరకూ రియల్ లొకేషన్స్ లోనూ షూటింగ్ చేస్తుంటారు.
అత్యవసరం అయితే తప్ప సెట్స్ వేయరు. వాస్తవ లొకేషన్స్ లో షూట్ చేస్తే రియాల్టీగా ఉంటుందని బలంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమా షూటింగ్ లన్నీ చాలా వరకూ రియల్ లొకేషన్స్ లో ఉంటాయి. ఆర్టిఫిషియల్ గా ఉండటం నచ్చదు. పైగా గురూజీకి ఇదే తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `డ్రాగన్` షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయినా తారక్ గురూజీ సినిమా కోసం ఓ వైపు కసరత్తులు మొదలు పెట్టారు.
పాత్రకు సంబంధించి ప్రత్యేకమైన పుస్తకాలు చదవడం ఇప్పటికే మొదలు పెట్టారు. మరి లుక్ పరంగా ఎలాంటి మార్పులు కోరారు? అన్నది డ్రాగన్ షూటింగ్ అనంతరం క్లారిటీ వస్తుంది. త్రివిక్రమ్ మార్కు సంభాషణలు, ఎన్టీఆర్ అభినయ సామర్థ్యం సినిమాలో కొత్త కోణంలో ఉండబోతున్నాయని సమాచారం. రుద్రప్రయాగ వంటి పవిత్రమైన ప్రాంతంలో షూటింగ్ మొదలుపెట్టడం వెనుక దర్శకుడికి ఏదైనా ప్రత్యేక ఉద్దేశ్యం ఉందా అనే ఆసక్తి కూడా సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
బహుశా సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలకు ఈ ప్రదేశం ప్రధాన నేపథ్యంగా మారొచ్చు.రుద్రప్రయాగలో మొదలయ్యే ఈ ప్రయాణం కేవలం షూటింగ్ మాత్రమే కాదు. ఈ కాంబినేషన్ మరో అద్భుతమైన అధ్యాయానికి నాంది. హిమాలయాల అంచున తారక్ నటనా పటిమ ఎలా ఉండబోతుందో? చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.