అన్ని అవార్డుల్లోను మా హీరో ముందుంటాడు అంటున్న నిర్మాత!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటనకు ఈ ఏడాది అవార్డుల పంట పండటం ఖాయమని ప్రముఖ నిర్మాత ఎస్.కె.ఎన్ గట్టి ధీమా వ్యక్తం చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటనకు ఈ ఏడాది అవార్డుల పంట పండటం ఖాయమని ప్రముఖ నిర్మాత ఎస్.కె.ఎన్ గట్టి ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ప్రస్తుతం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగాను రాణించాలనే ప్రయత్నం చేస్తూ, సినిమాపై తనకున్న ప్యాషన్‌ను చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే సాయి రాజేష్ - ఎస్కేఎన్ బృందం కలయికలో వస్తున్న సరికొత్త చిత్రంలో ఈ యువహీరో నటనలో గొప్ప పరిణతి కనిపిస్తుందని, ఈ ఏడాది మునుముందు అన్ని ప్రతిష్టాత్మక అవార్డుల నామినేషన్లలో కిరణ్ అబ్బవరం పేరు ఖచ్చితంగా ఉంటుందని ఎస్కేఎన్ ధీమాను వ్యక్తం చేశారు.
ఒక ఇంటర్వ్యూలో ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. తాము అనుకున్న కథకు కిరణ్ అబ్బవరం వంద శాతం న్యాయం చేశారని కొనియాడారు. ఇప్పటివరకు `బాయ్ నెక్ట్స్ డోర్` పాత్రలతో పాటు మాస్ క్యారెక్టర్లలో మెప్పించిన కిరణ్, `చెన్నయ్ లవ్ స్టోరి` సినిమాలో మలి ప్రేమను గెలిపించే వీర ప్రేమికుడిగా అద్భుతంగా నటించారని ప్రశంసించారు. అవార్డులతో పాటు ఈ సినిమా కిరణ్ కెరీర్‌లో ఒక పెద్ద కమర్షియల్ విజయంగా నిలుస్తుందని మేకర్స్ తో పాటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దర్శకుడు సాయి రాజేష్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఎప్పుడూ మంచి ప్రాధాన్యత ఉంటుందని, ఈ చిత్రంలో కూడా హీరోయిన్ సీన్‌తోనే కథ ప్రారంభమవుతుందని ఎస్కేఎన్ వెల్లడించారు. ఇంతటి బలమైన పాత్ర కోసం తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీ గౌరి ప్రియను ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. పాత్రకు వంద శాతం న్యాయం చేసిన గౌరి ప్రియ నటన ..ఈ సినిమాలోని భావోద్వేగాలు థియేటర్ల నుండి బయటకు వచ్చాక కూడా ప్రేక్షకుల మనసుల్లో చాలా రోజుల పాటు వెంటాడతాయని పేర్కొన్నారు.
గతంలో సాయి రాజేష్ - ఎస్కేఎన్ కాంబినేషన్‌లో వచ్చిన `బేబి` సినిమా తొలి ప్రేమ గొప్పతనాన్ని, అందులోని పెయిన్‌ను చూపించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే తొలి ప్రేమ దక్కని వారి జీవితంలో మళ్లీ ప్రేమ పుట్టదని చెప్పలేమని..జీవితం ఎప్పుడూ ముందుకు సాగాల్సిందేనని చెప్తూ.. ఈ సరికొత్త `చెన్నై లవ్ స్టోరి`లో మలి ప్రేమ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో కథ ఎక్కడా విషాదకరంగా సాగకుండా.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుందని భరోసా ఇచ్చారు.
`బేబి` వంటి భారీ విజయం తర్వాత దాదాపు మూడేళ్ల సమయం తీసుకొని..తమదైన మార్క్ వేసేలా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని నిర్మించామని ఎస్కేఎన్ స్పష్టం చేశారు. కిరణ్ అబ్బవరం కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రంగా, కమర్షియల్ సక్సెస్‌తో పాటు అవార్డులను తెచ్చిపెట్టే ప్రాజెక్ట్‌గా ఇది నిలుస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేసారు.