నెగెటివ్ సమీక్షలపై దర్శకహీరోల అసంతృప్తి!
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన `థాంక్స్ మీట్`లో సినిమా విజయంపై హర్షం వ్యక్తం చేస్తూనే, నెగెటివ్ రివ్యూల బారిన పడకుండా థియేటర్లలో సినిమాను చూడాలని దర్శకహీరోలు విజ్ఞప్తి చేశారు.
సనాతన ధర్మం, భారతదేశ చారిత్రక వైభవం నేపథ్యంలో తెరకెక్కిన `నాగబంధం` బాక్సాఫీస్ విజయానికి సహకరించిన ప్రేక్షకులకు చిత్రబృందం ధన్యవాదాలు తెలిపింది. విరాట్ కర్ణ హీరోగా, ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వంలో నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన `థాంక్స్ మీట్`లో సినిమా విజయంపై హర్షం వ్యక్తం చేస్తూనే, నెగెటివ్ రివ్యూల బారిన పడకుండా థియేటర్లలో సినిమాను చూడాలని దర్శకహీరోలు విజ్ఞప్తి చేశారు.
ఈ సక్సెస్ మీట్‌లో హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ.. థియేటర్లలో ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోందని ఎమోషనల్ అయ్యారు. వెండితెరపై అనంత పద్మనాభ స్వామి రూపం కనిపించినప్పుడు కొందరు భక్తులు చెప్పులు విడిచి మరీ భక్తితో సినిమా చూస్తున్నారని... వారి కళ్లలో ఆనందభాష్పాలు కనిపిస్తున్నాయని తెలిపారు. థియేటర్లన్నీ `హర హర మహాదేవ` నినాదాలతో మారుమోగిపోతున్నాయని, మన సంస్కృతిని తెరపై చూసి ముఖ్యంగా మహిళలు, పిల్లలు బ్రహ్మరథం పడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. బుక్ మై షోలో ఈ చిత్రం ట్రెండింగ్‌లో ఉంటూ.. రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోందని అన్నారు.
అయితే, కొంతమంది విమర్శకులు కావాలనే సినిమా చూడొద్దంటూ చేస్తున్న నెగెటివ్ కామెంట్లపై విరాట్ కర్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మేము విమర్శలను ఎల్లప్పుడూ గౌరవిస్తాం..కానీ సినిమాని చూడొద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఒక సినిమాను ఆదరించాలా వద్దా అనేది కేవలం ప్రేక్షకులు మాత్రమే నిర్ణయిస్తారు! అని ధీటుగా బదులిచ్చారు. మూవీ క్లైమాక్స్‌లో నాగసాధువును చూసి సాక్షాత్తూ పరమశివుడే దిగివచ్చినట్లు ప్రేక్షకులు చప్పట్లతో థియేటర్లను హోరెత్తిస్తున్నారని... దేవుడే తమ వెనకుండి ఈ సినిమాను నడిపిస్తున్నాడని నమ్ముతున్నట్లు విరాట్ పేర్కొన్నారు. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లు ప్రతి ఒక్కరినీ అలరిస్తున్నాయని, థియేటర్లలోనే ఈ అనుభూతిని పొందాలని కోరారు.
దర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ.. విమర్శకులకు, రివ్యూ రైటర్లకు తాను ఎప్పుడూ గౌరవం ఇస్తానని.. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఇప్పటికే ఫస్ట్‌హాఫ్‌లో ఒక పాట నిడివిని, అలాగే క్లైమాక్స్‌ను కాస్త ట్రిమ్ చేశామని వెల్లడించారు. కానీ సినిమా అసలు రిలీజ్ కాకముందే కొందరు నెగెటివ్ రివ్యూలు ఇవ్వడం చూసి తనకు ఆశ్చర్యం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల కష్టం.. ఒక నమ్మకంతో ముందడుగు వేసిన కొత్త నిర్మాతలు, హీరోలను సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలాంటి పద్ధతులకు పాల్పడటం సరికాదన్నారు. ప్రతి ఒక్కరూ థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాక జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని అదే తమకు అసలైన ఎనర్జీ అని కోరారు.
చివరగా ఈ చిత్రం కేవలం కల్పిత కథ కాదని.. భారతదేశ చరిత్రలోని ఒక చీకటి కోణాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నమని దర్శకుడు స్పష్టం చేశారు. పూర్వం ఆఫ్ఘన్లు మన దేశంపై దాడి చేసి దేవాలయాలను ధ్వంసం చేస్తూ.. హిందువులను దారుణంగా చంపుతున్న సమయంలో.. ఆదిశంకరాచార్యులు మన సంస్కృతిని, ఆలయాలను రక్షించడానికి `నాగసాధువుల` వర్గాన్ని ఎలా ఏర్పాటు చేశారనేది చరిత్ర పుస్తకాల ఆధారంగానే చూపించామని అన్నారు. పుస్తకాల్లో ఉన్న దారుణాలలో కేవలం పది శాతం మాత్రమే సినిమాలో చూపించామని... మన చరిత్రను నెక్స్ట్ జనరేషన్‌కు అందించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశామని చెప్తూ... ప్రేక్షకులు తమ సినిమాను థియేటర్లలోనే చూసి ఆశీర్వధించాలని చిత్ర యూనిట్ కోరింది.