చెన్నై లవ్ స్టోరీ.. SKN అంచనాలు ఎలా ఉన్నాయంటే?
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన మూవీ చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఆ సినిమాను అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు.
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన మూవీ చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఆ సినిమాను అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. సాయి రాజేష్ కథ అందించగా.. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. జూలై 24న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా, తాజాగా సినిమా విశేషాలు నిర్మాత ఎస్కేఎన్ పంచుకున్నారు. బేబి తర్వాత తమ బ్యానర్లకు గుర్తింపు తీసుకొచ్చే చిత్రమిదని ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు జంట చెన్నైలో నివసించే నేపథ్యంలో కథ సాగుతుందని ఎస్కేఎన్ తెలిపారు. అందుకే సినిమాకు చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ పెట్టినట్లు చెప్పారు. బేబి విజయం తర్వాత తమపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయని.. అందుకే మరో మంచి సినిమాతో రావడానికి సమయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నేషనల్ అవార్డు విన్నర్ సాయి రాజేష్ చెప్పిన కథ నచ్చడంతో సినిమాను నిర్మించామని తెలిపారు.
కిరణ్ అబ్బవరం ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన నటన కొత్తగా ఉంటుందని ఎస్కేఎన్ చెప్పారు. ఆయన నటనలోని మెచ్యూరిటీ ప్రేక్షకులు చూస్తారని పేర్కొన్నారు. ఈ ఏడాది అవార్డుల నామినేషన్లలో కిరణ్ పేరు తప్పకుండా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమా పట్ల ఆయనకున్న ఇంట్రెస్ట్, డెడికేషన్ షూటింగ్ సమయంలో చూశామని తెలిపారు. హీరోయిన్ పాత్రకు కథలో ఎంతో ఇంపార్టెన్స్ ఉందని చెప్పారు. సినిమా కూడా హీరోయిన్ సీన్ తో ప్రారంభమవుతుందని తెలిపారు.
స్ట్రాంగ్ రోల్ కు ప్రియ సరైన అమ్మయిగా భావించామని.. ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసిందన్నారు. సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులకు చాలా రోజుల పాటు గుర్తుండిపోతాయని చెప్పారు. బేబి తొలి ప్రేమ నేపథ్యంలో సాగితే.. చెన్నై లవ్ స్టోరీ మలి ప్రేమ కూడా గొప్పదనే విషయాన్ని చెబుతుందని వివరించారు. తొలి ప్రేమ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో మళ్లీ ప్రేమ పుట్టదని చెప్పలేమన్నారు.
బేబిని కల్ట్ లవ్ స్టోరీగా ప్రేక్షకులు ఆదరించారని.. సినిమాకు క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు వస్తుందని అంచనా వేశారు. చెన్నైతో పాటు పాండిచ్చేరి, వైజాగ్, చీరాల ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరిపినట్లు తెలిపారు. కథలోని భావోద్వేగాలకు విజువల్ బ్యూటీ అవసరమని.. అందుకే నేచురల్ గా షూట్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నామని చెప్పారు. మణిశర్మ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఎస్కేఎన్ తెలిపారు. కథలోని భావోద్వేగాలకు తగినట్లుగా ఆయన సంగీతం అందించారని చెప్పారు.
అనంత శ్రీరామ్ అన్ని పాటలు రాశారని పేర్కొన్నారు. దర్శకుడు రవి నంబూరి టాలెంటెడ్ అంటూ ప్రశంసించారు. చెన్నై లవ్ స్టోరీలో ఎలాంటి వివాదాస్పద అంశాలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా భావోద్వేగాల నేపథ్యంలో సినిమా సాగుతుందన్నారు. సినిమా టికెట్ ధరలు పెంచడం లేదని ఎస్కేఎన్ తెలిపారు. అంతా అందుబాటు ధరల్లో సినిమా చూడాలనేదే తమ ఉద్దేశమన్నారు. ఎక్కువ వసూళ్లు కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా చూడటమే సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. చెన్నై లవ్ స్టోరీ మంచి హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నట్లు ఎస్కేఎన్ తెలిపారు.