బాలీవుడ్ లో సౌత్ డైరెక్టర్ల హవా!
ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓ ఆసక్తికర మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు దక్షిణాది చిత్రాలను రీమేక్ చేసుకుని నెట్టుకొచ్చిన బాలీవుడ్ ఇప్పుడు నేరుగా సౌత్ దర్శకుల వైపు మొగ్గు చూపుతోంది.
ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓ ఆసక్తికర మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు దక్షిణాది చిత్రాలను రీమేక్ చేసుకుని నెట్టుకొచ్చిన బాలీవుడ్ ఇప్పుడు నేరుగా సౌత్ దర్శకుల వైపు మొగ్గు చూపుతోంది. సందీప్ రెడ్డి వంగా, అట్లీ వంటి దర్శకులు బాలీవుడ్ అగ్రనటులతో కలిసి సృష్టించిన అద్భుతాలు దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా కథనంలో ఉండే కొత్తదనం , భావోద్వేగాల తీవ్రత బాలీవుడ్ స్టార్స్‌ను సౌత్ మేకర్ల వైపు ఆకర్షితమయ్యేలా చేస్తున్నాయన్నది కాదనలేని నిజం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన `యానిమల్` బాలీవుడ్‌లో ఓ కొత్త తరహా యాక్షన్‌కు నాంది పలికింది.
అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటించిన `జవాన్` చిత్రం భారీ వసూళ్లను సాధించి సౌత్ మేకింగ్ స్టైల్‌కు ఉన్న సత్తాను నిరూపించింది. ఈ విజయాలు బాలీవుడ్ అగ్రనటులలో ఓ రకమైన ఆత్మవిశ్వాసాన్ని నింపడ మే కాకుండా దక్షిణాది దర్శకులతో పనిచేస్తే బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయమనే నమ్మకాన్ని కలిగించాయి. ప్రస్తుతం బాలీవుడ్ అగ్రనటులంతా దక్షిణాది దర్శకులతో కలిసి పనిచేయడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారు. కథా చర్చల కోసం ముంబై నుండి హైదరాబాద్‌కి రావడం.. సౌత్ దర్శకుల మేకింగ్ శైలిని దగ్గరుండి గమనించడం వంటివి సర్వా సాధరణమైంది.
స్టార్‌డమ్‌ను సరైన పద్ధతిలో వాడుకుంటూ మాస్ ఆడియన్స్‌ను మెప్పించడంలో సౌత్ డైరెక్టర్లు చూపే ప్రతిభే ఈ ఆసక్తికి ప్రధాన కారణం. బాలీవుడ్ స్టార్స్ కూడా ఇమేజ్‌ను మించి ప్రయోగాల కోసం సౌత్ సృజనాత్మకతను నమ్ముకుంటున్నారు. ఈ క్రేజీ ట్రెండ్‌లో భాగంగా మరిన్ని ఆసక్తికర కాంబినేషన్లు తెరపైకి వస్తున్నాయి. హృతిక్ రోషన్ - పరశురామ్ కలయికలో రాబోతున్న చిత్రం ప్రత్యేకమైన యాక్షన్ డ్రామాగా భావిస్తున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ కూడా బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ నీల్, సుకుమార్, రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ల కోసం బాలీవుడ్ స్టార్లే క్యూలో ఉన్నారు.
కానీ తాము ఏం చేయాలనుకున్నా? టాలీవుడ్ నుంచే సాధిస్తాం అన్న నమ్మకంతో ప్రయోగాలన్నీ ఇక్కడ నుంచే చేస్తున్నారు. దక్షిణాది దర్శకుల మేకింగ్ శైలిలో ఉండే వేగం, విజువల్స్ పట్ల చూపే శ్రద్ధ బాలీవుడ్‌ను ఆకట్టుకుం టున్నాయి. యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేయడంలోనూ, భావోద్వేగాలను పండించడంలోనూ సౌత్ మేకర్లకు ఉన్న పట్టు బాలీవుడ్ నటులకు కొత్త అనుభవాన్ని ఇస్తోంది. సినిమాను ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లడంలో దక్షిణాది దర్శకులు పాటించే ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ఎమోషన్ ఫార్ములా బాలీవుడ్‌కు బాగా వర్కవుట్ అవుతోంది.
ఈ మార్పు కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా సాగుతోంది. సౌత్ డైరెక్టర్ల సృజనాత్మకతను బాలీవుడ్ స్టార్స్ వాడుకోవడం వల్ల ప్రాజెక్టుల బడ్జెట్ - రేంజ్ పెరుగుతున్నాయి. ఇది కేవలం ప్యాన్ ఇండియా చిత్రాలకు మాత్రమే కాలేదు. భవిష్యత్తులో సౌత్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటానికి కూడా బలమైన పునాదిని వేస్తోంది. దక్షిణాది దర్శకులు బాలీవుడ్‌లో రాణించడం వల్ల ఇండస్ట్రీల మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోతున్నాయి.