ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే బాక్సాఫీస్ సెన్సేషన్
పెద్ద స్టార్ హీరో, భారీ ప్రమోషన్లు, రిలీజ్‌కు ముందే భారీ హైప్.. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ సక్సెస్ కు ఇవే ప్రధాన అస్త్రాలుగా భావిస్తున్నారు.
పెద్ద స్టార్ హీరో, భారీ ప్రమోషన్లు, రిలీజ్‌కు ముందే భారీ హైప్.. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ సక్సెస్ కు ఇవే ప్రధాన అస్త్రాలుగా భావిస్తున్నారు. కానీ అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు ఈ లెక్కలన్నింటినీ తలకిందులు చేస్తుంటాయి. తాజాగా తమిళంలో రిలీజైన గట్టా కుస్తీ2 కూడా అలాంటి లిస్ట్ లోనే చేరింది. ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని నమోదు చేస్తోంది.
ఈ సక్సెస్ ను మరింత ప్రత్యేకంగా మార్చిన అంశం సీక్వెల్ స్ట్రాటజీ. సాధారణంగా ఇండస్ట్రీలో భారీ హిట్లకే సీక్వెల్స్ ప్లాన్ చేస్తారు. కానీ కేవలం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న గట్టా కుస్తీకి సీక్వెల్ తెరకెక్కించడం ఒక రిస్క్ అనే అభిప్రాయం మొదట్లో ఉంది. అయినప్పటికీ ఆ రిస్క్ తీసుకున్న మేకర్స్ ఇప్పుడు దానికి తగిన ఫలితాన్ని అందుకుంటున్నారు. కథలో కొత్త వినోదాన్ని జోడిస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకుని రూపొందించిన తీరు ఈ సక్సెస్‌కు మెయిన్ రీజన్‌గా కనిపిస్తోంది.
మొదటి రోజు మామూలుగా ఎలాంటి హడావిడి లేకుండా మొదలైన సినిమా, ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ టాక్‌తో రెండో రోజు నుంచి స్పష్టమైన ఊపు అందుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీలతో కలిసి సినిమాలు చూసే ఆడియన్స్ థియేటర్లకు రావడం కలెక్షన్లలో భారీ పెరుగుదలకు దోహదపడింది. సెకండ్ డే కలెక్షన్స్ మొదటి రోజుతో పోలిస్తే గణనీయంగా పెరగడం, వీకెండ్‌లో థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం ఈ సినిమాకు పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో తమిళ బాక్సాఫీస్‌ను పరిశీలిస్తే మరో ఆసక్తికరమైన ట్రెండ్ కూడా కనిపిస్తోంది. అతిగా యాక్షన్, భారీ బడ్జెట్‌ల కంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఎంటర్టైన్మెంట్ సినిమాలకే ఆడియన్స్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్, నేచురల్ కామెడీ, అందరికీ కనెక్ట్ అయ్యే కథనం ఉంటే స్టార్ పవర్ లేకపోయినా ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారని వరుస సక్సెస్‌లు స్పష్టం చేస్తున్నాయి. గట్టా కుస్తీ-2 అదే ట్రెండ్‌ను మరింత బలపరిచిన చిత్రంగా నిలుస్తోంది.
ఈ సక్సెస్‌తో హీరో విష్ణు విశాల్ కెరీర్‌కూ మంచి ఊపు లభించినట్టే కనిపిస్తోంది. చాలా కాలంగా విభిన్న కథలను ఎంచుకుంటున్న ఆయనకు, కమర్షియల్ పరంగా ఈ రేంజ్ సక్సెస్ దక్కడం విశేషం. ముఖ్యంగా భారీ స్టార్‌డమ్‌పై ఆధారపడకుండా సరైన కథ, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే వినోదం ఉంటే మార్కెట్‌లో నిలబడొచ్చని ఈ సినిమా మరోసారి నిరూపించింది. మొత్తంగా చూస్తే గట్టా కుస్తీ2 సక్సెస్ కేవలం ఒక సినిమా సక్సెస్ గా మాత్రమే కాదు. యావరేజ్ హిట్‌కూ సరైన సీక్వెల్ చేస్తే అది బ్లాక్‌బస్టర్‌గా మారొచ్చని, ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కంటెంట్‌కు ఇప్పటికీ బాక్సాఫీస్‌లో భారీ డిమాండ్ ఉందని, స్టార్ ఇమేజ్ కంటే ప్రేక్షకులను అలరించే కథే చివరికి సక్సెస్ ను డిసైడ్ చేస్తుందని మరోసారి ప్రూవ్ చేసిన ఎగ్జాంపుల్ గా ఈ సినిమా నిలిచింది.