ఆ స్టార్ హీరోలు కారణంగా చిన్న హీరోలకు ఇబ్బంది!
ఒకవేళ పెద్ద సినిమాలు అనుకున్న సమయానికే వస్తే థియేటర్లన్నీ వాటికే కేటాయిస్తారని చిన్న హీరోల మరో ప్రధాన ఆందోళన.
టాలీవుడ్ లో పెద్ద చిత్రాల విడుదల తేదీల చుట్టూ నెలకొన్న అనిశ్చితి చిన్న , మధ్యతరహా చిత్రాల నిర్మాతలను ఎప్పటి కప్పుడు గందరగోళానికి గురిచేస్తుంటుంది. తాజాగా అదే పరిస్థితి మరోసారి తలెత్తింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన `విశ్వంభరం`, నేచురల్ స్టార్ నాని `ది పారడైజ్` వంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల తేదీలను ఖరారు చేసే ప్రక్రియలో ఉండటం లేదా వాయిదా పడే అవకాశం ఉండటంతో చిన్న బడ్జెట్ సినిమాల విడుదల తేదీలు అటకెక్కిపోతున్నాయి. `విశ్వంభర` చిత్రం దసరా పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ 16న విడుదల కావచ్చనే వార్తలు వస్తుండగా నాని `ది పారడైజ్` ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 25కి మారే అవకాశం ఉందనే ఊహాగానాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఇలాంటి పరిస్థితుల్లో అగ్ర హీరోల సినిమాలు ఏ రోజు థియేటర్లలోకి వస్తాయో? తెలియక తమ సినిమాను ఏ తేదీన విడుదల చేస్తే బాగుంటుందో నిర్ణయించుకోలేక చిన్న నిర్మాతలు సతమతమవుతున్నారు. పెద్ద సినిమాల విడుదలపై స్పష్టత లేకపోవడం వల్ల థియేటర్ల లభ్యతపై కూడా అనిశ్చితి నెలకొంది. పండగ సీజన్లు లేదా ముఖ్యమైన వారాంతాల్లో అగ్ర హీరోల చిత్రాలు విడుదలవుతాయని తెలిసి కూడా ఆ సినిమాలు చివరి నిమిషంలో వాయిదా పడితే అనవసరంగా తమ సినిమాలను విడుదల చేసి నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు భయపడుతున్నారు.
ఒకవేళ పెద్ద సినిమాలు అనుకున్న సమయానికే వస్తే థియేటర్లన్నీ వాటికే కేటాయిస్తారని చిన్న హీరోల మరో ప్రధాన ఆందోళన. దర్శక,నిర్మాతలు ప్రాజెక్టుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా వాయిదాలు వేయడం ఒక ఎత్తయితే? దీని వెనుక ఉన్న ఆర్థిక సమీకరణాలు , ఓటిటి ఒప్పందాలు, షూటింగ్ ఆలస్యాలు బాక్సాఫీస్ లైనప్‌ని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తున్నాయి. అగ్ర హీరోల ప్రాజెక్టుల భారీ స్థాయి కారణంగా సాంకేతిక పనులు, గ్రాఫిక్స్‌కు అధిక సమయం అవసరమవుతుండటం జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఈ పరిస్థితులు పరిశ్రమలో ఒక రకమైన రిలీజ్ డెడ్ లాక్ ని సృష్టిస్తున్నాయి. ఒకవేళ భారీ చిత్రాల విడుదల తేదీలు అధికారికంగా ప్రకటించకపోతే? బాక్సాఫీస్ వద్ద వసూళ్లు దెబ్బతినడమే కాకుండా చిన్న చిత్రాలకు ప్రమోషన్లు చేసుకునే సమయం కూడా దొరకదు. అగ్ర హీరోల సినిమాలు వచ్చినప్పుడు చిన్న చిత్రాలు కనుమరుగైపోయే ప్రమాదం ఉండటంతో నిర్మాతలు ఇప్పుడు ప్రత్యామ్నాయ విడుదల తేదీల కోసం వెతుకులాటలో ఉన్నారు. టాలీవుడ్ లో రిలీజ్ క్యాలెండర్ క్రమబద్ధీకరించబడాల్సిన అవసరం ఉంది. నిర్మాతల మండలి చొరవ తీసుకుని, సినిమాల విడుదలలో స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే అగ్ర హీరోల భారీ సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా ఉనికిని కాపాడుకోగలవు.