కార్మిక స‌మ్మె: కాలికి వేస్తే మెడ‌కు.. మెడ‌కు వేస్తే కాలికి..!

ముఖ్యంగా ఈ వారంలో షూటింగులు ప్రారంభించాల‌నుకుంటున్న వారికి, ఇప్ప‌టికే సెట్స్ లో ఉన్న వారికి టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.;

Update: 2025-08-08 04:18 GMT

కార్మికుల మెరుపు స‌మ్మెతో సినిమాల షూటింగులు బంద్ అయిన సంగ‌తి తెలిసిందే. కొంద‌రు బ‌డా నిర్మాత‌లు మాత్రమే ఈ ప‌రిస్థితిని మ్యానేజ్ చేయ‌గ‌లుగుతుంటే, చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నార‌ని స‌మాచారం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో షూటింగులు ప్రారంభించాల‌నుకుంటున్న వారికి, ఇప్ప‌టికే సెట్స్ లో ఉన్న వారికి టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే ప్లాన్ ప్ర‌కారం ఏదీ జ‌ర‌గ‌ద‌ని క‌ల‌త‌గా ఉన్నార‌ని తెలిసింది.

మంత‌నాలు సాగిస్తున్నా కానీ..!

అయితే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు సీరియ‌స్ గా ఫెడ‌రేష‌న్ తో నిర్మాత‌లు, సినీపెద్ద‌లు చ‌ర్చ‌లు సాగిస్తున్నారు. నేడో రేపో స‌మ్మెను విర‌మింప‌జేసి తిరిగి ప‌నుల్లోకి వెళ్లేట్టు చేయాల‌ని సినీపెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా అందిన స‌మాచారం మేర‌కు నిర్మాత‌లు కాలికి వేస్తే మెడ‌కు, మెడ‌కు వేస్తే కాలికి మెలిక‌ వేస్తున్నార‌ని తెలిసింది.

కొత్త రూల్స్ ఒప్పుకుంటారా?

6-6 కాల్షీట్, 9-9 కాల్షీట్ ఉండాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. సెట్లో కార్మికుడిని 12 గంట‌లు లాక్ చేస్తేనే 15శాతం వేత‌నం పెంచుతామ‌ని నిర్మాత‌లు చెబుతున్నార‌ట‌. ప్ర‌భుత్వ సెల‌వులు త‌ప్ప ఇంకే సెల‌వులు ఉండ‌వు. మూడు ఆదివారాలు మాత్ర‌మే సెల‌వులు, నాలుగో ఆదివారం ప‌ని చేయాలి. అయితే ఈ రూల్స్ అన్నిటికీ ఫెడ‌రేష‌న్ ఒప్పుకోవాల్సి ఉంది. కానీ ఫెడ‌రేష‌న్ గ‌ట్టి ప‌ట్టుప‌డుతోంది. 30 శాతం పెంపును అమ‌లు చేస్తేనే షూటింగులు తిరిగి ప్రారంభ‌మ‌వుతాయ‌ని తెగేసి చెప్పేసిన‌ట్టు తెలిసింది.

ఎవ‌రెవ‌రికి ఇబ్బంది?

అయితే ఈ స‌మ్మె కార‌ణంగా ఎవ‌రెవ‌రు ఎంత ఇబ్బంది ప‌డుతున్నారు? అన్న‌ది ఆరా తీస్తే తెలిసిన సంగ‌తులివి. మెగాస్టార్ చిరంజీవి - అనీల్ రావిపూడి మూడు నాలుగు రోజుల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభించాల్సి ఉంది. ఈ షెడ్యూల్ లో న‌య‌న‌తార జాయిన్ కావాల్సి ఉండ‌గా, డిలే అవుతుంద‌ని ఆందోళ‌న ఉంది. న‌య‌న్ కాల్షీట్ల‌ను తిరిగి పొందాలంటే కొంత‌ ఇబ్బంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్- ర‌వితేజ మూవీ మాంటేజ్ సాంగ్ చిత్రీక‌ర‌ణ పెండింగ్ లో ఉంది. ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కు వ‌స్తోంది.. కాబ‌ట్టి వేగంగా చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసి ప్ర‌చార‌ఫ‌ర్వంలోకి దిగాల్సి ఉంది. ర‌వితేజ‌- సుధాక‌ర్ చెరుకూరి సినిమాని సంక్రాంతికి విడుదల చేయాల్సి ఉండ‌గా, స‌మ్మె కార‌ణంగా డిలే అవుతుంద‌నే సందేహాలు వ్య‌క్త‌మవుతున్నాయి. చ‌ర‌ణ్ - బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామా `పెద్ది` త్వ‌ర‌లో షెడ్యూల్ ప్రారంభించాల్సి ఉంది. అయితే మైత్రి మూవీ మేక‌ర్స్ `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` చిత్రీక‌ర‌ణ సాగిపోతోంద‌ని ప్ర‌క‌టించింది. త‌మ‌కు వ‌చ్చిన ఇబ్బందేమీ లేద‌ని నిర్మాత ఎర్నేని వెల్ల‌డించారు. పెద్ద బ్యాన‌ర్ల‌లో అన్న‌పూర్ణ స్టూడియోస్, వైజ‌యంతి మూవీస్ కి ఎలాంటి స‌మ‌స్యా లేదు. రెండు మూడు రోజుల్లోనే స‌మ‌స్య ప‌రిష్కారం అయితే అంత‌గా టెన్ష‌న్ ప‌డాల్సిన‌దేమీ ఉండ‌దు. కానీ ప‌రిష్కారం చాలా ముఖ్యం.

ఎప్పుడు ఆ ప్ర‌క‌ట‌న‌?

మెగాస్టార్ చిరంజీవి చొర‌వ‌తో కార్మిక స‌మాఖ్య (ఫెడ‌రేష‌న్) తో నిర్మాత‌లు మంత‌నాలు సాగిస్తున్నారు. అయితే చ‌ర్చ‌లు ఇంకా ఫ‌లవంతం కాలేదు. ఇరువైపులా ఎవ‌రి వాద‌న వారు వినిపిస్తున్నారని స‌మాచారం. చిరు ఇంట్లో నిర్మాత‌ల భేటీ త‌ర్వాత చ‌ర్చ‌ల వ‌ర‌కూ వెళ్లారు.. కానీ స‌మ్మె విర‌మింప‌జేసామ‌నే ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డ‌మే ఇబ్బందిక‌రంగా మారింది.

Tags:    

Similar News