ఈ ఏడాది టాలీవుడ్ కు తెలుగు ప్రేక్షకుడు నేర్పిన పాఠమేంటి?

జులై లో చిన్నాపెద్దా.. డబ్బింగ్ సినిమాలతో కలుపుకుంటే దాదాపు ఇరవైకు పైనే సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయ్యాయి.;

Update: 2025-09-14 03:44 GMT

భారీతనం తెలుగు ప్రేక్షకుడికి బోర్ కొడుతోందా? స్టార్ హీరోలతో హీరోయిజం ఎలివేట్ చేయటమే లక్ష్యంగా రాసుకునే స్క్రిప్టులు బాక్సాఫీస్ వద్ద బౌన్స్ బ్యాక్ అవుతున్నాయా? అంటే అవుననే చెప్పాలి. స్టార్ హీరోనా.. సాదాసీదా హీరోనా అన్నది పట్టించుకోకుండా కంటెంట్ ఉన్న సినిమాకే తమ ఓటు అన్నట్లుగా తెలుగు ప్రేక్షకుడి తీరు కనిపిస్తోంది. తాము అమితంగా అభిమానించి.. ఆరాధించే స్టార్ హీరోకు సైతం షాకులు ఇచ్చేందుకు ఏ మాత్రం తగ్గట్లేదు. దీంతో.. టాలీవుడ్ లో స్టార్ హీరోల శకం ముగిసిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

కంటెంట్ ఉండాలే కానీ హీరో ఇమేజ్ లేని వారి సినిమాల్ని సైతం సూపర్ హిట్ చేసేస్తున్నారు. అందుకు నిలువెత్తు నిదర్శనంగా లిటిల్ హార్ట్స్ మూవీని చెప్పాలి. ఒక్క సినిమా పేరు చెప్పి.. స్టార్ హీరోలను తక్కువ చేస్తున్నారా? అని కొందరికి కోపం రావొచ్చు. అది సహజం. అలాంటి వేళ.. వాదనలోకి వెళ్లే కంటే.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విడుదలైన సినిమాలు.. అందులో అదరగొట్టే హిట్ కొట్టిన సినిమాలు.. వాటి బ్యాక్ గ్రౌండ్ లను చూస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఈ ఏడాది జనవరిలో మొత్తంగా 15 సినిమాలు విడుదలైతే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు హీరో కథే. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఎంత దారుణంగా దెబ్బ తిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య నటించిన డాకు మహారాజ్ మాత్రం సేఫ్ గా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. మొత్తంగా జనవరిలో విడుదలైన 15 సినిమాల్లో కేవలం రెండు సినిమాలే విజయం సాధించాయి. ఫిబ్రవరి విషయానికి వస్తే.. దర్శకుడి మూవీగా విడుదలకు ముందే టాక్ తెచ్చుకున్న తండేల్ విజయాన్ని సొంతం చేసుకుంది. వాస్తవ ఘటనల ఆధారంగా నిర్మించిన ఈ మూవీకి హీరోగా నాగచైతన్య నటించినా.. అతగాడి ఇమేజ్ కంటే కూడా కథాబలంతోనే ఈ మూవీ సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈ నెలలో విడుదలైన సినిమాల్లో ఒక్క తండేల్ మాత్రమే విజయాన్ని సొంతం చేసుకుంది.

మార్చిలో 29 సినిమాలు విడుదలైతే నాని నిర్మించిన కోర్టు అనూహ్యం విజయాన్ని సాధిస్తే.. మ్యాడ్ సీక్వెల్ గా తీసిన మ్యాడ్ స్క్వేర్ యూత్ పుణ్యమా అని బయటపడింది. ఏప్రిల్ లో పాతిక సినిమాల వరకు రిలీజ్ అయినా.. ఒక్కటంటే ఒక్క మూవీ కూడా కలెక్షన్లు తెచ్చింది లేదు. చిత్రపరిశ్రమకు ఈ నెల దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. ‘మే’లో విడుదలైన హిట్ 3 బాక్సాఫీస్ వద్ద భారీగా విడుదలైనా.. చివరకు కిందా మీదా పడి ఓమోస్తరు వద్ద ఆగింది. చిన్న సినిమాలుగా విడుదలైన సింగిల్.. శుభం మూవీలు ఫర్లేదనిపించాయి. జూన్ విషయానికి వస్తే ‘కుబేర’ మూవీ అంచనాలకు మించిన కలెక్షన్లను సాధించి కాసింత ఊరటను ఇచ్చింది. తన జానర్ కు భిన్నంగా శేఖర కమ్ముల తీసిన ఈ మూవీ అనూహ్య విజయాన్ని సాధించటమే కాదు.. కలెక్షన్లు సాధించటం ద్వారా బాక్సాఫీసు కాస్తంత కళకళలాడేలా చేసింది.

జులై లో చిన్నాపెద్దా.. డబ్బింగ్ సినిమాలతో కలుపుకుంటే దాదాపు ఇరవైకు పైనే సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయ్యాయి. ఇందులో విజయదేవరకొండ నటించిన కింగ్డమ్ ఒక్కటే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అదే సమయంలో భారీ కలెక్షన్లను సాధించటంలో మాత్రం వెనుకపడిందన్న టాక్ వచ్చింది. ఈ నెలాఖరులో విడుదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు మూవీకి భారీగా ఓపెనింగ్స్ వచ్చినప్పటికి.. వీకెండ్ తర్వాత తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా విడుదలైన తర్వాతి రోజు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మహావతార్ నరసింహ మూవీకి అనూహ్య రీతిలో విజయం సాధించటమే కాదు.. ఒకదశలో టికెట్లు దొరకని పరిస్థితి. సినిమా విడుదల వేళ.. పరిమిత షోలు వేసిన ఈ మూవీ.. ఆ తర్వాత షోలు పెంచటమే కాదు.. స్క్రీన్లను భారీగా పెంచటం.. దాదాపు మూడు వారాల పాటు ఈ మూవీ హవా నడించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన అదిరే కలెక్షన్లను సాధించిన మూవీగా నిలిచింది.

ఆగస్టులో భారీ సినిమాలు విడుదలయ్యాయి. రజనీకాంత్, నాగార్జున నటించిన కూలీ.. ఎన్టీఆర్ హ్రతిక్ రోషన్ నటించిన వార్ 2 డబ్బింగ్ మూవీలు మంచి ఓపెనింగ్స్ ను రాబట్టినా.. ఆ జోరును తర్వాత కంటిన్యూ చేయటంలో మాత్రం తడబడ్డాయనే చెప్పాలి. జులైలో విడుదలైన కింగ్డమ్ కొంతమేర లాగిందనే చెప్పాలి. జులై చివర్లో విడుదలైన మహావతార్ నరసింహ మూవీ ఆగస్టులోనూ మంచి కలెక్షన్లను సాధించింది.

సెప్టెంబరులో ఇప్పటివరకు విడుదలైన మూవీల విషయానికి వస్తే.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బుజ్జి చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ సంచలన విజయాన్ని సాధించటమే కాదు.. బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఈ వారం విడుదలైన మిరాయ్.. కిష్కిందపురి చిత్రాల టాక్ బాగుందనే మాట వినిపిస్తోంది. ‘మిరాయ్’ సంచలన విజయాన్ని సాధించినట్లుగా చెబుతున్నారు. ఈ మూవీ విడుదలైన తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా రూ.27.20కోట్ల కలెక్షన్లను సాధించినట్లుగా మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. రెండో రోజు మాత్రమే కాదు ఆదివారం కూడా వంద శాతం ఆక్యుపెన్సీ రేటుతో ఈ మూవీ దూసుకెళుతోంది. దీంతో.. రికార్డు కలెక్షన్లు ఈ మూవీకి ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇదంతా చూసిన తర్వాత అర్థమయ్యేది ఒక్కటే. ఇప్పుడు తెలుగు సినిమాకు స్టార్ హీరో ‘కథ’ మాత్రమే. అంతకు మించి మరింకేమీ కాదన్నది అర్థమవుతుంది. మిగిలిన మూడున్నర నెలల్లో ఈ వాదన తప్పన్నట్లుగా తేలుతుందేమో చూడాలి.

Tags:    

Similar News