మీద పడుతుంటే తోసేసిన నటి.. సెలబ్రిటీల వ్యక్తిగత పరిమితులపై చర్చ!
బాలీవుడ్ నటి తారా సుతారియా ఇటీవలే యష్ సరసన `టాక్సిక్` చిత్రంలో కనిపించిన సంగతి తెలిసిందే. తనదైన అందం, అద్భుత నటప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక `టాక్సిక్`కి టాక్ ఎలా ఉన్నా తారా సుతారియాకు మాత్రం సౌత్ లోను భీభత్సమైన ఫాలోయింగ్ పెరిగింది. అలాగే తారా సోషల్ మీడియాల్లోను జరంగా యాక్టివ్ గానే ఉంది.
ఇటీవల తనను అతిగా తాకేలా ముందుకు వచ్చిన ఒక ఫోటోగ్రాఫర్ (పాపరాజ్జీ) కెమెరాను తోసివేసిన వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ముంబైలోని రెయినీ సీజన్ లో ఒక ప్రదేశంలో తారా వెళ్తుండగా.. తనకు అత్యంత సమీపంలోకి వచ్చి ఫోటోలు తీయడానికి ప్రయత్నించిన ఒక ఫోటోగ్రాఫర్‌ను తారా ధైర్యంగా అడ్డుకుంది. అతడి కెమెరాను దూరంగా నెట్టేసే ప్రయత్నం చేసింది. ఈ సంఘటన సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛ - ప్రైవసీకి సంబంధించిన పరిమితులపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది.
సోషల్ మీడియా వేదికగా.. ముఖ్యంగా ప్రసిద్ధ ఫోరమ్ రెడ్డిట్ లో ఈ నటి ప్రవర్తనకు విశేషమైన మద్దతు లభించింది. నటీనటులు- ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలు- ప్రసార మాధ్యమాల పేరుతో ఎదుర్కొంటున్న వేధింపుల విషయంలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. తారా తన వ్యక్తిగత సరిహద్దులను కాపాడుకోవడానికి తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని సగటు నెటిజన్లందరూ ఏకీభవించారు.
ఈ సంఘటన నగరాల్లో మీడియా పరిధి దాటి ప్రవర్తిస్తున్న వ్యక్తుల సంస్కృతిపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇలా సమీపానికి వెళ్లి క్లిక్ చేయాలనుకోవడం వంటి పద్ధతులు అసభ్యకరంగా ఉన్నాయని పలువురు విమర్శించారు. సెలబ్రిటీల చుట్టూ ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సరైన రక్షణ లేదా భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై కూడా ఆందోళన వ్యక్తమైంది.
సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు కంగారుపడి గమ్మున ఉండిపోతారని.. కానీ తారా సుతారియా క్షణాల్లో స్పందించి తన పరిధిని స్పష్టం చేయడం ప్రశంసనీయమని నెటిజన్లు కొనియాడారు. సోషల్ మీడియాలో కొంతమంది దీనిని విమర్శించడానికి ప్రయత్నించినా.. అత్యధికులు ఇది ఆత్మరక్షణలో భాగంగా చేసిన సరైన చర్యగానే అభివర్ణించారు.
మొత్తానికి ఈ ఉదంతం భారతీయ మీడియా - పాపరాజ్జీ సంస్కృతిలో మార్పు రావాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. వ్యూస్ .. వైరల్ కంటెంట్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సరికాదని నెటిజన్లు గట్టిగా నిరసిస్తున్నారు. వినోద పరిశ్రమలో ఇటువంటి ప్రవర్తనలకు సరైన నిబంధనలు రూపొందించకపోతే ఇదే తరహాలో వివాదాలు పునరావృతమవుతూనే ఉంటాయి.