గ‌ద్ద‌ర్ అవార్డుల‌పై వెట‌ర‌న్ ద‌ర్శ‌కనిర్మాత బిగ్ కామెంట్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన `గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ - 2025` పారదర్శకతపై చిత్ర పరిశ్రమలో ఆసక్తికర చర్చ మొదలైంది.;

Update: 2026-03-10 04:12 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన `గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ - 2025` పారదర్శకతపై చిత్ర పరిశ్రమలో ఆసక్తికర చర్చ మొదలైంది. సాధారణంగా సినిమా అవార్డులు అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాయి. జ్యూరీ సభ్యులపై ఒత్తిళ్లు ఉంటాయని, ఎంపికలో రాజకీయం జరుగుతుందనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో వెటరన్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవార్డుల ఎంపిక ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా సాగిందని ఆయన నొక్కి చెప్పారు.

గద్దర్ అవార్డుల విజేతల ప్రకటన సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో తమ్మారెడ్డి తనదైన శైలిలో చమత్కరించారు. ``నేను ఎప్పుడూ మైక్ పట్టుకుంటే ఎవరిని తిడదామా అని చూస్తుంటాను.. కానీ ఈసారి దిల్ రాజు గారు ఆ ఛాన్స్ ఇవ్వలేదు`` అని ఆయన అనడం విశేషం. తెలంగాణ ఎఫ్.డి.సి అధ్య‌క్షుడు దిల్ రాజు సారథ్యంలో ఈ పుర‌స్కారాల‌ను ప్రెజెంట్ చేయ‌గా, జ్యూరీ ఏ ధైర్యంతో ఈ అవార్డులు ఇచ్చారో అర్థం కావడం లేదంటూనే, ఎంపికలో ప్రతిభకు మాత్రమే పెద్దపీట వేశారని ఆయన కితాబు ఇచ్చారు. తన లాంటి విమర్శకుడికి కూడా తప్పు పట్టే అవకాశం ఇవ్వనంత పారదర్శకత ఇక్కడ కనిపించిందని ఆయన భావం.

సుమారు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు మళ్ళీ ప్రభుత్వ అధికారిక అవార్డులు దక్కడం ఒక శుభపరిణామమని తమ్మారెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సినిమా అవార్డులను విస్మరించాయని, కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో వీటిని పునరుద్ధరించడం గొప్ప విషయమన్నారు. గద్దర్ పేరు కలవడంతో ఈ పురస్కారాలకు నైతిక విలువ, ప్రత్యేక గౌరవం చేకూరిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈసారి అవార్డుల ఎంపికలో కేవలం స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలకే కాకుండా.. చిన్న చిత్రాలకు.. ఓటీటీ కంటెంట్‌కు కూడా సమాన ప్రాధాన్యత లభించింది. `ఈటీవీ విన్` లాంటి ప్లాట్‌ఫామ్స్ అందిస్తున్న నాణ్యమైన కంటెంట్‌ను గుర్తించి.. `రాజు వెడ్స్ రాంబాయి` వంటి చిన్న సినిమాకు ఉత్తమ చిత్ర పురస్కారం అందించడం జ్యూరీ తీసుకున్న సాహసోపేతమైన సరైన నిర్ణయమని తమ్మారెడ్డి కొనియాడారు. కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా.. కళాత్మక విలువలను ప్రామాణికంగా తీసుకున్నామని స్పష్టం చేశారు.

రాజకీయ జోక్యం లేకుండా జ్యూరీ సభ్యులందరూ ఏకాభిప్రాయంతో విజేతలను ఎంపిక చేశారని ఆయన వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ప్రకటించడం దగ్గర నుంచి.. ఇతర సాంకేతిక విభాగాల వరకు అర్హులకే పట్టం కట్టామని తెలిపారు. 14 విభాగాల్లో ప్రకటించిన ఈ అవార్డులు ఇండస్ట్రీలోని కళాకారులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని..అవార్డులు రాని వారు నిరాశ చెందకుండా మరింత మెరుగైన సినిమాలు తీసేందుకు ఇది ఒక ప్రేరణగా నిలవాలని ఆయన సూచించారు.

చివరగా.. తెలంగాణ సంస్కృతిని, కళలను ప్రతిబింబించేలా ఈ అవార్డుల రూపకల్పన జరిగిందని తమ్మారెడ్డి వివరించారు. ఉగాది పర్వదినం నాడు జరిగే ఈ ప్రదానోత్సవం సినీ పండుగలా సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే పారదర్శకతతో, నిరంతరాయంగా అవార్డుల ప్రక్రియ కొనసాగాలని అప్పుడే సినీ కళాకారులకు నిజమైన గౌరవం దక్కుతుందని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

Tags:    

Similar News