బాలీవుడ్ చేస్తున్న తప్పు అదే అందుకే ఇలా
హిందీ చిత్రసీమలో చాలా మంది స్క్రిప్టుల్ని ఇంగ్లీష్ సినిమాలు చూసి రాస్తున్నారని, వారు తమ నేటివిటీకి, సంస్కృతికి దగ్గరగా ఉండే కథల్ని రాయడం లేదని విశ్లేషించారు.;
వందల కోట్ల బడ్జెట్లు వెచ్చిస్తున్నా, అగ్ర హీరోలు నటిస్తున్నా బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఆశించిన విజయాల్ని అందుకోలేక చతికిలబడుతున్నాయి? పరిమిత బడ్జెట్ లో సినిమాలు తీసి సౌత్ లో వందల కోట్లు ఎలా కొల్లగొడుతున్నారు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేసాడు ట్రేడ్ అనలిస్ట్, విమర్శకుడు సుమిత్ కాడెల్.
హిందీ చిత్రసీమలో చాలా మంది స్క్రిప్టుల్ని ఇంగ్లీష్ సినిమాలు చూసి రాస్తున్నారని, వారు తమ నేటివిటీకి, సంస్కృతికి దగ్గరగా ఉండే కథల్ని రాయడం లేదని విశ్లేషించారు. లోకా, మిరాయ్, హనుమాన్, కాంతారా, మిన్నల్ మురళి వంటి చిత్రాలను పరిశీలిస్తే.. పరిమిత బడ్జెట్లో అందమైన కథల్ని తెరకెక్కించడానికి సాంకేతికత బడ్జెట్ ని నిజాయితీగా కేటాయించారని, తెలివిగా ఖర్చు చేస్తున్నారని విశ్లేషించారు. హిందీ చిత్రసీమలో అలా కాకుండా వందల కోట్ల బడ్జెట్లను కేటాయిస్తే, దానిలోంచి హీరో- దర్శకుడికే 60శాతం బడ్జెట్ వెళ్లిపోతోందని, క్వాలిటీ ప్రొడక్ట్ కోసం పెట్టుబడి పెట్టడం లేదని, దీని కారణంగా విజువల్స్ రాజీ పడి తెరకెక్కించినట్టు కనిపిస్తున్నాయని అతడు విమర్శించాడు. మంచి కథను చెప్పడంపైనా హిందీ ఫిలింమేకర్స్ దృష్టి సారించడం లేదని కూడా విశ్లేషించాడు.
భారీ బడ్జెట్లు నిర్మాతలు కేటాయిస్తున్నా కానీ, దానిని అవసరం అయిన చోట ఖర్చు చేయడం లేదని కూడా అతడు విశ్లేషించాడు. సమకాలీన బాలీవుడ్ రచయితలు సంస్కృతి సాంప్రదాయం, హృదయాన్ని తాకే అద్భుతమైన కథలను ఎంచుకోవడం లేదు. పాశ్చాత్య సినిమాల నుంచి కాపీ కొట్టిన కథల్ని ఎంపిక చేసుకుంటున్నారని విమర్శించారు. సెట్లలో ఇంగ్లీష్ మాట్లాడే మనుషులు నేటివిటీ సినిమాలను తీయలేరని కూడా విశ్లేషించాడు. పెద్ద పట్టణాల నుంచి వచ్చేవారి కంటే చిన్న సిటీల నుంచి వచ్చే రచయితలకు వెయిటేజీ పెంచితే వారి కథలు రియాలిటీకి నేటివిటీకి చేరువగా ఉంటాయని కూడా సూచించారు. బాలీవుడ్ సినిమాల్లో మంచి కథ లేకపోవడానికి, ఆత్మ లేకపోవడానికి కారణాలేమిటన్న దానిపై అనలిస్ట్ సుమిత్ విశ్లేషణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.