చిన్న సినిమా టీం సెటైర్ కరెక్టే

శ్రీ చిదంబరం గారు అని ఓ చిన్న సినిమా. గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు టీం చిన్న ప్రమోషనల్ వీడియో చేసింది.;

Update: 2026-02-10 09:52 GMT

శ్రీ చిదంబరం గారు అని ఓ చిన్న సినిమా. గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు టీం చిన్న ప్రమోషనల్ వీడియో చేసింది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల తీరు ఎలా ఉందో సెటైరికల్‌గా చూపించారు టీం మెంబర్స్. ఈ చిత్రాన్ని నేరుగా తెలుగులో రిలీజ్ చేస్తే చూడరని.. దాని బదులు మలయాళంలోకి డబ్ చేసి ముందుగా ఆ భాషలో రిలీజ్ చేస్తే బాగుంటుందని.. అప్పుడు ఆడియన్స్ ఈ సినిమా చూసి ఆహా ఓహో అంటారని.. ఆ తర్వాత తెలుగులో రిలీజ్ చేస్తే మంచి ఫలితం వస్తుందంటూ టీం మెంబర్స్ మధ్య సంభాషణ సాగింది. మలయాళ సినిమాల మీద మన వాళ్ల మోజు ఎలాంటిదో ఇందులో సెటైరికల్‌గా చెప్పారు. తెలుగులో అలాంటి కంటెంట్ రిచ్ సినిమాలు వస్తే పట్టించుకోరన్నట్లు కూడా సంకేతాలు ఇచ్చారు.

ఐతే ఈ వీడియో చూసి కొందరు పాజిటివ్‌గా స్పందిస్తే.. ఇంకొందరేమో మలయాళ సినిమాలతో మన చిత్రాలకు పోలికా అంటూ కౌంటర్లు వేశారు. కట్ చేస్తే ‘శ్రీ చిదంబరం గారు’ శుక్రవారం రిలీజైంది. చూసిన వాళ్లంతా ఇది మంచి ప్రయత్నం అనే అన్నారు. నిజంగానే మలయాళ సినిమాలను గుర్తు చేసేలా విభిన్న కథాంశంతో, నేటివ్ ఫన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుననే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. గత వీకెండ్లో అరడజనుకు పైగా తెలుగు చిత్రాలు విడుదల కాగా.. అందులో ది బెస్ట్ ‘శ్రీ చిదంబరం గారు’నే అనడంలో సందేహం లేదు.

ఈ ప్రయత్నానికి కచ్చితంగా ప్రేక్షకుల ప్రోత్సాహం అందాల్సిందే. కానీ థియేటర్లలో చూస్తే జనం లేరు. పేరున్న నటీనటులు లేకపోవడం, సినిమా గురించి జనానికి రిలీజ్ ముంగిట పెద్దగా తెలియక పోవడం, అన్ సీజన్లో బోలెడన్ని చిన్న సినిమాల మధ్య రిలీజ్ కావడం.. ఇలా రకరకాల కారణాల వల్ల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆశించినంతగా థియేటర్లకు రావట్లేదన్నది స్పష్టం. మొత్తానికి రిలీజ్ ముంగిట టీం చేసిన సెటైరికల్ వీడియో కరెక్టే అనిపించేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఈ చిత్రం ఓటీటీలో రిలీజైనపుడు మాత్రం దీనికి ప్రశంసలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ థియేటర్లకు వచ్చి జనం చూసి, బాక్సాఫీస్ హిట్ చేస్తేనే ఏ చిత్ర బృందానికైనా సంతృప్తి కలుగుతుంది.

Tags:    

Similar News