స‌క్సెస్ కోసం కొత్త బాట‌ప‌ట్టిన టిల్లు?

ఒకే త‌ర‌హా క‌థ‌లు, క్యారెక్ట‌ర్ల‌తో ప్రేక్ష‌కుల్ని ప్ర‌తీసారి మెప్పించ‌లేం. ఒక‌సారి హిట్టు వ‌చ్చింద‌క‌దా అని అదే క్యారెక్ట‌ర్‌ని కంటిన్యూ చేస్తూ కొత్త క‌థ‌ల‌తో సినిమా చేసినా పెద్ద‌గా ఫ‌లితం ఉండ‌దు.;

Update: 2025-12-29 13:43 GMT

ఒకే త‌ర‌హా క‌థ‌లు, క్యారెక్ట‌ర్ల‌తో ప్రేక్ష‌కుల్ని ప్ర‌తీసారి మెప్పించ‌లేం. ఒక‌సారి హిట్టు వ‌చ్చింద‌క‌దా అని అదే క్యారెక్ట‌ర్‌ని కంటిన్యూ చేస్తూ కొత్త క‌థ‌ల‌తో సినిమా చేసినా పెద్ద‌గా ఫ‌లితం ఉండ‌దు. కంటెంట్ ప్ర‌ధానంగా లేక‌పోతే అవి ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేవు అన్న‌ది ఇటీవ‌ల ప్ర‌తి హీరో విష‌యంలో నిరూపితం అవుతూనే ఉంది. ఈ లాజిక్‌ని మ‌రిచి అదే డైలాగ్ డెలివ‌రీ, క్యారెక్ట‌రైజేష‌న్‌తో సిద్దూ చేసిన మూవీస్ జాక్‌, తెలుసు క‌దా బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచాయి. డీజే టిల్లు, డీజే టిల్లు స్క్వేర్ సినిమాల‌తో హీరోగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌.

2022, 2024లో విడుద‌లైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లుగా నిలిచి సిద్దూకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. మార్కెట్ స్థాయిని కూడా పెంచ‌డంతో సిద్ధూ కొత్త త‌ర‌హా సినిమాల‌కు వెల్క‌మ్ చెప్ప‌డం మొద‌లు పెట్టాడు. అందులో భాగంగా చేసిన `జాక్‌`, `తెలుసు క‌దా` చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ ప‌రిచాయి. ఒకే త‌ర‌హా క్యారెక్ట‌రైజేష‌న్‌తో సినిమాలు చేస్తే అవి పెద్ద‌గా ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌లేవ‌ని స్ఫ‌ష్టం చేశాయి.

ఈ రెండు సినిమాల ఫ‌లితం కెరీర్‌పై ఎఫెక్ట్ ఇవ్వ‌డంతో ఆలోచ‌న‌లో ప‌డిన స్టార్ బాయ్ ఇప్పుడు హిట్టు కోసం కొత్త బాట‌ప‌ట్ట‌బోతున్నాడు. ర‌వికాంత్ పేరేపు ద‌ర్శ‌క‌త్వంలో సితార బ్యాన‌ర్‌లో `బ‌దాస్‌` మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అయితే ఇది ఆగిపోవ‌డంతో దాని ప్లేస్‌లో మ‌రో క్రేజీ సినిమాకు శ్రీ‌కారం చుడుతున్న‌ట్టుగా తెలుస్తోంది. న‌వీన్ పొలిశెట్టి హీరోగా `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ` మూవీని రూపొందించి తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న స్వ‌రూప్ ఆర్ ఎస్ జె డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ని తెలిసింది.

స్టార్ బాయ్ సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ పంథాకు పూర్తి భిన్నంగా సాగే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా దీన్ని స్వ‌రూప్ ఆర్ ఎస్ జె తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇటీవ‌లే స్టోరీని సిద్దూకు వినిపించాడ‌ట డైరెక్ట‌ర్‌ స్వ‌రూప్ ఆర్ ఎస్ జె. క‌థ బాగా న‌చ్చ‌డంతో సింగిల్ సిట్టింగ్‌లోనే స్టోరీని సిద్దూ ఫైన‌ల్ చేసిన‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మించ‌నున్నార‌ని తెలిసింది.

వ‌రుస ప‌రాజ‌యాల‌తో రేసులో వెన‌క‌బ‌డిని సిద్ధూ ఈ మూవీతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌స్తాన‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడ‌ని చెబుతున్నారు. అన్నీ ఫైన‌ల్ అయితే వ‌చ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డం కాయ‌మ‌ని తెలుస్తోంది. దీని త‌రువాత త‌న‌కు క‌లిసొచ్చిన టిల్లుని మ‌ళ్లీ రంగంలోకి దించేయ‌డానికి రెడీ అవుతున్నాడు. `టిల్లు సిరీస్‌లో భాగంగా రానున మూడ‌వ సినిమాగా `టిల్లు క్యూబ్‌` చేయ‌బోతున్నాడు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి.

Tags:    

Similar News