8 వారాల ఓటీటీ విండో చిన్న నిర్మాతలకు వరమా? శాపమా?
తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల ఉనికిని కాపాడేందుకు ఓటీటీ రిలీజ్ విండోను 8 వారాలకు పెంచాలనే నిర్ణయం ఇప్పుడు చిన్న నిర్మాతలకు పెద్ద సవాలుగా మారింది.;
తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల ఉనికిని కాపాడేందుకు ఓటీటీ రిలీజ్ విండోను 8 వారాలకు పెంచాలనే నిర్ణయం ఇప్పుడు చిన్న నిర్మాతలకు పెద్ద సవాలుగా మారింది. ఈ నిబంధన వల్ల థియేటర్లకు ఆడియన్స్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ చిన్న నిర్మాతల ఆర్థిక పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారుతోంది. ముఖ్యంగా సినిమా విడుదలైన తర్వాత ఓటీటీ నుండి వచ్చే ఆదాయం ఆలస్యమైతే వారు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి మరింత కుంగిపోయే ప్రమాదం ఉందని ఇండస్ట్రీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే చిన్న నిర్మాతలను ఆదుకోవడానికి టాలీవుడ్ పెద్దలు కొన్ని ప్రతిపాదిత పరిష్కారాలపై దృష్టి సారించాలన్న చర్చ సాగుతోంది. ఎనిమిది వారాల విండోపై అగ్ర నిర్మాతలు చర్చలకు ప్రతిపాదిస్తున్న క్రమంలో ఈ చర్చ ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ సమస్యకు ప్రధాన పరిష్కారంగా ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక వర్చువల్ రిస్క్ ఫండ్ లేదా సబ్సిడీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఇదివరకే తెరపైకి వచ్చింది. 8 వారాల నిబంధనను కచ్చితంగా పాటించే క్రమంలో ఆర్థికంగా ఇబ్బంది పడే చిన్న నిర్మాతలకు.. ఆ కాలానికి అయ్యే వడ్డీ భారాన్ని పంపిణీదారుల సంఘం లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కొంతవరకు భరించేలా ఒక మెకానిజం రూపొందించాలని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ నిధిని ఎలా సమకూర్చాలి? ఎవరికి పంపిణీ చేయాలనే విషయంలో ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు అందరికీ ఒకే నిబంధన కాకుండా ఫ్లెక్సిబుల్ కలెక్షన్ బేస్డ్ విండో ఉండాలని కొందరు నిర్మాతలు కోరుతున్నారు. అంటే ఒక చిన్న సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో థియేటర్ల వద్ద ఆశించిన వసూళ్లు రాకపోతే (70 శాతం కంటే ఎక్కువ డ్రాప్ ఉంటే) అటువంటి సినిమాలకు 8 వారాల వరకు ఆగాల్సిన పని లేకుండా 4 వారాలకే ఓటీటీకి వెళ్లే వెసులుబాటు కల్పించాలని ప్రతిపాదించారు. దీనివల్ల థియేటర్లలో ఆడని సినిమాను అనవసరంగా హోల్డ్ చేసి నిర్మాతపై వడ్డీ భారం పెంచకుండా కాపాడవచ్చని వారి వాదన.
ఆర్థిక భారానికి ఉపశమనం కలిగించే మరో మార్గంగా థియేటర్ అద్దెల్లో రాయితీలు గురించి చర్చలు జరుగుతున్నాయి. చిన్న సినిమాలు 8 వారాల నిబంధనను పాటిస్తున్నందుకు బదులుగా.. వారి సినిమాలకు అయ్యే క్యూబ్ యూఎఫ్ వో ఛార్జీలు.. థియేటర్ అద్దెల్లో రాయితీలు ఇప్పించేలా డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇది నేరుగా నగదు రూపంలో సహాయం కాకపోయినా.. పరోక్షంగా నిర్మాతకు ఖర్చు తగ్గించే ప్లాన్ అని భావిస్తున్నారు.
పరిశ్రమ పెద్దల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతానికి ప్రాధాన్యత అంతా `సినిమాను థియేటర్లో నిలబెట్టాలి` అనే అంశానికే ఉంది. అయితే చిన్న నిర్మాతల విషయంలో అందరికీ ఒకే రూల్ అనే పద్ధతి సరికాదని వారు అంగీకరిస్తున్నారు. అందుకే సినిమా బడ్జెట్ .. దాని థియేట్రికల్ పెర్ఫార్మెన్స్‌ను బట్టి ఈ 8 వారాల రూల్‌లో అవసరమైన మార్పులు చేసేలా ఒక ఫైనల్ ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేస్తున్నారని కూడా గుసగుస వినిపిస్తోంది.
అంతిమంగా చిన్న నిర్మాతలను కాపాడటమే సినిమా భవిష్యత్తుకు ముఖ్యమని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం నిబంధనలు విధించడమే కాకుండా.. వాటి వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి పక్కా ప్లాన్ రూపొందించినప్పుడే చిన్న సినిమాలు బతికే అవకాశం ఉంటుంది. మరి ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ప్లాన్లపై చిన్న నిర్మాతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.