టాప్ స్టోరి: ఆ ముగ్గురు సెల‌బ్రిటీ పెళ్లిళ్ల ఖ‌ర్చు 100 కోట్లు?

దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైందంటే చాలు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి దృష్టి అంగరంగ వైభవంగా జరిగే వివాహ వేడుకలపైనే ఉంటుంది;

Update: 2026-03-05 18:36 GMT

దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైందంటే చాలు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి దృష్టి అంగరంగ వైభవంగా జరిగే వివాహ వేడుకలపైనే ఉంటుంది. గతంలో అనంత్ అంబానీ వివాహం కోసం సుమారు రూ. 5000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల వరకు ఖర్చు చేశారని కథనాలు రాగా.. ఆ తర్వాత గాదిరాజు వారి పెళ్లి కూడా కోట్ల రూపాయల వ్యయంతో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అదే పంథాలో టాలీవుడ్ ప్ర‌ముఖులు స‌హా జాతీయ స్థాయిలో మూడు భారీ సెలబ్రిటీ వివాహాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మూడు ఈవెంట్ల మొత్తం ఖర్చు దాదాపు రూ. 60 కోట్ల నుంచి 1000కోట్లు ఉంటుందని అంచనా.

ముందుగా టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్- నైనికల వివాహ వేడుక గురించి చెప్పుకోవాలి. మార్చి 6న వీరి వివాహం అత్యంత సన్నిహితుల మధ్య జరగనుంది. అయితే, మార్చి 2న హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం నిర్వహించిన `ప్రీ-వెడ్డింగ్ బాష్` అత్యంత విలాసవంతంగా సాగింది. అల్లు అరవింద్ ఆయ‌న కుటుంబీకుల‌ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుక కోసం డెకరేషన్ , అతిథుల మర్యాదల నిమిత్తం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అల్లు శిరీష్ - నైనికల వివాహ వేడుకల మొత్తం బడ్జెట్ దాదాపు రూ. 15 నుండి 20 కోట్ల వరకు ఉండవచ్చని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మరోవైపు గత ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో వివాహ బంధంతో ఒకటైన స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల వెడ్డింగ్ ఖర్చుల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ జంట తమ పెళ్లి కోసం ఉదయపూర్‌లోని అత్యంత ఖరీదైన `ఐటీసీ మెమెంటోస్` రిసార్ట్‌ను ఎంచుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. వీరి వివాహ వేడుక ఖర్చులను దాదాపు రూ. 20కోట్లు ఉంటుంద‌ని, ఈ మొత్తాన్ని ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భరించిందని.. దానికి బదులుగా వివాహ స్ట్రీమింగ్ హక్కులను రూ. 30 కోట్లకు పైగా ఒప్పందం చేసుకున్నారని టాక్. ఇక మార్చి 4న‌ హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణాలో జరుగుతున్న గ్రాండ్ రిసెప్షన్ కోసం కూడా కోట్లాది రూపాయలు వెచ్చించిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి.

ఇక క్రీడా రంగం నుంచి సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ -సానియా చందోక్ ల వివాహం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఈరోజు (మార్చి 5న) ముంబైలో జరగనున్న ఈ పెళ్లికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు హాజరుకానున్నారు. అత్యంత పకడ్బందీ భద్రత మధ్య సౌత్ ముంబైలోని లగ్జరీ హోటల్‌లో జరుగుతున్న ఈ పెళ్లి బడ్జెట్ సుమారు రూ. 25 నుండి 30 కోట్లుగా ఉంటుందని అంచనా. క్రికెట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తల రాకతో ఈ వేడుక అత్యంత ఖరీదైనదిగా నిలవనుంది.

ఇలా వరుసగా మూడు భారీ ఈవెంట్లు ఒకే సమయంలో రావడం విశేషం. అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు, విజయ్-రష్మికల రాయల్ రిసెప్షన్, అర్జున్ టెండూల్కర్ వివాహం.. ఈ మూడింటినీ కలిపి లెక్కవేస్తే సుమారు రూ. 60 కోట్ల బడ్జెట్ ఈ పెళ్లిళ్ల సీజన్‌లో చుట్టూ తిరుగుతోంది. ముఖ్యంగా వేదికల ఎంపిక, డిజైనర్ దుస్తులు, దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన స్వీట్ బాక్సుల వంటి అంశాలు ఈ ఖర్చును భారీగా పెంచాయి.

ఈ సెలబ్రిటీ పెళ్లిళ్లు కేవలం వేడుకలు మాత్రమే కాదు.. విలాసవంతమైన జీవనశైలికి ..మారుతున్న వివాహ ట్రెండ్స్‌కు అద్దం పడుతున్నాయి. సామాన్యులు ఈ అంకెలను చూసి ఆశ్చర్యపోతున్నా.. వారి అభిమాన తారల పెళ్లి సందడిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ 2026 పెళ్లిళ్ల సీజన్ భారతీయ సినిమా, క్రీడా చరిత్రలో ఒక ఖరీదైన అధ్యాయంగా మిగిలిపోనుంది.

Tags:    

Similar News