ట్రెండీ స్టోరి: హాలీవుడ్‌లా రెండు గంటల లోపే!?
సినిమా నిడివి అనేది ఇప్పుడు బాక్సాఫీస్ ఫలితాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారింది.;
సినిమా నిడివి అనేది ఇప్పుడు బాక్సాఫీస్ ఫలితాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారింది. అన్ని సినిమాలు యానిమల్, దురంధర్ తరహాలో 3 గంటలు పైబడిన నిడివితో రావడం కుదరదు. దానికంటే తక్కువ నిడివి తక్కువ ఖర్చుతో మ్యాజిక్ చేసే సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. ఇది బడ్జెట్ రిస్కులను కూడా తగ్గించేందుకు ఉపకరిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సుత్తి ఎక్కువ లేకుండా స్ట్రెయిట్ గా పాయింట్ చెబుతూ వినోదం పంచే సినిమాలకు రన్ టైమ్ తక్కువ. క్రిస్ప్ రన్ టైమ్ ఫార్మాట్ లో సినిమాని తీస్తారు.. అంటే సినిమాలో అనవసరమైన సాగతీత లేకుండా కథనం వేగంగా, పకడ్బందీగా సాగడం క్రిస్ప్. సాధారణంగా ఒక సినిమా 2 గంటల లోపు (సుమారు 110 నుండి 120 నిమిషాలు) ఉంటే దానిని క్రిస్ప్ అని పిలుస్తారు. కథలో లాగ్ లేకుండా ప్రతి సన్నివేశం తదుపరి సీన్‌కు బలాన్ని ఇస్తూ సాగితే అది ప్రేక్షకుడికి బోర్ కొట్టించదు.
రన్ టైమ్ తగ్గిస్తే ప్లస్ అవుతుందా?
అయితే ఇది సినిమా జోనర్‌పై ఆధారపడి ఉంటుంది. థ్రిల్లర్, హర్రర్, క్రైమ్ డ్రామాలకు తక్కువ నిడివి పెద్ద ప్లస్. వేగవంతమైన స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడుతుంది. అలాగే థియేటర్లలో ఎక్కువ షోలు వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మైనస్ లు ఉన్నాయి. ఎమోషనల్ డ్రామాలు, లవ్ స్టోరీలకు తక్కువ నిడివి ఒక్కోసారి మైనస్ కావచ్చు. పాత్రల మధ్య బాండింగ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి సమయం పడుతుంది. తొందరగా ముగిస్తే ఆ ఫీల్ రాకపోవచ్చు.
తెలుగు ఆడియన్స్ మైండ్‌సెట్
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు `ల్యాగ్` ఉంటే అస్సలు సహించడం లేదు. ఓటీటీల వల్ల షార్ట్ కంటెంట్‌కు అలవాటు పడటం, బిజీ లైఫ్ స్టైల్ వల్ల గంటన్నర లేదా రెండు గంటల సినిమాలకే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో హాలీవుడ్ తరహాలో `90 నిమిషాల నిడివి సినిమాలు` భారతీయ చిత్రసీమలో కూడా సర్వసాధారణం అయ్యే అవకాశం ఉంది. మారిన ఉద్యోగ సరళి, తక్కువ ఖాళీ సమయం వల్ల `షార్ట్ అండ్ స్వీట్` సినిమాలే వర్కవుట్ అవుతాయని కూడా విశ్లేషిస్తున్నారు.
2 గంటల లోపు నిడివితో హిట్ అయిన టాప్ 10 తెలుగు సినిమాలు:
1. క్షణం (1 గంట 58 ని.లు) - అడవి శేష్ కెరీర్ టర్నింగ్ పాయింట్.
2. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (సుమారు 2 గం.లు) - ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.
3. పెళ్లి చూపులు (2 గం.ల 2 ని.లు) - దాదాపు క్రిస్ప్ రన్ టైమ్.
4. హిట్: ది ఫస్ట్ కేస్ (2 గం.ల 5ని.లు) - పకడ్బందీ క్రైమ్ థ్రిల్లర్.
5. మత్తు వదలరా (2గం.ల 8ని.లు) - కొత్త తరహా ప్రయోగం.
6. విరూపాక్ష (2 గం.ల 20 ని.ల లోపే) - హర్రర్ థ్రిల్లర్.
7. గూఢచారి (2 గం.ల 27ని.లు) - ఇంచుమించు క్రిస్ప్.
8. ఈ నగరానికి ఏమైంది (2 గం.ల 10ని.లు).
9. బ్రోచేవారెవరురా (2 గం.ల 10ని.లు).
10. డీజే టిల్లు (2గం.ల 1నిమిషం) - భారీ విజయం సాధించిన క్రిస్ప్ మూవీ.
శ్రీవిష్ణు `మృత్యుంజయ్` ఇదే కేటగిరీ:
వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు `మృత్యుంజయ్` చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో వస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ 6 మార్చి 2026న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ డిజిటల్ వేదికగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. శ్రీవిష్ణు తన రెగ్యులర్ కామెడీ రూట్ మార్చి ఈసారి ఒక గ్రిప్పింగ్ సబ్జెక్ట్‌తో రాబోతుండటం సినిమాకు పెద్ద అడ్వాంటేజ్‌గా కనిపిస్తోంది.
ఈ సినిమా రన్ టైమ్ విషయంలో చిత్ర యూనిట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. `మృత్యుంజయ్` నిడివి కేవలం 1 గంట 58 నిమిషాలు మాత్రమే. ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌కు ఇంతకంటే మంచి రన్ టైమ్ ఉండదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.