శ్రీవిష్ణు 'మృత్యుంజయ్' కథ.. ఈ ఇంట్రెస్టింగ్ 'స్టోరీ' తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు లీడ్ రోల్ లో నటించిన మృత్యుంజయ్ మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుండగా.. ఆ సినిమా స్టోరీ వెనుక ఉన్న ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.;

Update: 2026-03-05 18:39 GMT

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు లీడ్ రోల్ లో నటించిన మృత్యుంజయ్ మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుండగా.. ఆ సినిమా స్టోరీ వెనుక ఉన్న ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మూవీ దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో కథ ఎలా పుట్టిందన్న విషయాన్ని వివరించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

మొదట ఆయన శ్రీవిష్ణుకు మరో కథ చెప్పారట. అది నచ్చినా, అదే తరహా స్టోరీతో మరో సినిమా చేస్తున్నానని చెప్పి హీరో పక్కన పెట్టారని తెలిపారు. అప్పుడే తన స్నేహితుడు, అప్‌ కమింగ్ దర్శకుడు వీరా కోగటం చెప్పిన నిజజీవిత సంఘటన ఆయనను బాగా ఆలోచింపజేసిందట. వృత్తిరీత్యా జర్నలిస్ట్ గా పనిచేసిన వీరా, పత్రికల్లో వచ్చే మరణ ప్రకటనల యాడ్స్ ఎలా సేకరిస్తారో వివరించారని చెప్పారు.

ప్రతి పేపర్‌ లో మార్కెటింగ్ టీమ్ ఉండి.. సంతాప ప్రకటనల కోసం ప్రత్యేకంగా వ్యక్తులు తిరుగుతారని చెప్పారట. ఎవరో చనిపోతే వారి కుటుంబాన్ని కలిసి మంచి మాటలు చెప్పి యాడ్ ఇవ్వాలని ఒప్పించే పని చేస్తారని తెలిసి తనకు కొత్తగా అనిపించిందని కిరణ్ తెలిపారు. 'రోజంతా మరణాల చుట్టూ తిరిగే ఆ వ్యక్తుల ప్రపంచం ఎలా ఉంటుందో? వారి స్నేహాలు, వారి జీవితం ఎలా ఉంటుందో?' అన్న ఆలోచన అక్కడే కథగా మారిందని కిరణ్ చెప్పారు.

అంబులెన్స్ డ్రైవర్లు, పోస్ట్‌మార్టం సిబ్బంది, శ్మశాన కార్మికులతో ఏర్పడే ఆ పరిచయాల మధ్యే వారి జీవితం సాగుతుందని తెలుసుకున్నట్లు తెలిపారు. అదే మృత్యుంజయ్ కు బేస్‌ లైన్ అయ్యిందట. ఆ కాన్సెప్ట్‌ ను నిర్మాత సందీప్ గుణ్ణం వద్దకు తీసుకెళ్లగా, వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలిపారు. 2022లో మొదలైన తమ ప్రయాణం ఇప్పుడు సినిమాగా రూపుదిద్దుకుందని చెప్పారు.

అదే సమయంలో మృత్యుంజయ్ కథకు ప్రేరణగా నిలిచిన వీరా కూడా త్వరలో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇప్పటికే సుకుమార్ టీమ్‌ లో రచయితగా పని చేస్తున్నారు. ముఖ్యంగా పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్ చిత్రాలకు రైటింగ్ డిపార్ట్మెంట్‌ లో కీలక పాత్ర పోషించారు. సీమ ప్రాంత భాష, యాస నేచురల్ గా స్క్రీన్ పైకి తీసుకురావడంలో ఆయన కృషిని సుకుమార్ కూడా ప్రశంసించారు.

ఇప్పుడు లవ్, క్రైమ్‌, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కర్నూలు బ్యాక్‌ డ్రాప్‌లో ఓ కొత్త కథను వీరా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్టుకు సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా ఉండబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. లీడ్ రోల్ లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మృత్యుంజయ్ కేవలం ఒక కమర్షియల్ మూవీ మాత్రమే కాకుండా, రియల్ లైఫ్ లోని అరుదైన యాంగిల్ ను టచ్ చేసే కథతో రాబోతోందన్న తెలియడంతో ఆడియన్స్ లో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. మరి ఆ వినూత్న కాన్సెప్ట్ ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News