ఇకపై 100కే టికెట్ అమ్మే థియేటర్లు?
థియేట్రికల్ రంగం తీవ్రమైన క్రైసిస్ లోకి వెళుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఓటీటీలు, యూట్యూబ్, డిజిటల్ వెల్లువలో ఈ దారుణమైన పరిస్థితి దాపురిస్తుందని ఆందోళన నెలకొంది.;
థియేట్రికల్ రంగం తీవ్రమైన క్రైసిస్ లోకి వెళుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఓటీటీలు, యూట్యూబ్, డిజిటల్ వెల్లువలో ఈ దారుణమైన పరిస్థితి దాపురిస్తుందని ఆందోళన నెలకొంది. అయితే ఈ పరిస్థితికి కారణం కేవలం ఓటీటీలు, యూట్యూబ్, సోషల్ మీడియాలు అని సరిపెట్టుకోకుండా వాస్తవాల్ని విశ్లేషించాల్సి ఉంది.
అలాంటి ఒక వాస్తవం టికెట్ రేటు. ఐదురుగు సభ్యులు ఉన్న ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం మల్టీప్లెక్స్ థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటే కనీస మాత్రంగా రూ.3000-5000 మధ్య ఖర్చు చేయాల్సి ఉంటుంది. టికెట్లు, కోక్, పాప్ కార్న్ కలుపుకుంటే ఈ మాత్రం వదిలించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కో టికెట్ కి 200-500 మధ్య ఖర్చు చేయాల్సి రావడం, అంతకుమించి కోలాలు, తిండి పదార్థాలకు కేటాయించాల్సి రావడంతో అది సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్ లోటుకు దారి తీస్తోంది. పర్యవసానంగా చాలా కుటుంబాలు ఇంట్లో ఓటీటీలకే అంకితమవుతున్నారని కూడా విశ్లేషిస్తున్నారు.
అయితే ఈ పరిస్థితి నుంచి ఎగ్జిబిషన్ రంగాన్ని కాపాడలేరా? అంటే... దానికి ఒక తరుణోపాయం ఆలోచించారు కింగ్ ఖాన్ షారూఖ్. 300-500 రేటు పెట్టి టికెట్ కొనేకంటే 100లోపు టికెట్ ధరకే సినిమాని వీక్షించగలిగితే? అప్పుడు జనాల్ని థియేటర్లకు రప్పించడం సులువే కదా? మెజారిటీ ప్రజల్ని థియేటర్లకు రప్పించగలిగితే ఆ మేరకు ఎగ్జిబిషన్ రంగం కోలుకునే ఛాన్సుంటుంది.
తాజాగా ముంబైలో జరుగుతున్న వేవ్స్ 2025 సమ్మిట్ లో కింగ్ ఖాన్ మాట్లాడుతూ...చిన్న పట్టణాల్లో ప్రజల్ని థియేటర్లకు రప్పించాలంటే టికెట్ ధర తక్కువగా ఉండే చవకైన థియేటర్లు అందుబాటులో ఉండాలని అన్నారు.
సింపుల్ గా మెయింటెనెన్స్ తో థియేటర్లు అందుబాటులో ఉంటే.. భారతీయ సినిమాల్ని తక్కువ ధరలకు అందించగలమని, తద్వారా ఎక్కువమంది ప్రజలు థియేటర్లకు తరలి వస్తారని ఖాన్ విశ్లేషించారు. నిజానికి పెద్ద నగరాలు, మెట్రోల్లోనే మల్టీప్లెక్సులు కేంద్రీకృతమై ఉన్నాయి. అలా కాకుండా చైనా మోడల్ లో థియేటర్ల సంఖ్య చిన్న పట్టణాల్లోను పెరగాల్సి ఉందని ఖాన్ అన్నారు. ఎక్కువ సినిమా థియేటర్లు అందుబాటులోకి వస్తే దానికనుగుణంగానే జనం థియేటర్లకు వస్తారని కూడా అన్నారు. తక్కువ ధరకు దేశంలో ఏ మూలనైనా సినిమాల్ని అందించాలంటే చైనా మోడల్ అనుసరణీయమని అన్నారు. వినోదం ఇతర రూపాల్లో అందుబాటులోకి రావడంతో థియేటర్లకు జనాల్ని రప్పించడం చాలా కష్టంగా మారిందని ఖాన్ విశ్లేషించారు.