లేడీ డైరెక్ట‌ర్ లేడీ జ‌ర్న‌లిస్ట్ ఆ ప్ర‌శ్నే వ‌ద్దు: సంగీత్ శోభ‌న్

యువ‌న‌టుడు సంగీత్ శోభ‌న్ న‌టించిన తాజా చిత్రం `రాకాస‌` ఏప్రిల్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-03-02 04:00 GMT

యువ‌న‌టుడు సంగీత్ శోభ‌న్ న‌టించిన తాజా చిత్రం `రాకాస‌` ఏప్రిల్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. నిహారిక కొణిదెల ఈ చిత్రానికి నిర్మాత‌. మాన‌స శ‌ర్మ ద‌ర్శ‌కురాలు. ఈ సినిమా టీజ‌ర్ తాజాగా విడుద‌లై వైర‌ల్ గా దూసుకెళుతోంది. టీజ‌ర్ రిలీజ్ అనంత‌రం మీడియా ఇంట‌రాక్ష‌న్ లో సంగీత్ శోభ‌న్ మాట్లాడిన విష‌యాలు ఇప్పుడు హాట్ టాపిగ్గా మారాయి.

ఈ సందర్భంగా ఒక జర్నలిస్ట్ ఆయనను ఉద్దేశించి, ``గ‌త చిత్రాల‌తో పోలిస్తే.. ఒక లేడీ డైరెక్టర్‌తో పని చేయడం మీకు ఎలా అనిపించింది?`` అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై సంగీత్ శోభన్ చాలా పరిణతితో కూడిన సమాధానం ఇచ్చారు. ఆయన స్పందిస్తూ..``మనం ఎప్పుడూ లేడీ డైరెక్టర్, లేడీ జర్నలిస్ట్ అని అనకూడదు. డైరెక్టర్ అంటే డైరెక్టరే.. జర్నలిస్ట్ అంటే జర్నలిస్టే. అక్కడ జెండర్ (లింగం) తో పని లేదు. పని చేసేటప్పుడు కేవలం వాళ్ల ప్రతిభను మాత్రమే చూడాలి తప్ప.. వారు పురుషులా లేక మహిళలా అనేది ముఖ్యం కాదు`` అని చాలా స్పష్టంగా చెప్పారు.

డైరెక్టర్ అనే వ్యక్తి ఒక సినిమాను నడిపించే కెప్టెన్. ఆ స్థానంలో ఎవరు ఉన్నా గౌరవించాలి. ఒక మహిళా దర్శకురాలితో పని చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా లేడీ డైరెక్టర్ అని ముద్ర వేయాల్సిన ప‌ని లేద‌ని, అస‌లు ఈ ప్ర‌శ్నే అన‌వ‌స‌ర‌మ‌ని సంగీత్ శోభ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. మనం ఈ మార్పును మన మాటల్లోనే మొదలుపెట్టాలి. డైరెక్టర్, జర్నలిస్ట్... ఇలా ఏ వృత్తిలోనైనా వారు చేసే పనిని బట్టి గుర్తించాలి తప్ప.. జెండర్ ఆధారంగా విభజించకూడదనే అభిప్రాయాన్ని సంగీత్ కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. ఆయన ఇచ్చిన ఈ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

ఇక తన అన్నయ్య గురించి అడిగిన ప్రశ్నకు కూడా సంగీత్ శోభన్ ఎంతో వినయంగా సమాధానమిచ్చారు. అన్న‌య్య స‌క్సెస్ చూసి మీరు మీ స‌క్సెస్ చూసి అన్న‌య్య ఎలా ఫీల‌వుతారు? అన్న ప్ర‌శ్న‌కు... సంతోష్ చాలా ఆనందం వ్య‌క్తం చేసారు. మీ అన్నయ్య స్టార్ అయిపోయారు కదా, మీపై ఆ ప్రభావం లేదా ఒత్తిడి ఉంటుందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ``మా అన్నయ్య సక్సెస్ నాకు ఎప్పుడూ గర్వకారణమే. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఇంట్లో మేమిద్దరం అన్నదమ్ముల్లానే ఉంటాం తప్ప.. అక్కడ స్టార్‌డమ్ ఉండదు. ఆయన ఎదుగుదల నాకు ఇన్స్పిరేషన్ (స్ఫూర్తి). తన సక్సెస్‌ను చూసి నేను ఒత్తిడికి లోనవ్వను.. పైగా ఎంతో సంతోషిస్తాను`` అని తన సోదర ప్రేమను చాటుకున్నారు.

చివరగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని సంగీత్ తెలిపారు. అన్నయ్య సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.. కానీ నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలి. మా ఇద్దరి దారులు వేరు.. మా స్టైల్స్ వేరు. అన్నయ్య తన కష్టంతో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు.. నేను కూడా నా సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాను. అన్నయ్య పేరు చెప్పుకుని కాకుండా, నా సొంత ప్రతిభతో ఎదగాలన్నదే నా లక్ష్యం అని సంగీత్ శోభన్ మనసు విప్పి మాట్లాడారు.

Tags:    

Similar News