స్టార్ హీరోల పాన్ ఇండియా మోజు.. సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్

ప్రస్తుత భారతీయ చిత్రసీమలో ప్రతీ పెద్ద స్టార్ హీరో కూడా `పాన్ ఇండియా` వ్యామోహంలో పడి.. భారీ బడ్జెట్, లార్జర్ దెన్ లైఫ్ యాక్షన్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నారు.

Update: 2026-08-25 16:14 GMT

ప్రస్తుత భారతీయ చిత్రసీమలో ప్రతీ పెద్ద స్టార్ హీరో కూడా `పాన్ ఇండియా` వ్యామోహంలో పడి.. భారీ బడ్జెట్, లార్జర్ దెన్ లైఫ్ యాక్షన్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో సాధారణ ప్రేక్షకులు ఒకప్పుడు అలరించిన క్యూట్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలను మిస్ అవుతున్నారనే భావన సినీ ప్రియుల్లో బలంగా వినిపిస్తోంది. ఇదే అంశంపై `రోమాంచ‌కం` ట్రైల‌ర్ ఈవెంట్ లో జ‌ర్నలిస్ట్ ప్ర‌శ్న‌కు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆస‌క్తిక‌రంగా స్పందించారు.

స్టార్ హీరోలు కేవలం మాస్, భారీ సినిమాలకే పరిమితమైపోయారనే అభిప్రాయాన్ని సందీప్ వంగా పూర్తిగా ఏకీభవించలేదు. బిగ్ స్టార్స్ హెవీ డ్యూటీ సినిమాలు చేస్తున్నా.. ఇండస్ట్రీలో ఇప్పటికీ వైవిధ్యమైన మంచి సినిమాలు వస్తూనే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు కోరుకునే రకరకాల కథాంశాలు ఇప్పటికీ తెరపైకి వస్తున్నాయని సూటిగా వ్యాఖ్యానించారు.

ఒక మూవీ ఫ్యాన్‌గా అలాంటి సినిమాలను మిస్ అవుతున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఒక దర్శకుడి అంతర్గత కోణాన్ని ఆవిష్కరించారు. సాధారణ వ్యక్తి దర్శకుడిగా మారిన తర్వాత వారి సినిమా వీక్షణ ధోరణి (సినిమా కన్జ్యూమింగ్) పూర్తిగా మారిపోతుందని వివరించారు. ఒకప్పుడు ప్రేక్షకునిగా నిరంతరం సినిమాలు చూసే వీలు ఉండేదని... కానీ ఒకసారి మేకర్‌గా మారాక థియేటర్లకు వెళ్లి చూడడం లేదా ఇతర మాధ్యమాల్లో సినిమాలు వీక్షించడం చాలా తక్కువైపోతుందని పేర్కొన్నారు.

సినిమాలు చూసే సమయం తగ్గడం వల్ల ప్రస్తుతం మార్కెట్‌లో ఓవరాల్‌గా ఎలాంటి ట్రెండ్ నడుస్తోంది? ప్రేక్షకులు ఏ తరహా సినిమాలను మిస్ అవుతున్నారు అనే పూర్తి స్థాయి సినారియోపై తనకు స్పష్టమైన ఐడియా ఉండదని సందీప్ నిజాయితీగా అంగీకరించారు. ఈ సమాధానం ద్వారా ఆయన ఏది పడితే అది మాట్లాడకుండా..తన పరిమితులను ఒప్పుకుంటూ నిజాయితీగా స్పందించే విధానం ఆక‌ట్టుకుంది.

సందీప్ వంగా చేసిన వ్యాఖ్యలు పాన్ ఇండియా ధోరణిపై ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. సృజనాత్మక రంగంలో నిరంతరం బిజీగా ఉండే దర్శకులు ప్రేక్షకుడి స్థానంలో నిలబడి ఇండస్ట్రీ ట్రెండ్‌ను గమనించడం ఎంత కష్టమో అత‌డి మాటల ద్వారా స్పష్టమవుతోంది.

`రోమాంచకం` సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు చిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రణయ్ రెడ్డి వంగ, అలాగే చిత్ర సమర్పకులు, ఇతర సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో సందీప్ వంగ మాట్లాడుతూ.. స్క్రిప్ట్ విన్నప్పుడే ఎంతో నవ్వుకున్నానని.. ఈ తరహా కామిక్ రైటింగ్ తన వల్ల కాదు కాబట్టే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చానని వెల్లడించారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా మాట్లాడిన టీమ్ సభ్యులు సినిమాపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చిత్ర కాస్టింగ్ - క్రూ విషయానికి వస్తే.. ప్రధాన తారాగణంలో సీనియర్ నటుడు ఉపేంద్ర సరికొత్త డిఫరెంట్ లుక్‌లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో ఆకట్టుకోనున్నారు. ఆయనతో పాటు కొందరు బడ్డింగ్ యంగ్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సందీప్ రెడ్డి వంగ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని నిర్మించగా, సందీప్ రెడ్డి వంగ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు ట్రైలర్ కట్ చేయడం కూడా ఒక సవాలుగా మారిందని.. ఎంటర్‌టైన్మెంట్ ఫ్లో దెబ్బతినకుండా ఉండేందుకు చిత్ర యూనిట్ సాంకేతికంగా ఎంతో జాగ్రత్తలు తీసుకుందని మేకర్స్ తెలిపారు.

Tags:    

Similar News