ఈగ మూవీ సమంత కామెంట్స్.. రీరిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్
తన కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఈగ సినిమా గురించి స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చేసిన తాజా కామెంట్స్ మరోసారి ఆ సినిమాను చర్చల్లోకి తీసుకొచ్చాయి.;
తన కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఈగ సినిమా గురించి స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చేసిన తాజా కామెంట్స్ మరోసారి ఆ సినిమాను చర్చల్లోకి తీసుకొచ్చాయి. ఈగకు సెకండ్ ఛాన్స్ వస్తే బాగుండేదని, ఆ సినిమా ఇప్పుడు రిలీజై ఉంటే ఇంకా బాగా పెర్ఫార్మ్ చేసేదేమో అన్న సమంత అభిప్రాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.
విజువల్ ఎఫెక్ట్స్ కు పెరిగిన ఆదరణ
2012లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే సంచలన విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్-ఇండియా మార్కెట్ విస్తరించింది. ఓటీటీ ప్లాట్‌ఫార్స్మ్ గ్లోబల్ ఆడియన్స్‌కు దారి తీశాయి. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రేక్షకుల్లో మరింత ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈగ మూవీ ఇప్పుడు రిలీజైతే కలెక్షన్ల పరంగా మరింత పెద్ద మైలురాయిని అందుకునేదా? అనే ప్రశ్న సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తరుణంలో, ఆయన ఫిల్మోగ్రఫీలో ఈగ మూవీకి స్పెషల్ రీరిలీజ్ వాల్యూ ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సమంత కెరీర్ ను మలుపు తిప్పిన ఈగ
ఇక సమంత కెరీర్ పరంగా చూస్తే, ఈగ మూవీ ఆమె కెరీర్లో ఓ కీలక మలుపు. బిందు పాత్రలో ఆమె చూపించిన అమాయకత్వం, ఎమోషన్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. అప్పటివరకు కమర్షియల్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన సమంతకు ఈ సినిమా నటిగా మరో మైలురాయిని అందించింది. అందుకే సమంత దృష్టిలో ఈగ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అయింది.
రీరిలీజ్ చేయాలని డిమాండ్లు
కాగా ఈగ సినిమా ఇప్పుడు వస్తే ఇంకా బాగా ఆడేదేమో అని సమంత చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ దానికి వెంటనే స్పందిస్తూ #ReReleaseEega, #EegaAgain లాంటి హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేసే పనిలో పడ్డారు. కొందరు అభిమానులు రాజమౌళి గారి బెస్ట్ ఫిల్మ్ ఇదేనంటూ కామెంట్లు చేస్తుండగా, మరికొందరు పాన్-వరల్డ్ రిలీజ్ చేస్తే ఈగ మరోసారి చరిత్ర సృష్టిస్తుంది అని అభిప్రాయపడుతున్నారు.
ఇండస్ట్రీ వర్గాల్లో కూడా రీ-రిలీజ్ ట్రెండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈగ సినిమాకు మరోసారి థియేటర్లలో అవకాశం ఇవ్వాలనే ఆలోచన తలెత్తితే ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. నాస్టాల్జియా, టెక్నికల్ బ్రిలియన్స్, స్టార్ పవర్.. ఈ మూడూ కలిసి వస్తే ఈగ మళ్లీ ఎగిరే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి సమంత వ్యాఖ్యలతో మొదలైన ఈ చర్చ, రీ-రిలీజ్ దిశగా అడుగులు వేస్తుందా? లేక ఇది కేవలం అభిమానుల కోరికగానే మిగిలిపోతుందా? అన్నది చూడాలి.