CBI క్లీన్ చిట్ ఇచ్చినా నేను నమ్మలేదు: రియా చక్రవర్తి
బాలీవుడ్ యువకథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.;
బాలీవుడ్ యువకథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అతడి ఆత్మహత్యకు రియా చక్రవర్తి కారణమని, ఈ కేసు డ్రగ్స్ తో ముడిపడినది అని సుశాంత్ సింగ్ కుటుంబం ఆరోపించింది. రియాపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయి. ఈ కేసులో సుశాంత్ సింగ్ ప్రియురాలిగా పాపులరైన రియా చక్రవర్తి డబ్బు కోసం ఇదంతా చేసిందని కూడా ఫిర్యాదులో పేర్కొనడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. సుశాంత్ సింగ్ బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు పంపిణీ సహా చాలా విషయాలను ఈడీ పరిశోధించింది. డ్రగ్స్ కు సంబంధించిన విషయాలను ఎన్సీబీ దర్యాప్తు చేసింది.
ఈ కేసును చివరికి సీబీఐకి అప్పగించడంతో దర్యాప్తు అవిరామంగా కొనసాగింది. సీబీఐ, ఎన్సీబీ దర్యాప్తు ఓవైపు, ఈడీ విచారణ మరోవైపు రియా చక్రవర్తిని ఉక్కిరిబిక్కిరి చేసాయి. రియా, ఆమె సోదరుడు అరెస్ట్ అయ్యాక గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారులు ఈ కేసులో పరిణామాలను డాక్యుమెంట్ చేసారు. కానీ చివరికి రియా చక్రవర్తి నిర్ధోషి అంటూ సీబీఐ సంచలన ప్రకటన వెలువరించింది. సుశాంత్ సింగ్ హత్యతో రియాకు ఎలాంటి సంబంధం లేదని ఏజెన్సీ నిర్థారించింది.
అయితే సీబీఐ ఈ ప్రకటన చేసినప్పుడు మొదట మీడియాను రియా చక్రవర్తి నమ్మలేకపోయానని తెలిపింది. మీడియా ఎప్పుడూ తప్పుడు కథనాలు వండి వారుస్తుంది. అందువల్ల నమ్మలేదు! అని చెప్పింది. ``అన్ బ్రోకెన్: రైటింగ్ ది నెక్స్ట్ చాప్టర్`` పేరుతో ఎన్డీటీవీ యువ 2025 కాన్‌క్లేవ్ లో రియా మాట్లాడారు. తనకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన క్షణంలో తాను తన కుటుంబం చాలా ఎమోషన్ కి గురయ్యామని రియా వెల్లడించింది. తన సోదరుడిని పట్టుకుని చాలా సేపు ఏడ్చేసానని రియా పేర్కొంది. ఈ కేసు తన కుటుంబాన్ని తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది. ``ఆ రోజు నా ఇంట్లో అందరూ ఏడ్చారు. నేను నా సోదరుడిని కౌగిలించుకుని విలపించాను. నా తల్లిదండ్రులను చూసినప్పుడు, అంతా శాశ్వతంగా మారిపోయామని నేను గ్రహించాను. మేము ఒకే నిర్లక్ష్య కుటుంబం కాదు. ఆ క్షణం మమ్మల్ని శాశ్వతంగా మార్చేసింది`` అని రియా పేర్కొంది. మొదట మీడియాలో వార్తలు వచ్కినా కానీ, దానిని నమ్మలేదు. నా న్యాయవాది దానిని నాకు నిర్ధారించే వరకు నేను వేచి ఉన్నాను.. అని రియా తెలిపింది. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా నేను సంతోషంగా ఉండలేకపోయాను.. నా తల్లిదండ్రుల విషయంలోనే నేను సంతోషించాను.. అని తెలిపింది.
శాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించి రియా చక్రవర్తిని 8 సెప్టెంబర్ 2020న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్టు చేసింది. సుశాంత్ సింగ్ కి రియా డ్రగ్స్ అందించిందనే ఆరోపణలపైనా విచారణ సాగింది. 7 అక్టోబర్ 2020న బెయిల్ మంజూరు చేయబడటానికి ముందు దాదాపు 28 రోజులు రియా చక్రవర్తిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. నటిగా రియా చక్రవర్తి కెరీర్ ఇటీవలి కాలంలో తీవ్రంగా ప్రభావితమైంది. ప్రస్తుతం టీవీ కార్యక్రమాలతో రియా తిరిగి షైన్ అవుతోంది. రియా చక్రవర్తి తెలుగులో ఎం.ఎస్.రాజు తెరకెక్కించిన `తూనీగ తూనీగ` చిత్రంలో నటించింది.