అస‌భ్యక‌ర లిరిక్స్.. గాయ‌కుడికి మ‌హిళా క‌మీష‌న్ స‌మ‌న్లు

ఈ పరిణామం సోషల్ మీడియాలో విమర్శకులు, అభిమానుల మధ్య పెద్ద యుద్ధానికే దారితీసింది.;

Update: 2026-03-07 10:38 GMT

ప్రముఖ రాపర్, గాయకుడు బాద్షా తాజాగా ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇటీవల విడుదల చేసిన `తతీరీ` అనే హర్యాన్వీ ట్రాక్‌లోని సాహిత్యం (లిరిక్స్) అభ్యంతరకరంగా ఉందన్న ఆరోపణలతో హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ (హెచ్‌.ఎస్‌.సి.డ‌బ్ల్యూ) అత‌డికి అధికారిక సమన్లు జారీ చేసింది. ఈ పాటలో మహిళల వినయాన్ని దెబ్బతీసే విధంగా.. సాంస్కృతిక సరిహద్దులను దాటేలా.. అసభ్యకరమైన పదజాలం ఉందని ఫిర్యాదులు రావడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

మార్చి 1న విడుదలైన ఈ పాట, వచ్చిన కొద్ది రోజుల్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పాటలోని కంటెంట్‌ను సమీక్షించిన తర్వాత.. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని హర్యానా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి.. మార్చి 6న బాద్షాకు సమన్లు జారీ చేస్తూ వివాదాస్పద లిరిక్స్ పై వివరణ ఇవ్వాలని కోరింది.

ఈ పరిణామం సోషల్ మీడియాలో విమర్శకులు, అభిమానుల మధ్య పెద్ద యుద్ధానికే దారితీసింది. ఒకవైపు విమర్శకులు పాటలోని కంటెంట్‌ను తీవ్రంగా ప్రశ్నిస్తుండగా.. మరోవైపు బాద్షా అభిమానులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. హిప్ హాప్ సంస్కృతిలో ఇలాంటి `లిరికల్ షాట్స్`.. పోటీ తత్వం చాలా సాధారణమని.. దీనిని తప్పుగా అర్థం చేసుకోకూడదని అభిమానులు వాదిస్తున్నారు.

బాద్షా మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఆయన హర్యాన్వీ సంస్కృతిని, ప్రాంతీయ భాషను ప్రధాన స్రవంతి సంగీతంలోకి తీసుకువచ్చి దానికి ఒక కొత్త గుర్తింపును ఇస్తున్నారని పేర్కొంటున్నారు. హిప్-హాప్ చరిత్రను అర్థం చేసుకున్న వారికి ఈ ట్రాక్ లోని వైబ్- గుర్తింపు వెనుక ఉన్న గొప్పతనం తెలుస్తుంది! అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరికొందరు అభిమానులు మొత్తం ట్రాక్ వినకుండా కేవలం కొన్ని పదాలను పట్టుకుని విమర్శించడం సరికాదని బాద్షాకు అండగా నిలుస్తున్నారు.

ఈ వివాదంపై స్పందిస్తూ బాద్ షా ఆర్మీ 8 వంటి ఫ్యాన్ పేజీలు `తతీరీ` వంటి పాటలు ప్రాంతీయ యాసను, శబ్దాలను హిప్-హాప్ ప్రపంచంలోకి తీసుకురావడానికి సహాయపడతాయని.. ఇది సంగీత పరంగా సంస్కృతులు అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుందని వివరించారు. హిప్-హాప్ లో డిస్ కల్చర్ అనేది సర్వసాధారణమని, బాద్షా కేవలం హర్యాన్వీ ఫ్లేవర్‌ను జోడించారని వారు గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఈ వివాదం బాద్షా కెరీర్‌లో ఒక సవాలుగా మారింది. మహిళా కమిషన్ జారీ చేసిన సమన్లకు ఆయన ఏ విధంగా స్పందిస్తారో.. ఈ పాటలోని అభ్యంతరకర లిరిక్స్ పై ఆయన ఇచ్చే వివరణ ఏమిటో చూడాలి. సాంస్కృతిక ప్రాతినిధ్యం, కళాత్మక స్వేచ్ఛ అనేవి అసభ్యతకు దారితీయకూడదన్న విమర్శల నేపథ్యంలో ఈ కేసు ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Tags:    

Similar News