మెగాస్టార్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు.. గద్దర్ అవార్డ్స్‌లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్ధాలుగా స్టార్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక గౌరవం లభించింది.;
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్ధాలుగా స్టార్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ అవార్డ్స్2025లో భాగంగా ఆయనకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు ప్రదానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భారతీయ సినీ రంగానికి ఆయన అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించడం సినీ వర్గాల్లో ఆనందాన్ని నింపింది.
ఎంతోమంది హీరోలకు స్పూర్తి
తెలుగు సినిమాను తర్వాతి స్థాయికి తీసుకెళ్లేలా కృష్టి చేయడంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషి అపారమని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. 1970ల చివరలో సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన, కేవలం నటుడిగానే కాకుండా డ్యాన్సర్, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా కూడా తనదైన ముద్ర వేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, తన టాలెంట్ తో అగ్రస్థానానికి చేరుకున్న చిరంజీవి చాలా మందికి ఇన్సిపిరేషన్. ఎంతోమంది యంగ్ హీరోలకు ఆయన ఇన్సిపిరేషన్. చిరంజీవిని చూసి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు 24 క్రాఫ్ట్స్‌లోనూ ఉన్నారంటే అతిశయోక్తి లేదు.
పలు సేవలతో అపార అభిమానాన్ని సంపాదించుకున్న చిరంజీవి
తన కెరీర్‌లో యాక్షన్, కామెడీ, ఎమోషన్స్, సోషల్ మెసేజ్ లాంటి అన్ని కోణాల్లోనూ విభిన్నమైన పాత్రలను పోషిస్తూ చిరంజీవి ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ముఖ్యంగా ఆయన నటించిన ఖైదీ, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఇంద్ర, ఠాగూర్ లాంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. ఈ సినిమాలు మాత్రమే కాకుండా ఆయన నటించిన అన్ని సినిమాల్లోని స్టైల్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను దశాబ్దాలుగా ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అయితే కేవలం సినిమాల వరకే పరిమితం కాకుండా సామాజిక సేవలోనూ చిరంజీవి తన ప్రత్యేకతను చాటుకున్నారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, కంటి దానం లాంటి సేవా కార్యక్రమాలను చేపట్టి వేలాది మందికి సహాయం అందించారు. ఈ సేవల వల్ల ఆయనకు ప్రజల్లో అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు.
చిరూ ఖాతాలో ఎన్నో అవార్డులు
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టడం వెనుక ఉద్దేశం ప్రజా గాయకుడు గద్దర్ ఆత్మస్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ కళాకారులను ప్రోత్సహించడం. అదే సందర్భంలో ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు సినీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నటుడిగా ఆయనకు ఈ గౌరవం రావడం సముచితమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అవార్డును చిరంజీవికి ప్రకటించినప్పటి నుంచి సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న చిరంజీవి కళా ప్రయాణానికి ఇది మరొక గొప్ప గుర్తింపుగా నిలిచింది. భవిష్యత్ తరాల నటులకు మార్గదర్శిగా నిలిచేలా ఆయన ప్రయాణం కొనసాగుతుందనే నమ్మకాన్ని సినీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి కెరీర్లో ఎన్నో అవార్డులను అందుకోగా, ఇప్పుడు ఆయన ఖాతాలో మరో అవార్డు చేరింది. మొత్తానికి ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు మెగాస్టార్ చిరంజీవికి దక్కడం తెలుగు సినిమా గర్వించదగ్గ ఘట్టంగా నిలిచింది.