బాలయ్య, చిరు ఒకటే.. జగన్, పవన్ అంటే ఇష్టం.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కేసులను ఎదుర్కొన్న ఆర్జీవీ.. తాను ఇకపై రాజకీయాలు మాట్లాడనని ప్రతినబూనారు.;
వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కేసులను ఎదుర్కొన్న ఆర్జీవీ.. తాను ఇకపై రాజకీయాలు మాట్లాడనని ప్రతినబూనారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని తేల్చేశారు. తనను వదిలేస్తే తన బతుకేదో బతికేస్తానంటూ చెప్పుకొచ్చారు. సూపర్ హిట్ సినిమాలకు దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన వర్మ.. ప్రస్తుతం ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక ఇండస్ట్రీలో నిర్మాతల ఆదరణకు నోచుకోలేకపోయారు. కానీ, ఆయన ఒకప్పటి ఇమేజ్ ఇప్పటికి ప్రేక్షకుల్లో వర్మకు గుర్తింపు తెస్తోంది. అయితే ఇటీవల రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇతర వ్యవహారాల వల్ల వివాదాస్పదుడిగా ముద్ర పడ్డారు. కేసులు నమోదయ్యాక జ్ఞానోదయం అయిందని ప్రకటించిన వర్మ.. ఇంకెప్పుడు రాజకీయాలు మాట్లాడనని ప్రకటించారు.
అయినప్పటికీ వర్మ కనిపిస్తే మీడియా ఆయనతో ఏదో మాట్లాడించాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. సినిమాలతోపాటు రాజకీయాలపైనా వర్మను గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుంటుంది. రాజకీయాలపై మాట్లాడకుండా తప్పించుకుంటున్న వర్మ.. సినిమాల విషయంలోనూ ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇటీవల తన ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పేందుకు వివిధ టీవీ షోలకు వెళుతున్న వర్మ తీరులో కొంత మార్పు కనిపిస్తోందని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఇటీవల ఓ టీవీ చానల్ కు వెళ్లిన వర్మ.. ఆ ఇంటర్వ్యూలో వెల్లడించిన అభిప్రాయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఏపీ రాజకీయాలతోపాటు తెలుగు సినీ ప్రముఖులపై ఆర్జీవిని ప్రశ్నించగా, ఆయన చెప్పిన సమాధానాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో తనను రాజకీయాలపై ప్రశ్నించొద్దని దండం పెట్టిమరీ కోరుతున్నాడు. కానీ, జర్నలిస్టులు వర్మను వదడకుండా ప్రశ్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు వర్మ. ఇక విషయం కొస్తే ఇటీవల ఓ ప్రైవేటు చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలపై వ్యాఖ్యానించనని చెప్పిన వర్మ.. విజయవాడ వాస్తవ్యుడిగా ఏపీ ఎలా ఉందో చెప్పాలన్న ప్రశ్ననూ దాటవేశాడు. తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని చెప్పాడు.
ఆ తర్వాత చంద్రబాబు గురించి ప్రశ్నిస్తే.. తన జీవితంలో ఎప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవలేదని తెలిపారు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు కోసం తనకేమీ తెలియదని వర్మ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జగన్ సంగతేంటి? అన్న ప్రశ్నకు వర్మ నుంచి ఆసక్తికరమైన సమాధానం లభించింది. జగన్ అంటే తనకు ఇష్టమని, తాను వ్యక్తిగతంగా జగన్ ను కలిశానని చెప్పారు. తండ్రి మరణాంతరం జగన్ బలంగా నిలబడి తనను తాను మలుచుకున్న విధానం, ఎదిగిన తీరు తనకు నచ్చుతాయన్నాడు వర్మ. జగన్ లో తనకు నచ్చే క్వాలిటీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటూ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోసం ప్రస్తావిస్తూ వ్యక్తిగతంగా పవన్ అంటే తనకు ఇష్టమని చెప్పారు వర్మ. రాజకీయంగా పవన్ కోసం తనకేమీ తెలియదని చెప్పాడు. బాలయ్య కోసం అడిగితే ఆయనను తాను ఎప్పుడూ కలవలేదని, ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే ఆయన సినిమాలు చూశానని, ఇప్పుడు ఆయన సినిమాలు చూడటం లేదని వెల్లడించారు. తనకు ఆ తరహా సినిమాలు నచ్చవని కుండబద్దలు కొట్టారు. మెగాస్టార్ చిరంజీవి విషయంలోనూ అదే అభిప్రాయం ఉందని వ్యాఖ్యానించారు వర్మ. మొత్తానికి తెలుగు ప్రముఖుల్లో జగన్ పై తనకు ఉన్న అభిమానాన్ని మరోసారి బయటపెట్టారు వర్మ.