హీరోయిన్లు మాట్లాడితే ఎందుకు వివాదం చేస్తారు? వర్కింగ్ అవర్స్ పై యామీ గౌతమ్
సినీ పరిశ్రమలో హీరోయిన్ల వర్కింగ్ అవర్స్ అంశం మరోసారి చర్చకు వస్తోంది. బాలీవుడ్ నటి యామీ గౌతమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని మరోసారి తెర ముందుకు తెచ్చాయి.;
సినీ పరిశ్రమలో హీరోయిన్ల వర్కింగ్ అవర్స్ అంశం మరోసారి చర్చకు వస్తోంది. బాలీవుడ్ నటి యామీ గౌతమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని మరోసారి తెర ముందుకు తెచ్చాయి. సినిమా షూటింగ్‌లలో వర్కింగ్ అవర్స్ గురించి మహిళా నటులు మాట్లాడితే అదెందుకు వివాదంగా మారుతుందో అర్థం కావడం లేదని ఆమె పేర్కొన్నారు. నిర్మాతలు, దర్శకులు, నటుల మధ్య పరస్పర అవగాహనతోనే పని గంటలు నిర్ణయించబడతాయని, ఒక నటి తన అవసరాల గురించి చెప్పడం సహజమేనని ఆమె స్పష్టం చేశారు.
సీరియల్ నటి నుంచి సినీ నటి గా మారిన యామీ
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన యామీ గౌతమ్ తన సినీ కెరీర్ ను హిందీ టీవీ సీరియల్స్ తో స్టార్ట్ చేశారు. తర్వాత కన్నడ సినిమా ఉల్లాస ఉత్సాహ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె, నువ్విలా మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి సినిమాల్లో నటించి సౌత్ లో కూడా గుర్తింపు పొందారు. అయితే ఆమెకు అసలైన బ్రేక్ బాలీవుడ్‌లోనే వచ్చింది. విక్కీ డోనర్ మూవీ సక్సెస్ తో బాలీవుడ్ లో ఆమెకు మంచి అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత బద్లాపూర్, కాబిల్ లాంటి సినిమాలతో నటిగా తన సత్తా చాటారు. ముఖ్యంగా ఉరి సినిమా ఆమె కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచింది.
పలు సినిమాలతో నటిగా మంచి గుర్తింపు
ఇటీవల కాలంలో యామీ గౌతమ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎ థర్స్‌డే, చోర్ నికల్ కే భాగా, ఆర్టికల్ 370 లాంటి సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. అయితే ఆమె తాజా వ్యాఖ్యలు మాత్రం నటీమణుల పని పరిస్థితులపై పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్‌లో వర్కింగ్ అవర్స్ అంశం ఎంత పెద్ద టాపిక్ గా మారిందో తెలిసిందే. పని వేళల విషయంలో దీపికా పదుకొణె చేసిన స్ట్రిక్ట్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారగా, వర్కింగ్ అవర్స్ కారణంగా ఆమె పలు సినిమాలను కూడా వదులుకున్న సంగతి తెలిసిందే.
వర్కింగ్ అవర్స్ విషయంపై యామీ
రోజుకు లిమిటెడ్ వర్క్ అవర్స్ తోనే పని చేస్తానని దీపికా చెప్పడంతో కొందరు విమర్శలు చేయగా, మరికొందరు మాత్రం హీరోయిన్ల ఆరోగ్యం, వ్యక్తిగత సమతుల్యత కోసం ఇలాంటి డిస్కషన్స్ అవసరమేనని అభిప్రాయపడ్డారు. మూవీ షూటింగ్స్ కొన్ని సార్లు 12 నుంచి 16 గంటల వరకు కూడా కొనసాగుతుంటాయి. ఈ నేపథ్యంలో వర్కింగ్ అవర్స్ పై క్లారిటీ కోరడం సహజమేనని కొందరు భావిస్తున్నారు. ఇప్పుడు యామీ గౌతమ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక మహిళా నటి తన అవసరాల గురించి మాట్లాడితే దాన్ని పెద్ద సమస్యగా ఎందుకు చూపిస్తారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. సినిమా రంగంలో ప్రతి ప్రాజెక్ట్‌కు వేర్వేరు పరిస్థితులు ఉంటాయని, పని సమయాలు కూడా అందరి అంగీకారంతోనే నిర్ణయించబడతాయని చెప్పారు.
సినిమాలు వదిలేసి వ్యవసాయం చేద్దామనుకున్నా.
ఇక తన కెరీర్ గురించి మాట్లాడిన యామీ గౌతమ్, అనేక అవార్డు ఫంక్షన్లలో ఉత్తమ నటిగా నామినేషన్లు వచ్చినప్పటికీ పెద్ద అవార్డులు గెలవలేకపోయానని తెలిపారు. అయితే ప్రేక్షకుల ప్రేమే నిజమైన గుర్తింపని ఆమె అభిప్రాయపడ్డారు. మొదట్లో తాను ఎక్కువగా సీరియస్ క్యారెక్టర్లలో కనిపించడంతో కామెడీ క్యారెక్టర్లు చేయలేనని అంతా అనుకున్నారని, కానీ బాలా మూవీ తన కెరీర్ ను మలుపు తిప్పిందని, బాలా మూవీలో తనను సెలెక్ట్ చేసినందుకు ఆమెను ఎందుకు తీసుకున్నారు? ఆమె నవ్వడం ఎప్పుడైనా చూశారా అని డైరెక్టర్ కు కాల్ చేసి కొందరు అడిగారని, కానీ ఆ సినిమా తర్వాత ఆడియన్స్ నటిగా తనను చూసే విధానం మారిందని, అది జరగకపోయి ఉంటే సినిమాలను వదిలి తిరిగి హిమాచల్ కు వెళ్లి వ్యవసాయం చేయాలని డిసైడయ్యానని చెప్పారు.