ఇలాంటి సక్సెస్ ఎంతమందికి దక్కుతుంది..!
తాజాగా రవితేజకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రముఖ రచయిత కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలను చేయడం జరిగింది.;
సినిమా ఇండస్ట్రీలో గెలుపు ఓటములు చాలా కామన్. ఇండస్ట్రీలో ఎంతో మంది జాతకాలు ఒక్క శుక్రవారం మార్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కింది స్థాయి నుంచి వచ్చి స్టార్‌డం దక్కించుకుని టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారు టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. అందులో రవితేజ ఒకరు అనే విషయం తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆ స్థాయికి చేరిన హీరో అంటే కచ్చితంగా రవితేజ పేరు ముందు వరుసలో ఉంటుంది. అందుకే చాలా మంది యంగ్ హీరోలు చిరంజీవితో పాటు రవితేజను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చాం అంటూ ఉంటారు. ఇండస్ట్రీలో రవితేజ మొదట్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ను ప్రారంభించిన రవితేజ ఆ తర్వాత నటుడిగా మారి, విలన్ వేశాలు కూడా వేసి హీరోగా మారిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శం అనడంలో సందేహం లేదు.
రవితేజ కెరీర్ ఆరంభంలో...
రవితేజ కెరీర్ ఆరంభంలో వచ్చిన ప్రతి పాత్రను చేసేందుకు ఓకే చెప్పేవాడట. అంతే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసే సమయంలో ప్రతి ఒక్క పని చేసేవారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. తాజాగా రవితేజకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రముఖ రచయిత కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఇటీవల కోనవెంకట్ తన సొంత బ్యానర్‌లో బ్యాండ్ మేళం అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో కోన వెంకట్ మాట్లాడుతూ తన కెరీర్ లో రవితేజను చాలా దగ్గర నుంచి చూశాను అని, ఆయన పడ్డ కష్టం, ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి ఎదుర్కొన్న ఇబ్బందులను చూశాను అన్నాడు. అంతే కాకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్లుగా రవితేజ వ్యవహరిస్తాడు అన్నట్లుగా కోన వెంకట్ సదరు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
నిర్మాత కోన వెంకట్ ఒక ఇంటర్వ్యూలో...
ఇంకా కోన వెంకట్ మాట్లాడుతూ... ఒక సినిమా షూటింగ్ సమయంలో రవితేజ ప్రొడక్షన్ టీం ఏర్పాటు చేసిన భోజనం తింటూ ఉండగా, ఆ సినిమా నిర్మాత వచ్చి ఎవరు పడితే వారు ఇక్కడ తింటున్నారని అసహనం వ్యక్తం చేశాడట. ఆ నిర్మాత చాలా పేరున్న పెద్ద నిర్మాతగా కోన చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో రవితేజ మనసు చాలా నొచ్చుకుందట. కట్ చేస్తే కొన్నాళ్లకు రవితేజ పెద్ద హీరో అయ్యాడు. వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ నిర్మాతలకు లాభాలను పండించడం మొదలు పెట్టాడు. దాంతో ఆ సమయంలో రవితేజను అవమానిస్తూ మాట్లాడిన ఆ నిర్మాత స్వయంగా రవితేజ కార్‌వాన్ వద్దకు వచ్చి తన బ్యానర్‌లో ఒక సినిమా చేయమని అడిగేందుకు వచ్చాడట. రవితేజకు గతం గుర్తు ఉండి ఉంటుంది, కచ్చితంగా అతడితో సినిమా చేసేందుకు ఒప్పుకోడని తాను భావించాను అని, కానీ రవితేజ అలా చేయలేదని కోన వెంకట్ గతాన్ని గుర్త చేసుకున్నాడు.
హీరోగా రవితేజ సినిమా...
గతంలో నిన్ను అవమానించిన ఆ నిర్మాతను ఇప్పుడు పిలిచి డేట్లు ఇవ్వకూడదని మేము అన్నాము. కానీ అప్పుడు రవితేజ మాత్రం నన్ను అవమానించిన నిర్మాత బ్యానర్‌లో సినిమా చేసి, హిట్ కొడితేనే అసలైన సక్సెస్ అన్నట్లుగా చెప్పుకొచ్చాడట. ఆ నిర్మాతకు డేట్లు ఇవ్వడం ద్వారా రవితేజ తన మంచితనం నిరూపించుకున్నాడు. అంతే కాకుండా అసలైన సక్సెస్ ను రవితేజ అనుభవించాడని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. కష్టపడే ప్రతి ఒక్కరికీ ఇలాంటి ఒక మంచి విజయం దక్కుతుంది, జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప విజయాలు సొంతం అవుతాయని రవితేజ కెరీర్ ను చూస్తే అర్థం అవుతుంది. రవితేజను అవమానించి, ఆ తర్వాత సినిమా చేసేందుకు ప్రయత్నించిన ఆ ప్రముఖ నిర్మాత ఎవరు అని అడిగితే మాత్రం కోన వెంకట్ సమాధానం చెప్పలేదు. మీరు ఏమైనా ఆ నిర్మాత ఎవరు అనేది ఊహించగలరా...?