గోటీల ఫ్యాక్టరీతో రూ.3కోట్ల ఆదాయం.. తొలిసారి స్పందించిన రాజశేఖర్?

ఇంతటితో ఆగకుండా కొంతమంది ఏఐ క్రియేటర్స్ రాజశేఖర్ జీవిత దంపతులు ఈ గోటీల (గోళీలు) ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు కొన్ని వీడియోలు కూడా క్రియేట్ చేశారు.;

Update: 2026-03-14 10:22 GMT

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఇందులో మంచి వార్త వేగంగా వ్యాపించడం కంటే తప్పుడు వార్తలు అత్యంత వేగంగా వ్యాపిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ తప్పుడు కథనాల వల్ల చాలామంది యువత నష్టపోతున్నారు. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీల పేర్లను వాడుకొని కొంతమంది ఆకతాయిలు చేస్తున్న పనులు నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా హీరో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ మొదలు పెట్టారని, ఇందులో లక్షలాదిమంది ఉద్యోగులను తీసుకోబోతున్నారని, పైగా ఈ ఫ్యాక్టరీతో ఆయనకు మూడు కోట్ల ఆదాయం వచ్చిందని.. ఫలితంగా జీతాలు కూడా లక్షల్లో ఇస్తున్నారు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

లాభాల్లో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ..

ఇంతటితో ఆగకుండా కొంతమంది ఏఐ క్రియేటర్స్ రాజశేఖర్ జీవిత దంపతులు ఈ గోటీల (గోళీలు) ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు కొన్ని వీడియోలు కూడా క్రియేట్ చేశారు. ఇక ఇది చూసిన చాలామంది అసలు ఏఐ వీడియో అని కూడా గ్రహించలేక అసలు విషయం తెలియక ఈ విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది సినీ ఇండస్ట్రీ చెందిన వాళ్లు, ప్రముఖులు హీరో రాజశేఖర్ కి ఫోన్ చేసి మరీ అడిగారట. అయితే ఈ విషయం ఆయన వరకు వెళ్లడంతో తాజాగా హీరో రాజశేఖర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

స్పందించిన రాజశేఖర్..

తాజాగా శర్వానంద్ తో కలిసి బైకర్ సినిమాలో నటిస్తున్నారు రాజశేఖర్. ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మరొకవైపు పలు పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈ గోటిల ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన రాగా ఆయన మాట్లాడుతూ.."నాకు గోటిల ఫ్యాక్టరీ ఉందని, ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నానంటూ వైరల్ అవుతున్న వీడియోలు చూసి నా సన్నిహితులు నాకు ఫోన్ చేయడంతో అసలు విషయం తెలిసింది. ఒకపక్క ఇదేమిటమ్మా మాయ మాయ ..మరొకపక్క ఈ గోటీల ఫ్యాక్టరీ అందులో నిజం లేదు . కేవలం ఇది పుకార్లు మాత్రమే" అంటూ రాజశేఖర్ కొట్టి పారేశారు.

హెచ్చరించిన జీవిత రాజశేఖర్..

అలాగే ఈ విషయంపై ఆయన భార్య జీవిత రాజశేఖర్ కూడా స్పందించారు. ఇటీవల ఒక ఈవెంట్ కి వెళ్లిన ఈమెకు అక్కడ ఇదే ప్రశ్న ఎదురవగా ఈమె కూడా స్పందించారు." మాకు గోటీల ఫ్యాక్టరీ ఉందని, లక్షల్లో జీతాలు ఇస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆ వార్తలు విని నేను, మా ఆయన రాజశేఖర్, మా పిల్లలు అంతా నవ్వుకున్నాము. ఇలాంటివి మమ్మల్ని ఏమి చేయవు. కానీ మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి కొంతమంది .. యువతతో డబ్బులు తీసుకుంటున్న వారి వల్ల యువత నష్టపోతోంది. దయచేసి ఇలాంటివి నమ్మకండి .జాగ్రత్తగా ఉండండి" అంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు ఏది ఏమైనా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాల గురించి ఒకటికి రెండుసార్లు ఆరా తీసి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.




Tags:    

Similar News